షాబాద్, జూలై 9: నర్సరీల్లో మొక్కల సంరక్షణ పకడ్బందీగా చేపట్టాలని షాబాద్ ఎంపీడీవో అపర్ణ అన్నారు. బుధవారం రంగారెడ్డి జిల్లా షాబాద్ మండల పరిధిలోని సీతారాంపూర్ గ్రామంలో హరితహారం నర్సరీని పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ..మండలంలోని 41 గ్రామపంచాయతీల్లోని నర్సరీల్లో ఈ ఏడాది వన మహోత్సవం కార్యక్రమంలో నాటేందుకు వివిధ రకాల మొక్కలు సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు.
నర్సరీల్లో మొక్కలకు నీరు పోసి సంరక్షించాలని సిబ్బందికి సూచించారు. ఆయా గ్రామాల్లో నాటిన మొక్కలను నీరు పోసి సంరక్షించాలని ఆదేశించారు. మొక్కలు నాటితేనే వర్షాలు సమృద్ధిగా కురుస్తాయని, ప్రతి ఒక్కరూ విధిగా మొక్కలు నాటాలని తెలిపారు. ఆమె వెంట ఉపాధి హామీ ఏపీఓ వీరాసింగ్, సిబ్బంది తదితరులున్నారు.