షాబాద్, జూన్ 15: అర్హులైన వారు ప్రజాపాలనలో దరఖాస్తులు చేసుకోవాలని షాబాద్ ఎంపీడీవో అపర్ణ అన్నారు. శనివారం షాబాద్ మండల పరిషత్ కార్యాలయంలో ప్రజాపాలన దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. జిల్లా కలెక్టర్ ఆదేశానుసారం మండల పరిషత్ కార్యాలయంలో ప్రజాపాలన దరఖాస్తులు తీసుకుంటున్నట్లు తెలిపారు. లబ్ధిదారులు గతంలో దరఖాస్తు చేసుకున్న రసీదులు తీసుకురావాలని సూచించారు. గృహజ్యోతి పథకాలతో పాటు ఇతర పథకాలకు దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పిస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో ఎంపీవో హన్మంత్‌రెడ్డి, జూనియర్ అసిస్టెంట్ మల్లేశ్, సిబ్బంది ఉన్నారు.
యాచారం : ప్రజాపాలన సేవా కేంద్రాలను ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని ఎంపీపీ కొప్పు సుకన్య అన్నారు. మండల కేంద్రంలో శనివారం ప్రజాపాలన సేవా కేంద్రాన్ని ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఆరు గ్యారెంటీలకు సంబంధించిన సమస్యలపై ప్రజాపాలన కేంద్రంలో ఫిర్యాదు చేసుకోవాలన్నారు. గృహజ్యోతి, సబ్సిడీ గ్యాస్ తదితర సమస్యల పరిష్కారం కోసం ప్రజాపాలన సేవాకేంద్రం నిరంతరం అందుబాటులో ఉంటుందన్నారు. కార్యక్రమంలో ఎంపీడీవో నరేందర్‌రెడ్డి, సూపరింటెండెంట్ శైలజ, సీనియర్ అసిస్టెంట్ కృష్ణ అన్నారు.
చేవెళ్లటౌన్ : పేదలు గృహజ్యోతి పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని చేవెళ్ల మండల సూపరింటెండెంట్ రాజ్‌కుమార్ తెలిపారు. శనివారం చేవెళ్ల మండల కేంద్రంలోని మండల పరిషత్ కార్యాలయంలో కొనసాగిన ప్రజా పాలనలో గృహ జ్యోతికి సంబంధించి 8 దరఖాస్తులు వచ్చాయి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గృహజ్యోతి పథకం కింద ప్రతి పేదకుటుంబానికీ 200 చొప్పున యూనిట్ల ఉచిత విద్యుత్‌ను ప్రభుత్వం ఇస్తుందన్నారు. అందుకు దరఖాస్తు చేసుకోని వారు అర్జి పెట్టుకోవాలని తెలిపారు.
ఆమనగల్లు : ప్రభుత్వం చేపట్టిన గృహజ్యోతి, మహాలక్ష్మి పథకాలకు గతంలో దరఖాస్తు చేసుకోని వారు పురపాలక కార్యాలయంలోని ఈ సేవ కేంద్రంలో దరఖాస్తు చేసుకోవాలని మున్సిపల్ కమిషనర్ వసంత తెలిపారు. శనివారం మున్సిపల్ కార్యాలయంలో సేవా కేంద్రాన్ని ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా కమిషనర్ వసంత మాట్లాడుతూ అర్హులైన వారందరూ దరఖాస్తు చేసుకోవాలని ఆమె కోరారు.
మంచాల : మండల పరిషత్ కార్యాలయంలో ప్రజాపాలన సేవా కేంద్రాన్ని శనివారం మంచాల ఎంపీడీవో బాలశంకర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వం అభయహస్తం ఆరు గ్యారెంటీల్లో భాగంగా గతంలో దరఖాస్తులు చేసుకోని వారు సేవా కేంద్రంలో అర్జి పెట్టుకోవచ్చన్నారు. కార్యక్రమంలో ఎంపీడీవో కార్యాలయ సిబ్బంది జంగయ్యగౌడ్ పాల్గొన్నారు.