వికారాబాద్, మే 9, (నమస్తే తెలంగాణ): తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ‘పల్లె ప్రగతి’తో పల్లెల రూపురేఖలు మారాయి. గడిచిన ఏడేండ్లలో వికారాబాద్ జిల్లాలోని గ్రామాలాభివృద్ధికి రూ.574 కోట్ల నిధులను రాష్ట్ర ప్రభుత్వం కేటాయించింది. జిల్లాకు ఏటా రూ.100 కోట్లకుపైగా నిధులు మంజూరు అవుతుండగా, నెలకు పల్లె ప్రగతి, ఎస్ఎఫ్సీ కింద దాదాపు రూ.30 కోట్ల నిధులను రాష్ట్ర సర్కార్ విడుదల చేస్తున్నది. దీంతో పారిశుధ్యానికి అధిక ప్రాధాన్యతనివ్వడంతో ప్రతి పంచాయతీకి ట్రాక్టర్, ట్రాలీ, ట్యాంకర్లను అందజేశారు. ప్రతి గ్రామంలో అండర్ గ్రౌండ్ డ్రైనేజీలు, సీసీ రోడ్లు, పల్లె ప్రకృతి వనాలు, కంపోస్ట్ షెడ్లు, వైకుంఠధామాలను నిర్మించారు. ఇంటింటికీ మరుగుదొడ్ల నిర్మాణంతో పాటు నిత్యం చెత్తను సేకరించి డంపింగ్ యార్డులకు తరలించడంతో స్వచ్ఛ పల్లెలుగా మారాయి. కనీవినీ ఎరుగని రీతిలో పల్లెలు అభివృద్ధి చెందడంతో రూపురేఖలు మారి పట్టణాలను తలపిస్తున్నాయి.
బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత జిల్లాలోని గ్రామ పంచాయతీలు అభివృద్ధిలో శరవేగంగా దూసుకుపోతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం గ్రామాలాభివృద్ధికి అధిక ప్రాధాన్యానిస్తూ భారీగా నిధులిస్తూ గ్రామాలాభివృద్ధికి తోడ్పాటునందిస్తుంది. గత ఏడేండ్లలో గ్రామాలాభివృద్ధికి ప్రభుత్వం ఇస్తున్న ప్రాధాన్యతతో కనీవినీ ఎరుగనిరీతిలో అభివృద్ధి జరుగుతుంది. ప్రధానంగా రాష్ట్ర ప్రభుత్వం అమల్లోకి తీసుకువచ్చిన ‘పల్లెప్రగతి’ కార్యక్రమంతో జిల్లాలోని గ్రామ పంచాయతీల్లో సమూల మార్పులు వచ్చాయి. అంతేకాకుండా గ్రామ పంచాయతీలకు కేటాయిస్తున్న నిధులతో జరుగుతున్న అభివృద్ధితో జాతీయ స్థాయి అవార్డులను కూడా జిల్లాలోని గ్రామ పంచాతీయలకు దక్కింది. అంతేకాకుండా గతంలో ఎన్నడూలేని విధంగా పల్లెలన్నీ పచ్చదనం, పరిశుభ్రతతో కూడిన పల్లెలుగా రూపుదిద్దుకున్నాయి. అంతేకాకుండా గ్రామాలన్నీ పచ్చని చెట్లతో హరితశోభితను సంతరించుకుంటున్నాయి. గ్రామాల్లో ఎక్కడ చూసిన రోడ్లకు ఇరువైపులా మొక్కలతో పచ్చదనం దర్శనమిస్తుంది. అదేవిధంగా పల్లెప్రగతిలో భాగంగా గ్రామాల్లో సర్కార్ తుమ్మ, జిల్లెడు వంటి పిచ్చి మొక్కలను తొలగించడం, పెంట కుప్పలను తొలగించడం, రోడ్లన్నింటిని శుభ్రం చేయడం, డ్రైనేజీలను శుభ్రం చేయడం, మురికి కాలువల్లో పేరుకుపోయిన చెత్త చెదారాన్ని తొలగించడం వంటి పనులతో గ్రామాల్లో గత నాలుగేళ్లుగా సీజనల్ వ్యాధులు ప్రబలకపోవడం గమనార్హం. జిల్లాలోని 566 గ్రామ పంచాయతీలకు పల్లెప్రగతితోపాటు ఎస్ఎఫ్సీ తదితరాల ద్వారా నెలకు దాదాపు రూ.30 కోట్ల నిధులను ప్రభుత్వం విడుదల చేస్తుంది.
మారిపోతున్న గ్రామాల రూపురేఖలు..
జిల్లాలోని గ్రామ పంచాయతీల రూపురేఖలు పూర్తిగా మారిపోతున్నాయి. గతంలో గ్రామ పంచాయతీల్లో అధ్వాన్నంగా రోడ్లు, సరైన డ్రైనేజీ వ్యవస్థ లేకపోవడం తదితర సమస్యలతో కొట్టుమిట్టాడుతుండే పరిస్థితులు నెలకొని ఉండేవి. అయితే బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక.. గ్రామాలాభివృద్ధికి అధిక ప్రాధాన్యతిస్తూ నిధులివ్వడంతోపాటు గ్రామాల రూపురేఖలను మార్చే విధంగా ప్రత్యేకంగా నూతన పంచాయతీరాజ్ చట్టాన్ని ప్రభుత్వం అమల్లోకి తీసుకువచ్చి కనీవినీ ఎరుగని విధంగా అభివృద్ధికి శ్రీకారం చుట్టారు. జిల్లాలోని మండలాల నుంచి గ్రామ పంచాయతీలకు రోడ్లను నిర్మించి అందుబాటులోకి తీసుకురావడంతోపాటు గ్రామ పంచాయతీ అంతటా సీసీ రోడ్లను నిర్మిస్తున్నారు. అంతేకాకుండా అండర్ డ్రైనేజీ వ్యవస్థను అన్ని గ్రామ పంచాయతీల్లో అందుబాటులోకి తీసుకువచ్చారు. అయితే గత ఏడేళ్లలో రాష్ట్ర ప్రభుత్వం జిల్లాలోని గ్రామ పంచాయతీల అభివృద్ధికి భారీగా నిధులిచ్చింది. ప్రధానంగా పల్లెప్రగతిలో భాగంగా జిల్లాకు భారీగా నిధులు మంజూరయ్యాయి. పల్లెప్రగతి కార్యక్రమాన్ని ప్రారంభించిన నాటి నుంచి ప్రతీనెల రూ.18 కోట్ల చొప్పున జిల్లాకు ప్రభుత్వం నిధులిస్తుంది.
ప్రభుత్వం విడుదల చేసిన నిధులతో జిల్లాలోని ప్రతీ గ్రామ పంచాయతీలో అండర్‌గ్రౌండ్ డ్రైనేజీలను నిర్మించి, అందుబాటులోకి తీసుకువచ్చారు. ఏ గ్రామంలో కూడా మురుగునీరు రోడ్లపై పారకుండా అండర్‌గ్రౌండ్ డ్రైనేజీలను నిర్మించారు. అదేవిధంగా ప్రతీ గ్రామ పంచాయతీలో అంతర్గత రోడ్ల నిర్మాణానికి కూడా అధిక మొత్తంలో నిధులు ఖర్చు చేశారు. గతంలోని మట్టి రోడ్ల స్థానంలో సీసీ రోడ్లను నిర్మించారు. అంతేకాకుండా గ్రామాల్లో తాగునీటి సరఫరాకు సంబంధించిన మరమ్మతు పనులను కూడా పూర్తి చేశారు. గ్రామ పంచాయతీల్లో కరెంట్ ఛార్జీలు, ట్రాక్టర్ల లోన్ చెల్లించడం, పారిశుధ్య పనులకు సంబంధించి అధిక మొత్తంలో పల్లెప్రగతి కింద నిధులను వినియోగించారు. అదేవిధంగా జిల్లాలోని 566 గ్రామ పంచాయతీలతోపాటు 307 హాబిటేషన్లలో పల్లెప్రకృతివనాలను ఏర్పాటు చేశారు. గ్రామాల్లోని ప్రజలకు స్వచ్ఛమైన వాతావరణాన్ని అందించేందుకుగాను ప్రతీ గ్రామ పంచాయతీలో పల్లెప్రకృతి వనాలను ఏర్పాటు చేశారు. ప్రతీ గ్రామంలో ఒక్క ఎకరా స్థలంలో 4 వేల మొక్కలతో ప్రకృతివనాలను అందుబాటులోకి తీసుకువచ్చారు.
ప్రతీ పల్లెప్రకృతి వనానికిగాను మొక్కలు, వాకింగ్ ట్రాక్‌లు ఏర్పాటుకుగాను ప్రభుత్వం రూ.9 లక్షలను ఖర్చు చేసింది. ప్రతీ గ్రామ పంచాయతీకి కేటాయించిన 10 శాతం గ్రీన్ బడ్జెట్ నుంచి ప్రకృతి వనాలకు ఖర్చు చేశారు. మరోవైపు ప్రతీ గ్రామ పంచాయతీకి రాష్ట్ర ప్రభుత్వం ట్రాక్టర్లను అందజేసింది. ట్రాక్టర్లతోపాటు ట్రాలీ, ట్యాంకర్లను కూడా అందజేశారు. గ్రామ పంచాయతీలకు అందజేసిన ట్రాక్టర్లతో గ్రామాల్లో తడి, పొడి చెత్తను వేర్వేరుగా సేకరించడంతోపాటు రోజువారీగా గ్రామాల్లోని చెత్తను డంపింగ్ యార్డుకు తరలించడం, గ్రామ పంచాయతీ పరిధిలో నాటే మొక్కలకు నీరు పోయడంతోపాటు గ్రామ పంచాయతీల్లో చేపట్టే పనులకు ట్రాక్టర్లను వినియోగిస్తున్నారు. ట్రాక్టర్ల లోన్ డబ్బులను కూడా పల్లెప్రగతి నిధుల ద్వారానే ప్రతీ నెల చెల్లిస్తున్నారు. అదేవిధంగా జిల్లాలోని అన్ని గ్రామ పంచాయతీల్లో కంపోస్ట్ షెడ్లు అందుబాటులోకి తీసుకువచ్చారు. అయితే ఒక్కో కంపోస్ట్ షెడ్ నిర్మాణానికిగాను రూ.6 లక్షలను ఖర్చు చేయగా, కంపోస్ట్ షెడ్లో తడి-పొడి చెత్తను వేరుగా నిల్వ చేస్తూ ఎరువులను తయారయ్యే ప్రక్రియ కొనసాగుతుంది. అదేవిధంగా మరణించిన వారి చివరి మజిలీ గౌరవంగా ఉండాలనే ఉద్దేశంతో ప్రతీ గ్రామంలో వైకుంఠధామాల నిర్మాణానికి ప్రభుత్వం నిర్ణయించి నిధులిచ్చింది. జిల్లాలోని అన్ని గ్రామ పంచాయతీల్లోనూ వైకుంఠధామాలను ప్రజలకు అందుబాటులోకి తీసుకువచ్చారు. దీంతో జిల్లా వ్యాప్తంగా గ్రామాల్లో ప్రజలు తమ ఊరు గతంలో ఎట్లావుండే.. బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చాక ఎంత అద్భుతమైన అభివృద్ధి పనులు జరిగాయే జనం చర్చించుకుంటున్నారు.