యాచారం, జనవరి 5 : శ్రీవరిసాగు కరువులోనూ చేయవచ్చు. యాసంగిలో తక్కువ నీటితో, తక్కువ పెట్టుబడితో అధిక దిగుబడి తీసి, లాభాలను పొందవచ్చని వ్యవసాయాధికారులు సూచిస్తున్నారు. శ్రీవరి సాగు పద్ధతిలో మెళకువలను పాటిస్తే అనుకున్న ఫలితం వస్తుంది. శ్రీవరిసాగు పద్ధతి, మెళుకువలు, సస్యరక్షణ చర్యలపై మండల వ్యవసాయాధికారి సందీప్‌కుమార్ అందించిన ప్రత్యేక కథనం.
సాధారణ వరిలాగే పొలం తయారు చేయాలి. పొలం దున్ని సిద్ధం చేసుకొని నీరు ఎక్కువగా నిలువ ఉండకుండా చిన్నచిన్న లోతైన సేడులను ఏర్పాటు చేసుకోవాలి.
’శ్రీ’ పద్దతిలో వరినారును 8 నుంచి 12 రోజుల్లో నాటాలి. రెండుకిలోల మేలిరకం విత్తనాన్ని ఒక సెంటుభూమిలో పలుచగా చల్లి, పెంచితే ఎకరా పొలంలో నాటవచ్చు. భూమిని మెత్తగా దున్ని, దుమ్ము చేసి, కొంచెం ఎత్తుగా తయారుచేసి, దానికి చుట్టూ కాలువ తీయాలి. తడి మట్టి జారిపోకుండా నారుమడి చుట్టూ వరిఎండు గడ్డితో కానీ వెదటి బొంగులతో కాని, అరటి బొందలతో కానీ ఊతం ఏర్పాటు చేయాలి. నారుమడి తయారైన తర్వాత పశువుల ఎరువులను ఒక పొరలాగా చల్లాలి. దానిమీద 24గంటలు నానబెట్టి, 24 గంటలు మండికట్టిన విత్తనాలను పలుచగా చల్లాలి. విత్తనాలపైన పలుచగా పశువుల ఎరువులను వేసి ఉంచాలి. పై నుంచి గడ్డి కప్పి ఉంచాలి. దానిపై రోజు నీరు చల్లుతూ తడపాలి. ఎనిమిది రోజుల్లో వరినారు రెండు నుంచి మూడు ఆకులతో దృఢంగా పెరుగుతుంది. నారుమడి నుంచి నారును పాతపద్ధతిలో పీకకుండా మట్టితో సహావేరు చేసి ప్లాస్టిక్ ట్రేలలో పొలానికి నారును తరిలించాలి.
పొలంలో 25 అడ్డం, పొడవు 25 సెం.మీ. ఎడంగా ముందుగా గీతలు గీసుకోవాలి. గీతలు గీసే ప్రాంతంలో ఒక్కొక్క మొక్కను పైపైగా నాటాలి. బురద మట్టిలో సహామొక్కలను నాటితే వాటిపై ఒత్తిడిలేకుండా స్థిరంగా బలంగా పెరుగుతాయి. మొక్కలను నిటారుగా నాటితేనే దిగుబడినిస్తుందని నిపుణులు సూచించారు.
శ్రీవరిసాగు పద్ధతిలో ప్రతి 25సెం.మీ.నాట్లు వేయుటకు ముందుగాని 15-20 సెం.మీ. వెడల్పు 15-20 సెం.మీ.లోతులో పొలంలో పొలంలో బాటలు తీయాలి. దీని వల్ల గాలి, వెలుతురుతో పాటు నీరు పెట్టుకోవడానికి వీలుగా ఉంటుంది. దీంతో చీడలపీడలు సైతం పంటను అంతగా ఆశించవు.
నాటిన వరి పిలకలు బాగా వచ్చేందుకు పొలం తడితడిగా పొడిపొడిగా ఉండేలా చూసుకోవాలి. మొక్కళ్లల్లో నీరు నిలువకుండా జాగ్రత్త వహించాలి. దీని కోసం ప్రతి రెండుమీటర్లకు 15-20 సెం.మీ. వెడల్పు, 15-20 సెం.మీటర్ల లోతులో సేడులు ఏర్పాటు చేసుకోవాలి. మధ్యమధ్యలో పొలం ఆరితే నీటితో తడుపుతుండాలి. దీంతో పంటవేర్లు ఆరోగ్యంగా బలపడుతాయి. పొలంచుట్టూ చిన్నచిన్న ఈనెగట్లు, ఎల్లగట్లు వేసుకోవటం వల్ల నీటి యాజమాన్యం సక్రమంగా జరుగుతుంది. ఎలుకలు కన్నాలు సీతల కన్నాల నుంచి అనవసరంగా వచ్చేనీటిని అక్కడే అదుపుచేసుకోవచ్చు.
శ్రీవరి పద్ధతిలో కలుపు నివారణకు రోటరీవీడర్తో నాటిన పదిరోజులకొకసారి, రెండు నుంచి మూడు సార్లు నేలను వీడర్‌తో ముందుకు, వెనక్కి కదిలించటంతో కలుపు మొక్కలు నేలలో కలిసిపోతాయి. రోటరీవీడర్ వాడకటం వల్ల వేరుకు బాగా ఆక్సిజన్ అందుతుంది. దీంతో సూక్ష్మజీవులు అభివృద్ధి చెంది స్థిరీకరిస్తాయి. దీంతో వీడర్‌ను ఉపయోగించే ముందు నీటిని అధికంగా ఉంచాలి.
1980లో మడగాస్కర్ అనే దేశంలో మొదటిసారిగా రూపొందించిన శ్రీవరిసాగుతో రైతులు మంచి లాభాలను పొందవచ్చు. శ్రీవరితో అధికధాన్యం, గడ్డిని పొందవచ్చు. 7-10 రోజుల ముందే ఈ వరి కోతకు వస్తుంది. తక్కువ విత్తన వినియోగంతో పాటు తక్కువ నీటితో పంటను సాగుచేసుకోవచ్చును. తక్కువ పెట్టుబడితో, తక్కువ ఖర్చుతో అధిక లాభం పొందవచ్చును.
శ్రీవరి సాగుకు యాసంగి ఎంతో అనుకూలం. శ్రీవరి సాగు ద్వారా రైతులు తక్కవ నీటితో ఎక్కవ పంట దిగుబడిని సాధించవచ్చును. రైతులు శ్రీవరి సాగు పద్ధతి ద్వారా తక్కువ పెట్టుబడితో ఎక్కువ పంట దిగుబడిని సైతం పొందవచ్చు. యాసంగి పంటలో రైతులు తగిన మెలుకువలతో పంటను సాగు చేసుకోవాలి. ఆరుతడి పంటల్లో శ్రీవరి సాగు పద్ధతి ఎంతో మేలైంది. శ్రీవరి సాగు పద్ధతితో పంట సాగు చేసుకునే రైతులకు డ్రమ్ సీడర్‌ను అందిస్తాం. పంట సాగుకు రైతులకు తగిన సలహాలు సూచనలు అందజేస్తాం. ఆసక్తిగల రైతులు శ్రీవరి పద్ధతిన పంట సాగు చేసుకోవచ్చు.
– సందీప్‌కుమార్, వ్యవసాయాధికారి యాచారం