సిటీబ్యూరో, ఏప్రిల్ 12 (నమస్తే తెలంగాణ) : ఆర్భాటం ఎక్కువ.. అభివృద్ధి తక్కువ అన్న చందంగా ఉన్నది రైల్వే ప్రాజెక్టుల అంశాలు. రాష్ట్రంలోని హైదరాబాద్, సికింద్రాబాద్ జంట నగరాల ప్రయాణికులకు ఎంతో సౌకర్యవంతంగా ఉండే ఎంఎంటీఎస్ లోకల్ రైలు సర్వీసులను తగ్గిస్తున్న రైల్వే శాఖ.. తాజాగా 13 కొత్త ఎంఎంటీఎస్ సర్వీసులను ఈ నెల 8న ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రారంభించారు. ఫలక్‌నుమా – ఉందానగర్, మేడ్చల్-సికింద్రాబాద్ వంటి స్టేషన్ల మధ్యలో 13 లోకల్ రైలు సర్వీసులు నడుస్తాయని అంటున్నారు. కానీ సరైన సమాచారం ఏదీ లేదు. పైగా ప్రయాణికులు లేరన్న కారణంగా సర్వీసులను కూడా నడుపడంలేదన్న ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. ఇంతకు కొత్తగా ప్రారంభించిన లోకల్ రైలు సర్వీసులు రెగ్యులర్‌గా నడుస్తున్నాయా? లేదా ? అన్న విషయం కూడా ఎవరికీ తెలిసే అవకాశాలు లేకుండాపోతున్నాయి.
ముఖ్యంగా ఎంఎంటీఎస్ సర్వీసులు నడిపే విషయంలో ప్రచారం లోపం తీవ్రంగా ఉందని ప్రయాణికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయితే మేడ్చల్ నుంచి సికింద్రాబాద్‌తో పాటు లింగంపల్లి వరకు సర్వీసులను నడుపాలన్న డిమాండ్ కూడా ప్రయాణికుల నుంచి ఉన్నట్లు తెలుస్తున్నది. నగర ప్రయాణికుల సౌకర్యార్థం గతంలో 130 ఎంఎంటీఎస్ సర్వీసులు ఉండేవి. 2021 నుంచి ఈ సర్వీసులను 65కు తగ్గించారు. క్రమంగా మరో 20 వరకు పెంచినట్లు అధికారులు తెలిపారు. గతంలో దాదాపు 80 వేలకు పైగా నగర ప్రయాణికులు నిత్యం ఎంఎంటీఎస్‌లో ప్రయాణించేవారు. కానీ రైల్వే శాఖ నిర్లక్ష్య వైఖరి కారణంగా ప్రయాణికుల సంఖ్య కూడా క్రమంగా తగ్గుతున్నట్లు తెలుస్తున్నది. వాస్తవానికి రైల్వే శాఖ దీనిపై ప్రత్యేక దృష్టి పెట్టి, అన్ని మార్గాలలో సర్వీసులను అభివృద్ధి చేసినట్లయితే రోజు ఒక లక్ష మంది ప్రయాణికులు ప్రయాణం చేయడానికి అవకాశం వచ్చేదన్న అభిప్రాయాలు రైల్వే ఉద్యోగ సంఘాల నాయకులు వ్యక్తపరుస్తున్నారు.