షాద్నగర్టౌన్, మార్చి 28: ప్రజా సంక్షేమానికి ప్రభుత్వం పెద్దపీట వేస్తున్నదని ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ (Veerlapally Shankar) అన్నారు. పట్టణంలోని మండల పరిషత్ కార్యాలయ సమావేశ మందిరంలో వివిధ మండలాలకు చెందిన లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి, షాదీముబారక్, సీఎం సహాయనిధి చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ నిరుపేద ప్రజల సంక్షేమానికి ప్రభుత్వం అహర్నిశలు కృషి చేస్తుందన్నారు. కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాలు ఆడబిడ్డల కుటుంబాలకు ఎంతో ఆసరాగా నిలుస్తున్నాయన్నారు. అదే విధంగా సీఎం సహాయనిధి ఆపదలో ఉన్నవారికి ఎంతో ఉపయోగపడుతున్నాయన్నారు.
అర్హులైన ప్రతి ఒక్కరూ ప్రభుత్వ పథకాలను పూర్తిస్థాయిలో సద్వినియోగం చేసుకోవాలన్నారు. కొందుర్గు, చౌదరిగూడ, కొత్తూరు, కేశంపేట, నందిగామ మండలాలకు సంబంధించిన 218మంది లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి, షాదీముబారక్ ద్వారా మంజూరైన రూ. 2కోట్ల 18లక్షల 5వేల 288ల చెక్కులను 65 మందికి సీఎం సహాయనిధి ద్వారా రూ. 24లక్షల5వేల చెక్కులను అందజేశారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ బాబర్ఖాన్, మార్కెట్ కమిటీ డైరెక్టర్ భాస్కర్, మాజీ జడ్పీటీసీ విశాల, వివిధ మండలాల నాయకులు పాల్గొన్నారు.