ఆర్కేపురం, ఏప్రిల్ 20 : తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాల కోసం పార్లమెంట్లో గొంతెత్తి కొట్లాడేది బీఆర్ఎస్సే ఎంపీలేనని, జాతీయ పార్టీలతో రాష్ర్టానికి ఒరిగిందేమీ లేదని మాజీ మంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే సబితారెడ్డి అన్నారు. శనివారం నిర్వహించిన సరూర్‌నగర్ డివిజన్ బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల విస్తృతస్థాయి సమావేశానికి ఆమె ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. చేవెళ్ల పార్లమెంట్‌లోని సమస్యలపై కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజ్‌కు పూర్తి అవగాహన ఉందని, ఆయనను గెలిపిస్తే పార్లమెంట్లో రాష్ట్ర ప్రయోజనాల కోసం పోరాడుతారన్నారు. కాంగ్రెస్ ఆచరణకు సాధ్యం కానీ హామీలు ఇచ్చి అధికారంలో వచ్చి వాటిని అమలు చేయకుండా ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు కేసీఆర్‌పై పదే పదే తప్పుడు ఆరోపణలు చేస్తున్నారన్నారు.
ఈ రాష్ట్రంపై స్పష్టమైన అవగాహన ఉన్న ఏకైక వ్యక్తి సీఎం కేసీఆర్ అన్నారు. కాంగ్రెస్, బీజేపీలు పదే పదే కేసీఆర్‌ను టార్గెట్ చేసి మాట్లాడుతున్నారని, రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీకి ఏవిధంగా ఆదరణ ఉందో స్పష్టంగా అర్థ్ధమవుతున్నదన్నారు. పార్టీ అధికారంలో లేకపోయినప్పటికీ కేసీఆర్ వెన్నంటే ఉన్నటువంటి వారికి ఆమె కృతజ్ఞతలు తెలిపారు. తన గెలుపునకు కృషి చేసిన ప్రజలకు అన్ని విధాలుగా అండగా ఉంటానని తెలిపారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ బొగ్గారపు దయానంద్‌గుప్తా, డివిజన్ అధ్యక్షుడు మహేందర్, మాజీ డివిజన్ అధ్యక్షుడు ఇంటూరి అంకిరెడ్డి, నియోజకవర్గ యూత్వింగ్ మాజీ అధ్యక్షుడు లోకసాని కొండల్‌రెడ్డి, నియోజకవర్గ ప్రధాన కార్యదర్శి మురుకుంట్ల అరవింద్‌శర్మ, సీనియర్ నాయకులు జిల్లెల కృష్ణారెడ్డి, సుశీల, రిషి తదితరులు ఉన్నారు.