బొంరాస్‌పేట, ఏప్రిల్ 12 : సీఎం కేసీఆర్ గొప్ప మనసున్న నేతని.. పేదల సంక్షేమం కోసం ఎన్నో పథకాలను అమలు చేస్తున్నారని మహబూబ్‌నగర్ ఎంపీ మన్నె శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. బుధవారం కొడంగల్‌లోని మురహరి ఫంక్షన్ హాల్లో నిర్వహించిన బీఆర్ఎస్ బొంరాస్‌పేట మండల ఆత్మీయ సమ్మేళనంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. దేశమంతా మత కలహాలు సృష్టించి పబ్బం గడుపుకోవాలన్న దరిద్రపు ఆలోచనలో బీజేపీ ఉందని దుయ్యబట్టారు. తెలంగాణలో అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు బీజేపీ పాలిత రాష్ర్టాల్లో ఎందుకు అమలు చేయడం లేదని ఎంపీ నిలదీశారు. 50 ఏండ్లలో దేశానికి, రాష్ర్టానికి కాంగ్రెస్ ఏం చేసిందో ప్రజలకు చెప్పాలని డిమాండ్ చేశారు. సమైక్య పాలనలో తెలంగాణకు తీరని అన్యాయం జరిగిందని, ప్రత్యేక రాష్ట్రం వచ్చిన తరువాత అధికారంలోకి వచ్చిన బీఆర్ఎస్ ప్రభుత్వం తొమ్మిదేండ్లలో అన్ని రంగాల్లో అభివృద్ధి చేసిందన్నారు. ఉమ్మడి పాలమూరు, రంగారెడ్డి జిల్లాలకు సాగు, తాగు నీటిని అందించాలన్న ఉద్దేశంతో చేపట్టదలచిన పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని ముందుకు సాగనీయకుండా కేసులు వేసి ప్రతిపక్షాలు ప్రతిబంధకాలు సృష్టించాయన్నారు. ఎత్తిపోతల పథకానికి జాతీయ హరిత ట్రిబ్యునల్ ఇటీవల గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని, కొడంగల్ ప్రాంతం సస్యశ్యామలమవుతుందని ఎంపీ శ్రీనివాస్‌రెడ్డి అన్నారు.
సంక్షేమం అందని ఇల్లు లేదు
కేసీఆర్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల ఫలాలు అందని ఇల్లు లేదని బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు కోట్ల యాదగిరి అన్నారు. ప్రభుత్వ సంక్షేమ ఫలాలు ప్రతి ఇంటికి చేరాయన్నారు. తెలంగాణలో రైతులకు విలువ తెచ్చిన ఘనత కేసీఆర్‌కే దక్కుతుందని ఆయన పేర్కొన్నారు. కర్ణాటకలో రైతును పెండ్లి చేసుకోవడానికి యువతులు ముందుకు రావడం లేదని, కానీ తెలంగాణలో యువతులు రైతులను పెండ్లి చేసుకోవడానికే ఇష్టపడుతున్నారంటే వ్యవసాయాన్ని కేసీఆర్ ఎంత పండుగ చేశారో అర్థం చేసుకోవచ్చని యాదగిరి అన్నారు.
– కోట్ల యాదగిరి
ప్రతి గడపకు వెళ్దాం.. బీఆర్ఎస్ను గెలిపిద్దాం..
ఎంపీపీ హేమీబాయి, వైస్ ఎంపీపీ సుదర్శన్‌రెడ్డి, పీఏసీఎస్ చైర్మన్ విష్ణువర్ధన్‌రెడ్డి, రైతు బంధు సమితి మండలాధ్యక్షుడు మహేందర్‌రెడ్డి, బీఆర్ఎస్ దుద్యాల మండల అధ్యక్షుడు చాంద్‌పాషా, బీఆర్ఎస్ తాలుకా, మండల యూత్ అధ్యక్షులు నరేశ్‌గౌడ్, మహేందర్, ఎంపీటీసీ నారాయణరెడ్డి, బీఆర్ఎస్ నాయకుడు దేశ్యానాయక్ మాట్లాడుతూ.. బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు ఇంటింటికీ వెళ్లి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించాలని, కొడంగల్‌లో మరోసారి బీఆర్ఎస్ జెండాను ఎగురవేయాలని పిలుపునిచ్చారు. ప్రతిపక్షాల మాటలకు మోసపోరాదని, నాయకులు, కార్యకర్తలు ఏకతాటిపై పనిచేస్తే విజయం మనదేనని అన్నారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ ఎస్సీ సెల్ మండలాధ్యక్షుడు వెంకటయ్య, నాయకులు టీటీ రామునాయక్, రమణారెడ్డి, మధుసూదన్ యాదవ్, ఎంపీటీసీలు శ్రావణ్‌గౌడ్, తిరుపతయ్య, వెంకటమ్మ, కో-ఆప్షన్ సభ్యుడు ఖాజా మైనుద్దీన్, దుద్యాల మండల నాయకులు శ్రీనివాస్, ఎల్లప్ప, వెంకట్రాములు, బసప్ప, యూనుస్ ఉన్నారు.
ఖమ్మం మృతులకు సంతాపం
ఖమ్మం జిల్లాలో నిర్వహించిన ఆత్మీయ సమ్మేళనంలో పటాకులు కాల్చడం వల్ల జరిగిన ప్రమాదంలో కార్యకర్తలు మృతిచెందడంపై ఎంపీ, ఎమ్మెల్యే, నాయకులు సంతాపసూచకంగా రెండు నిమిషాలు మౌనం పాటించారు.
తెలంగాణలో రైతు సంక్షేమానికి పెద్దపీట
తెలంగాణలో రైతు సంక్షేమానికి సీఎం కేసీఆర్ పెద్దపీట వేశారని కొడంగల్ ఎమ్మెల్యే పట్నం నరేందర్‌రెడ్డి అన్నారు. 14 ఏండ్ల పోరాట ఫలితంగా సిద్ధించిన తెలంగాణ.. సీఎం కేసీఆర్ నాయకత్వంలో దేశంలోనే నంబర్ వన్‌గా నిలిచిందని పేర్కొన్నారు. పొరుగున ఉన్న కర్ణాటకలో బీజేపీ ప్రభుత్వం రైతులకు సంక్షేమ పథకాలను అమలు చేయడం లేదన్నారు. తెలంగాణలో బీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేస్తున్న అనేక సంక్షేమ పథకాలను దేశంలోని అనేక రాష్ర్టాలు కాపీ కొడుతూ అమలు చేస్తున్నాయని, చివరకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రైతు బంధు పథకాన్ని కాపీకొట్టి పీఎం కిసాన్ పథకాన్ని అమలు చేస్తున్నారని తెలిపారు. తెలంగాణ రాకముందు గ్రామాలు, పట్టణాలు, గిరిజనతండాలు ఎలా ఉన్నాయో.. ఇప్పుడు ఎలా మారా యో ప్రజలు ఒకసారి బేరీజు వేసుకోవాలన్నారు. తండాలను గ్రామపంచాయతీలుగా చేసి గిరిజనులకు స్వయంపాలన అధికారం కల్పించిన ఘనత కేసీఆర్‌కే దక్కుతుందని ఎమ్మెల్యే కొనియాడారు. ప్రతితండా, గ్రామానికి బీటీ రో డ్డు సౌకర్యం కల్పించాలన్న లక్ష్యంతో బొంరాస్‌పేట మండలంలోని రూ.36 కోట్లతో ప్రతి గిరిజన తండాకు బీటీ రోడ్డు మంజూరు చేశామని చెప్పారు. పల్లె, పట్టణ ప్రగతి కార్యక్రమాలు చేపట్టి అనేక అభివృద్ధి పనులు చేపట్టామని ఎమ్మెల్యే పేర్కొన్నారు. సర్పంచ్‌లు చేసిన పనులకు పెండింగ్‌లో ఉన్న బిల్లులు త్వరలో క్లియర్ అవుతాయని చెప్పారు.
– ఎమ్మెల్యే పట్నం నరేందర్‌రెడ్డి
కాంగ్రెస్ నాయకులు ఓట్ల దొంగలు
కాంగ్రెస్ నాయకులు ఓట్ల దొంగలని.. ఎన్నికల సమయంలోనే ప్రజలు, గ్రామాలు గుర్తుకు వస్తాయని విమర్శించారు. 50 సంవత్సరాలు ఉమ్మడి రాష్ర్టాన్ని ఏలిన కాంగ్రెస్ నాయకులకు ఇలాంటి పథకాలు అమలు చేయాలన్న సోయి ఎందుకు రాలేదని ఎమ్మెల్యే ప్రశ్నించారు. తెలంగాణలో సీఎం కేసీఆర్ సంపదను సృష్టించి పేదలకు పంచుతున్నారన్నారు. రేవంత్‌రెడ్డి చెప్పే పిట్ట కథలు, డ్రామాలు, జిమ్మిక్కులను కొడంగల్ ప్రజలు నమ్మే పరిస్థితి లేదని తెలిపారు. బీజేపీ పాలనలో ధరలు పెరిగి పేదలు ఇబ్బందులు పడుతున్నారని, అసత్య ప్రచారాలు, అబద్ధపు మాటలతో బీఆర్ఎస్ ప్రభుత్వంపై ప్రతిపక్షాలు నిందలు వేస్తున్నాయని.. బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు వీటిని తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. ఇంటింటికీ వెళ్లి ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివరించాలని ఎమ్మెల్యే సూచించారు. పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో భాగంగా కొడంగల్-నారాయణపేట కాల్వల పనులకు ప్రభుత్వం త్వరలో టెండర్లు పిలువనుందని ఎమ్మెల్యే నరేందర్‌రెడ్డి చెప్పారు.