తాండూరు, మే 20: పిడుగుపాటుకు వ్యక్తి మృతి చెందిన ఘటన సోమవారం తాండూరులో జరిగింది. స్థానికులు తెలిపిన వివరాలు.. పాత తాండూరుకు చెందిన శేఖర్ (40) కిరాణా దుకాణం నడిపిస్తూ జీవనం కొనసాగిస్తున్నాడు. ఇంటి నుంచి బయటకు వెళ్లిన శేఖర్ వర్షం పడుతుందని ఓ చెట్టుకింద నిల్చున్నాడు. అంతలోనే ఉరుములు, మెరుపులతో భారీ శబ్దం చేస్తూ పిడుగు పడడంతో శేఖర్ అక్కడికక్కడే మృతి చెందాడు. అక్కడే ఉన్న హన్మంతు (17) భ యంతో ఉక్కిరిబిక్కిరయ్యాడు. స్థానికులు వెంటనే తాండూరు ప్రభుత్వ జిల్లా ఆస్పత్రికి తీసుకెళ్లారు.
మృతుడు శేఖర్ కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని బంధుమిత్రులు కోరుతున్నారు. యాలాల మం డలం హాజిపూర్ గ్రామంలో మొగులప్పకు చెందిన 5 మేకలు పిడుగుపాటుకు మృతి చెందాయి. రెండు రోజులుగా తాండూరు నియోజక వర్గంలో నలుగురు వ్యక్తులు, 5 మేకలు పిడుగు పాటుకు మృతి చెందడంపై ఎమ్మెల్యే మనోహర్‌రెడ్డి బాధిత కుంటుంబాలకు సానుభూతి తెలిపారు. ప్రభుత్వం నుంచి తప్పకుండా సహాయం అందిస్తామని ప్రకటించారు.
రెండు రోజుల క్రితం యాలాల మండలంలో పిడుగుపాటుతో మృతి చెందిన వెంకటయ్య, శ్రీనివాస్, లక్ష్మయ్య అనే రైతు కూలీల కుటుంబాలను ఎమ్మెల్సీ మహేందర్‌రెడ్డి పరామర్శించారు. ఒక్కో మృతుడి కుటుంబానికి రూ.10 వేల చొప్పున నగదును అందజేశారు. ప్రభుత్వం నుంచి మృతుల కుటుంబాలకు సహకారం అందిస్తామన్నారు.