రంగారెడ్డి జిల్లాలో నియోజకవర్గస్థాయి సమావేశాలు అట్టహాసంగా జరిగాయి. సమావేశాలు జరిగే ప్రాంతాలన్నీ ఫ్లెక్సీలు, పార్టీ తోరణాలతో సభా ప్రాంగణాలకు వెళ్లే దారులన్నీ గులాబీమయమయ్యాయి. పండుగ వాతావరణంలో బీఆర్ఎస్ శ్రేణులు భారీ ర్యాలీలు తీశారు. అనంతరం ప్రజాప్రతినిధులు బీఆర్ఎస్ పార్టీ జెండాలను ఆవిష్కరించారు. కళాకారుల ఆటాపాట, బాజాభజంత్రీల మధ్య నృత్యాలు చేయడం వంటి కార్యక్రమాలతో బీఆర్ఎస్ శ్రేణుల్లో జోష్ నెలకొన్నది. మహిళలు బోనాలతో ప్రజాప్రతినిధులకు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా జరిగిన నియోజకవర్గస్థాయి సమావేశాల్లో బీఆర్ఎస్ పార్టీని మరింత బలోపేతం చేసేందుకు తీర్మానాలు చేసి ఆమోదించారు.
ఇబ్రహీంపట్నం, ఏప్రిల్ 25 : కేంద్ర ప్రభుత్వం పేదలను కొట్టి పెద్దల కడుపునింపుతున్నదని, ఎన్ని కుట్రలు చేసినా బీజేపీ మాటలను ప్రజలు నమ్మరని రంగారెడ్డి జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షుడు, ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి అన్నారు. మంగళవారం తుర్కయాంజాల్ మున్సిపాలిటీ పరిధిలోని మన్నెగూడ వద్ద వేదా కన్వెన్షన్ హాల్లో బీఆర్ఎస్ నియోజకవర్గస్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే హాజరై మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం మెడలు వంచి రాష్ర్టాన్ని సాధించిన మహానేత కేసీఆర్ అన్నారు. ఏ రాష్ట్రంలో లేని అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు తెలంగాణలో అమలవుతున్నాయన్నారు. బీజేపీ పాలనలో ప్రజలకు చేసిందేమీ లేదన్నారు. పెట్రోల్, డీజిల్, గ్యాస్, నిత్యావసర ధరలను విచ్చలవిడి గా పెంచారన్నారు. కేసీఆర్ వంటి పరిపాలన దక్షుడిని ఈడీలు, మోదీలు, కేడీలు ఏం చేయలేరన్నారు.
అభివృద్ధికి నోచుకోని బీజేపీ పాలిత రాష్ర్టాలు
: క్యామ మల్లేశ్, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు
దేశంలోని బీజేపీ పాలిత రాష్ర్టాలు అభివృద్ధికి ఆమడ దూరంలో ఉన్నాయని బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు క్యామ మల్లేశ్ అన్నారు. అభివృద్ధిని చూసి ఓర్వలేక బీజేపీ నాయకులు అక్కసును వెల్లగక్కుతున్నారన్నారు.
అభివృద్ధి, సంక్షేమం రెండు కండ్లు ప్రశాంత్‌కుమార్‌రెడ్డి, రాష్ట్ర నాయకుడు
అభివృద్ధి, సంక్షేమం సీఎం కేసీఆర్‌కు రెండు కండ్లని మంచిరెడ్డి ప్రశాంత్‌కుమార్‌రెడ్డి అన్నారు. రాష్ట్రంలో విద్యుత్, తాగు, సాగునీటి సమస్యలు లేవన్నారు. తెలంగాణ రాష్ట్రంలో ఐటీ పరిశ్రలు పెద్ద ఎత్తున తీసుకురావడంలో మంత్రి కేటీఆర్ ఎంతో కృషి చేస్తున్నారన్నారు. త్వరలోనే కొంగరకలాన్ వద్ద రూ.1650 కోట్లతో ఫాక్స్‌కాన్ పరిశ్రమ ఏర్పాటు కానున్నదన్నారు.
ఇబ్రహీంపట్నం నియోజకవర్గాన్ని సర్వతోముఖాభివృద్ధికి కృషి చేయడంలో ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి పాత్ర ఎంతో ఉందని గ్రంథాలయ సంస్థ చైర్మన్ సత్తు వెంకటరమణారెడ్డి అన్నారు. అనేక పరిశ్రమలు ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో ఏర్పాటు కావడానికి ఎమ్మెల్యే కృషి చేశారన్నారు. ఈ సమావేశంలో రైతుబంధు సమితి జిల్లా అధ్యక్షుడు వంగేటి లక్ష్మారెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ చంద్రయ్య, ఎంపీపీలు కృపేష్, నర్మద, జడ్పీటీసీ జంగమ్మ, డీసీసీబీ వైస్‌చైర్మన్ సత్తయ్య, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు రమేశ్‌గౌడ్, బుగ్గ రాములు, కిషన్‌గౌడ్, రమేశ్, మున్సిపాలిటీ అధ్యక్షుడు అల్వాల వెంకట్‌రెడ్డి, కొప్పు జంగయ్య, కృష్ణారెడ్డి, అమరేందర్‌రెడ్డి, ఇబ్రహీంపట్నం మున్సిపల్ వైస్ చైర్మన్ ఆకుల యాదగిరి, సర్పంచ్ల సంఘం జిల్లా అధ్యక్షుడు రాంరెడ్డి, రైతుబంధు సమితి మండల అధ్యక్షుడు అంజిరెడ్డి, జోగిరెడ్డి, సింగిల్ విండో అధ్యక్షుడు విఠల్‌రెడ్డి, పుల్లారెడ్డి, సుదర్శన్‌రెడ్డి, వెంకట్‌రెడ్డి, రాజశేఖర్‌రెడ్డి, రాజేందర్‌రెడ్డి, మహేందర్‌రెడ్డి, కౌన్సిలర్ల సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షురాలు నీలం శ్వేత, ప్రధాన కార్యదర్శులు భాస్కర్‌రెడ్డి, వేణుగోపాల్‌రావు, బహదూర్, బాష తదితరులు పాల్గొన్నారు.