రంగారెడ్డి, ఏప్రిల్ 16 (నమస్తే తెలంగాణ) : ఫార్మాసిటీ భూముల వ్యవహారంలో ఎమ్మెల్యే రంగారెడ్డి.. మాజీ ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డిల మధ్య సవాళ్లు.. ప్రతిసవాళ్లతో ఇబ్రహీంపట్నం రాజకీయం హీటెక్కింది. గత వారం రోజులుగా తాజా, మాజీ ఎమ్మెల్యేల మధ్య రాజకీయ వార్ పీక్ స్టేజీకి చేరింది. ఫార్మాసిటీ భూసేకరణలో అక్రమాలు జరిగాయని మల్రెడ్డి రంగారెడ్డి.. మంచిరెడ్డి కిషన్‌రెడ్డిపై గాంధీభవన్ వేదికగా పలు ఆరోపణలు చేశారు.
దీనిపై స్పందించిన మంచిరెడ్డి కిషన్‌రెడ్డి ఫార్మాసిటీ భూసేకరణలో మల్రెడ్డి రంగారెడ్డి చేసిన ఆరోపణలను రుజువు చేయడానికి తగిన ఆధారాలతో శుక్రవారం యాచారం మండలంలోని మేడిపల్లి గ్రామంలో బహిరంగ చర్చకు తాను సిద్ధమని.. దమ్ముంటే రుజువు చేయడానికి మల్రెడ్డి రంగారెడ్డి రావాలని సవాల్ విసిరారు. శుక్రవారం ఉదయం 10 గంటల నుంచి 11 గంటల వరకు ఫార్మా బాధిత గ్రామాలైన మేడిపల్లిలో తాను బహిరంగ చర్చకు సిద్ధంగా ఉంటానని, అక్రమాలు జరిగినట్లు రుజువు చేయాలని పేర్కొన్నారు.
కాగా, ఫార్మాసిటీ భూసేకరణలో తాను కనీసం వంద రూపాయలు తీసుకున్నట్లు రుజువు చేస్తే తాను రాజకీయ సన్యాసం తీసుకుంటానని స్పష్టం చేశారు. మంచిరెడ్డి విసిరిన సవాల్‌ను మల్రెడ్డి రంగారెడ్డి స్వీకరించి చర్చకు వస్తారా అనేది నియోజకవర్గవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో ఇప్పట్లో ఎన్నికలు లేకపోయినప్పటికీ కాంగ్రెస్, బీఆర్ఎస్ల మధ్య వార్ ఎన్నికల వాతావరణాన్ని తలపిస్తున్నది.
మంచిరెడ్డి శుక్రవారం ఉదయం 10 గంటలకు మేడిపల్లి గ్రామానికి వచ్చి 11 గంటల వరకు అక్కడే ఉండనున్నారు. కిషన్‌రెడ్డి మేడిపల్లికి వెళ్తున్న నేపథ్యంలో నియోజకవర్గం నుంచి భారీ ఎత్తున బీఆర్ఎస్ శ్రేణులు తరలిరావాలని ఆ పార్టీ ఇప్పటికే పిలుపునిచ్చింది. దీంతో శుక్రవారం మేడిపల్లి గ్రామంలో ఏం జరుగుతుందనేది ఉత్కంఠగా మారింది. బహిరంగ చర్చకు మల్రెడ్డి వచ్చే అవకాశాలు లేవు. కాగా, మరోవైపు మంచిరెడ్డి సవాల్‌కు స్పందించి.. తాను మరో రోజు మంచిరెడ్డి చేసిన అవినీతి ప్రాంతంలోనే అధికారులతో వచ్చి చర్చ జరుపుతానని మల్రెడ్డి రంగారెడ్డి ప్రకటించారు.