ఆమనగల్లు, సెప్టెంబర్ 11: ప్రభుత్వం అన్ని వర్గాల ప్రజలకు సంక్షేమ పథకాలు అందుతున్నాయని ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి అన్నారు. ఆమనగల్లు మండలంలో ఇటీవల కురిసిన వర్షాలకు దెబ్బతిన్న ఇండ్లకు ప్రభుత్వం తరుఫున బుధవారం నష్ట పరిహారం అందించారు. ఈ సందర్భంగా తహసీల్దార్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఇండ్లు కూలిపోయిన 5 మంది బాధితులకు ఒక్కొక్కరికీ రూ.3200 చొప్పున చెక్కులను అందజేశారు.
అనంతరం సురసముద్రం చెరువును పరిశీలించారు. వినాయక నిమజ్జనం సజావుగా శాంతియుతంగా నిర్వహించాలని, నిమజ్జన సందర్భంలో ఎక్కడ కూడా ప్రమాదం జరగకుండా జాగ్రత్తలు వహించాలని అధికారులకు ఎమ్మెల్యే సూచించారు. అనంతరం మేడిగడ్డ సమీపంలోని కత్వవాగును పరిశీలించారు. వాగు ప్రవాహంతో ప్రయాణ సౌకర్యం స్థంభించడం వలన తాత్కాలిక మరమత్ములు చేపట్టి రాకపోకలు కల్పించాలని పంచాయతీరాజ్ అధికారులకు సూచించారు.
తదనంతరం ఆమనగల్లు పట్టణ కేంద్రంలో భక్త మార్కండేయ గణేశ్ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గణనాథుడిని దర్శించుకొని పూజలు చేశారు. ఈ సందర్భంగా ఉత్సవ కమిటీ సభ్యులు ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డిని ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో తహసీల్దార్ లలిత, ఎంపీడీవో కుసుమ మాధురి, మున్సిపల్ కమిషనర్ వసంత, పీసీసీ సభ్యుడు శ్రీనివాస్‌గౌడ్, కాంగ్రెస్ బ్లాక్, మండల, పట్టణ అధ్యక్షులు నర్సింహ, జగన్, మానయ్య, మున్సిపల్ వైస్ చైర్మన్ దుర్గయ్య, కౌన్సిలర్ లక్ష్మణ్ పాల్గొన్నారు.