మొయినాబాద్, ఆగస్టు10: ఇప్పటికే నిధులు మంజూరై.. పనులు ప్రారంభమైతే ప్రభుత్వం ఏమి చేయాలి.. ఆ పనులు త్వరగా పూర్తయ్యేలా చూడాలి.. కానీ, కాంగ్రెస్ ప్రభుత్వం దానికి భిన్నంగా వ్యవహరించడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మొయినాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని ముర్తుజాగూడ సమీపంలో ఏర్పాటు చేస్తున్న 33కేవీ విద్యుత్ సబ్ స్టేషన్ గత బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో మంజూరైంది. విద్యుత్ సబ్ స్టేషన్ ఏర్పాటుకు గత ప్రభుత్వం రూ.8 కోట్లు మంజూరు చేసింది.సబ్ స్టేషన్కు స్థలం గత ప్రభుత్వంలోనే కేటాయించింది.
మంజూరైన తరువాత సార్వత్రిక ఎన్నికల హడావుడి రావడంతో అప్పుడు శంకుస్థాపన చేయలేదు.ప్రభుత్వం మారిన తరువాత పనులు ప్రారంభించి ఏడాది కావస్తున్న తరుణంలో కాంగ్రెస్ ప్రభుత్వం తాజాగా ఈ విద్యుత్ సబ్ స్టేషన్కు శంకుస్థాపన చేయడానికి శ్రీకారం చుట్టింది.సోమవారం ఉపముఖ్యమంత్రి, విద్యుత్ శాఖ మంత్రి భట్టి విక్రమార్క చేతుల మీదుగా శంకుస్థాపన చేయడానికి విద్యుత్ శాఖ అధికారులు ఏర్పాట్లు చేశారు. శంకుస్థాపన పనులను ఆదివారం చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య పరిశీలించారు. పనులు ప్రారంభించడానికి శంకుస్థాపనలు చేస్తారు కాని పనులు నడుస్తుంటే శంకుస్థాపన పేరిట హడావుడి చేయడం ప్రజాధనాన్ని వృథా చేయడమే నని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.