పార్టీకి బలం, బలగం కార్యకర్తలేనని, బీఆర్ఎస్ను మరింత శక్తివంతంగా మార్చే దిశగా ముందుకెళ్లాలని కల్వకుర్తి ఎమ్మెల్యే జైపాల్‌యాదవ్ పిలుపునిచ్చారు. తలకొండపల్లి మండలం చుక్కాపూర్లో బుధవారం నిర్వహించిన బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. సీఎం కేసీఆర్ సారథ్యంలో రాష్ట్రం ప్రగతి దిశగా పరుగులు పెడుతున్నదన్నారు. పార్టీ శ్రేణులు ప్రభుత్వ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను ఇంటింటికెళ్లి ప్రజలకు వివరించాలన్నారు. కేంద్ర సర్కార్ బడా కంపెనీలకు కొమ్ముకాస్తూ పేదలను దోచుకుంటున్నదన్నారు. దీనిపై ప్రశ్నించినందుకు కేంద్రం తెలంగాణపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నదన్నారు. ప్రతిపక్షాల కుట్రలను తిప్పికొట్టాలన్నారు. ఎవరెన్ని కుట్రలు పన్నినా మళ్లీ గెలిచేది బీఆర్ఎస్సేనన్నారు. ఈ సమావేశానికి బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. దీంతో చుక్కాపూర్ గులాబీమయంగా మారింది.
తలకొండపల్లి ఏప్రిల్ 12 : అనేక కార్పొరేట్ శక్తులు దేశాన్ని దోచుకొని 78 లక్షల కోట్లు దాచుకున్న సొమ్మును దేశ ప్రజలకు ఒక్కొక్క కుటుంబానికి రూ.15లక్షలు ఖాతాల్లో వేస్తానని బీజేపీ ఇచ్చిన హామీ ఏమయిందని ఎమ్మెల్యే జైపాల్‌యాదవ్ అన్నారు. బుధవారం తలకొండపల్లి మండలంలోని చుక్కాపూర్ గ్రామంలో బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు కుమ్మరి శంకర్, ఏఎంసీ చైర్మన్ నాలాపురం శ్రీనివాస్‌రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన ఆత్మీయ సమ్మేళనంలో ఎమ్మెల్యే జైపాల్‌యాదవ్, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు గోళి శ్రీనివాస్‌రెడ్డి, కల్వకుర్తి మున్సిపల్ చైర్మన్ యడ్మ సత్యం, ప్రజాప్రతినిధులు, నాయకులు, అభిమానులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలోని బీఆర్ఎస్ పార్టీ దేశంలోని నిరుపేదలు, బడుగు, బలహీన వర్గాలకు అండగా ఉంటుందని, బీఆర్ఎస్కు కార్యకర్తలే బలం, బలగమని అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ అభివృద్ధిలో రాష్ర్టాన్ని పరుగులు పెట్టిస్తున్నారని తెలిపారు. సీఎం కేసీఆర్ ప్రజల సంక్షేమానికి అనేక పథకాలను అమలు చేస్తూ, వేరే రాష్ర్టాల సీఎంలకు ఆదర్శంగా నిలుస్తున్నారని పేర్కొన్నారు.
ప్రజలను మభ్యపెడుతున్న బీజేపీ
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ద్వంద్వ విధానాలతో ప్రజలను మభ్యపెడుతున్నదని, దేశ సంపదను కార్పొరేట్ సంస్థలకు దోచిపెట్టి పేదలను మోసం చేస్తున్నదని ఎమ్మెల్యే విమర్శించారు. పేదలపై నిర్లక్ష్యం వహిస్తూ, నిత్యావసరాల ధరల పెంపునకు కారణమైందని ఆరోపించారు. కేంద్రం తెలంగాణపై కక్ష సాధింపు చర్యలు చేపడుతున్నదని.. బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు ఐక్యంగా ఉండి కేంద్రాన్ని ఎదుర్కోవాలన్నారు. కేంద్రం మాట వినని నేతలపై ఈడీలతో తప్పుడు కేసులు పెట్టించి ఇబ్బందులకు గురి చేస్తున్నదని ఎమ్మెల్యే విమర్శించారు. బీజేపీయేతర రాష్ర్టాలపై పెత్తనం చెలాయించాలని చూస్తున్న కేంద్ర ప్రభుత్వంపై సీఎం కేసీఆర్ పోరాటం చేస్తున్నారని తెలిపారు. రాష్ట్రంలో కాంగ్రెస్‌కు కాలం చెల్లిపోయిందని, బీజేపీకి ప్రజాబలం లేదన్నారు. ప్రతిపక్షాలు చేసే నిరాధారమైన ఆరోపణలను బీఆర్ఎస్ శ్రేణులు తిప్పికొట్టాలని ఎమ్మెల్యే పిలుపునిచ్చారు.
పార్టీ బలోపేతానికి ఆత్మీయ సమ్మేళనాలు
బీఆర్ఎస్ పార్టీని మరింత బలోపేతం చేసేందుకు రాష్ట్ర శాఖ ఆదేశాల మేరకు ఆత్మీయ సమ్మేళనాలను నిర్వహిస్తున్నామని, నాయకులు, కార్యకర్తల మనోభావాలను తెలుసుకునేందుకు సమ్మేళనాలు ఉపయోగపడతాయని ఎమ్మెల్యే వివరించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ కారణజన్ముడని, ఆయన నాయకత్వంలో పని చేయడం మనందరి అదృష్టమని పేర్కొన్నారు. బీఆర్ఎస్ పార్టీకి కార్యకర్తలే బాస్‌లని, పార్టీ జెండా పేద ప్రజలకు అండగా ఉంటుందని, ముఖ్యమంత్రి కేసీఆర్‌ను తెలంగాణ ప్రజలు గుండెల్లో పెట్టుకోవాలన్నారు. తెలంగాణలో అమలవుతున్న పథకాలతో రాష్ట్ర ప్రజలంతా సంతోషంగా ఉన్నారని చెప్పారు. రైతు బంధు, రైతు బీమా, ఉచిత కరెంట్‌తో వ్యవసాయాన్ని పండుగలా మార్చిన ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కుతుందన్నారు. కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాలతో ఆడబిడ్డల పెండ్లిళ్లకు ప్రభుత్వం అండగా ఉంటుందని తెలిపారు. దేశంలో ఏ రాష్ట్రంలోనూ లేని విధంగా తెలంగాణలో సీఎం కేసీఆర్ ప్రభుత్వ పథకాలను అమలు చేస్తున్నారని, అభివృద్ధి, సంక్షేమ పథకాలను కార్యకర్తలే ప్రజలకు వివరించాలని ఎమ్మెల్యే జైపాల్‌యాదవ్ పేర్కొన్నారు.
అంతకుముందు చుక్కాపూర్ గ్రామంలో అంబేద్కర్ విగ్రహానికి ఎమ్మెల్యే జైపాల్‌యాదవ్ పూలమాల వేసి నివాళులర్పించారు. ప్రధాన చౌరస్తాలో బీఆర్ఎస్ నాయకులు భారీ ర్యాలీ నిర్వహించారు. ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమంలో భాగంగా చుక్కాపూర్ గ్రామానికి చెందిన పలువురు నాయకులు ఎమ్మెల్యే సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరడంతో వారికి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
కార్యక్రమంలో జడ్పీటీసీ దశరథ్‌నాయక్, డీసీసీబీ డైరెక్టర్ వెంకటేశ్‌గుప్తా, రైతు బంధు సమితి మండల అధ్యక్షుడు నర్సింహ, మాజీ ఎంపీపీ శ్రీనివాస్‌యాదవ్, బీఆర్ఎస్ మండల వర్కింగ్ ప్రెసిడెంట్ చంద్రశేఖర్‌రెడ్డి, సర్పంచ్‌లు స్వప్న, ఈశ్వర్‌నాయక్, ఎంపీటీసీలు సుధాకర్‌రెడ్డి, వందన, నాయకులు హరిమోహన్‌రెడ్డి, శ్రీశైలం, తిరుపతి, కుమార్, పాండు, ఆంజనేయులు, జంగయ్య, మల్లేశ్, లక్ష్మయ్య, వెంకటయ్య, జగన్‌రెడ్డి, సజ్జు పాషా పాల్గొన్నారు.