తలకొండపల్లి, డిసెంబర్ 23 : తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాతనే విద్యావ్యవస్థను బలోపేతం చేసి గురుకుల పాఠశాలలతో పాటు ప్రాథమిక స్థాయి నుంచే ఇంగ్లిష్ మీడియాన్ని ప్రభుత్వం ప్రవేశపెట్టిందని ఎమ్మెల్యే జైపాల్‌యాదవ్, ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి అన్నారు. మండల కేంద్రంలోని జడ్పీహెచ్ఎస్ పాఠశాలలో శుక్రవారం మండల స్థాయి టీఎల్ఎం మేళా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ చదువులో వెనకబడిన విద్యార్థులకు అర్థం అయ్యే విధంగా విద్యను సరళీకృతం చేసేందుకు ఉపాధ్యాయులు తయారు చేసిన పరికరాలను పరిచయం చేసేందుకు ఈ కార్యక్రమం ఉపయోగపడుతుందని అన్నారు. ప్రతి గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేసేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు. కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ శ్రీనివాస్‌రెడ్డి, ఎంపీపీ నిర్మల, రైతుబంధు సమితి మండల అధ్యక్షుడు నర్సింహ, ఎంఈఓ సర్దార్‌నాయక్, సర్పంచ్ లలిత, కుమార్, ఎంపీటీసీ సుధాకర్‌రెడ్డి, ఏఎంసీ డైరెక్టర్ శేఖర్, పీఏసీఎస్ డైరెక్టర్ శేఖర్‌యాదవ్, మాజీ ఎంపీపీ శ్రీనివాస్‌యాదవ్, హెచ్ఎంలు భగవాన్‌రెడ్డి, శంకరయ్య, ఆయా పాఠశాలల ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.
సర్కారు బడుల్లోనే నాణ్యమైన విద్య
షాద్‌నగర్ : రాష్ట్ర ఏర్పాటు అనంతరం అన్ని ప్రాంతాల్లో సర్కారు విద్యా మరింత బలోపేతం అవుతుందని ఫరూఖ్‌నగర్ ఎంపీపీ ఖాజ ఇద్రీస్, జడ్పీటీసీ పి. వెంకట్రాంరెడ్డిలు అన్నారు. శుక్రవారం ఫరూఖ్‌నగర్ మండలం రాయికల్ గ్రామంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల ఆవరణలో తొలిమెట్టు కార్యక్రమంలో భాగంగా ఉపాధ్యాయులు నిర్వహించిన బోధన, అభ్యసన సామగ్రి మేళాను సందర్శించి బోధన సామగ్రి వివరాలు, బోధన తీరును అడిగి తెలుసుకున్నారు. చిన్నారులకు అర్థం అయ్యే రీతిలో బోధన ఉండాలని, మారుతున్న కాలానికి అనుగుణంగా విద్యార్థులకు పాఠాలను బోధించాలని అభిప్రాయపడ్డారు. కడియాల కుంట తండాకు చెందిన ఇద్దరు చిన్నారులకు ఉపాధ్యాయులు, పలువురు దాతల సహకారంతో రూ. 50 వేల ఆర్థిక సహాయాన్ని అందజేశారు. కార్యక్రమంలో పీఏసీఎస్ చైర్మన్ బక్కన్నయాదవ్, సర్పంచ్ కృష్ణ, ఎంఈవో శంకర్‌రాథోడ్, పాఠశాలల ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.