Danam Nagender | హిమాయత్ నగర్, మే 3: హిమాయత్‌నగర్ లోని ఆదర్శబస్తీలో శనివారం 602 రేషన్ దుకాణంలో లబ్ధిదారులకు సన్న బియ్యం పంపిణీ కార్యక్రమం జరిగింది. అనంతరం ఎమ్మెల్యే దానం నాగేందర్, హైదరాబాద్ జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి, నగర మేయర్ గద్వాల్ విజయలక్ష్మి, కార్పొరేటర్ విజయారెడ్డి తో పాటు అధికారులతో కలిసి మంత్రి పొన్నం ప్రభాకర్ గాంధీకుటీర్ బస్తీలో లబ్ధిదారుడి ఇంట్లో భోజనం చేశారు. అయితే ఆదర్శబస్తీలో సన్న బియ్యం పంపిణీ కార్యక్రమం సందర్భంగా ప్రొటోకాల్ రగడ నెలకొంది.
ఖైరతాబాద్ కార్పొరేటర్, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి విజయారెడ్డి ఫొటోను ఫ్లైక్సీపై పెట్టకపోవడంతో ఎమ్మెల్యే దానంపై ఆమె అసహనం వ్యక్తం చేశారు. సన్న బియ్యం పంపిణీ చేస్తున్న క్రమంలో దానం పక్కన విజయారెడ్డి నిల్చొని ఉండగా, ఆమెను పక్కకు వెళ్లాలి అని దానం చెప్పారు. దీంతో విజయారెడ్డి ‘నీ పని చూసుకో’ అంటూ ఘాటుగా సమాధానం ఇచ్చారు.
అక్కడే ఉన్న మంత్రి పొన్నం ప్రభాకర్ జోక్యం చేసుకుని విజయారెడ్డిని సముదాయించారు. కార్యక్రమం అనంతరం మంత్రి పొన్నం ప్రభాకర్ వెళ్తున్న సమయంలో విజయారెడ్డి అనుచరులు, కాంగ్రెస్ మహిళా నేతలు పొన్నంతో ఈ అంశంపై మాట్లాడగా, తరువాత మాట్లాడుదామని చెప్పి వెళ్లిపోయారు. ఉద్దేశపూర్వకంగానే విజయారెడ్డి ఫొటో పెట్టలేదని, పార్టీ కోసం పనిచేసే వారిని గుర్తించడం లేదని ఆమె అనుచరులు అసంతృప్తిని వ్యక్తం చేశారు.