కేశంపేట, మార్చి 14: వేసవిలో గుక్కెడు నీరు దొరక్కా ప్రజలు అల్లాడుతుంటే కేశంపేట (Keshampeta) మండలంలోని తొమ్మిదిరేకుల గ్రామంలో మాత్రం రహదారిపై మిషన్ భగీరథ నీరు ఏరులైపారుతున్నది. మిషన్ భగీరథ పైప్ లైన్ మీదినుంచి భారీ వాహనం వెళ్లడంతో అది పగిలిపోయిందని, మరమ్మతులు చేసేందుకు ఎవరూ రాకపోవడంతో గత నాలుగు రోజులుగా నీరంతా వృథాగా పోతుందని స్థానికులు చెబుతున్నారు. నీటి వృథాను నివారించాల్సిన అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తుండడంతో గ్రామంలోని ఎస్సీ, బీసీ కాలనీలకు సరఫరా నిలిచిపోయింది. దీంతో గ్రామంలోని బోరు మోటార్ ద్వారా నీటిని సరఫరా చేస్తున్నట్లు తెలిసింది. అధికారులు స్పందించి నీటి వృథాను నివారించడంతోపాటు పైప్ లైన్‌కు మరమ్మతులు చేయాలని గ్రామస్తులు కోరుతున్నారు.