రూ.2 లక్షలకుపైగా రుణాలున్న రైతు కుటుంబాలకు రుణమాఫీ చేసేది లేదని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు శనివారం అసెంబ్లీలో స్పష్టం చేశారు. ఈ ప్రకటన నేపథ్యంలో రుణమాఫీకి మంగళం పాడటంతో అన్నదాతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ సర్కార్ అధికారంలోకి రాగానే రుణమాఫీ చేస్తారని ఎంతో అశపడ్డారు. కానీ రైతుల ఆశలు అడియాశలయ్యాయి. రుణమాఫీ చేస్తామని పొంకనాలు కొట్టిన రేవంత్‌రెడ్డి మా రైతుల కొంపలు ముంచిండు. సాగు చేయాలంటే కష్టంగా మారింది. కొంత మందికి మాత్రమే రుణమాఫీ చేసి చేతులు దులుపుకొన్నారు.
అమలు కాని హామీలు, అబద్ధపు మాటలు చెప్పడమే తప్పా రైతులను ఆదుకున్న దాఖలాలు లేవన్నారు. ఇది ప్రజా ప్రభుత్వం కాదు మోసపూరిత ప్రభుత్వమని పేర్కొన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నమ్మి కాంగ్రెస్ పార్టీకి ఓటేశామని వాపోయారు. రుణమాఫీ చేస్తే ప్రభుత్వానికి మంచి పేరు వస్తుంది. లేకపోతే రైతులు కాంగ్రెస్ ప్రభుత్వంపై నమ్మకాన్ని కోల్పోతారని హెచ్చరించారు. గతంలో సీఎం కేసీఆర్ రైతు బంధు, రుణమాఫీ చేసి రైతులను ఆదుకున్నారని రైతులు తెలిపారు. రైతు బాగుండాలంటే మరోసారి సీఎంగా కేసీఆర్ రావాలని వారు పేర్కొన్నారు.
రైతులను మోసం చేస్తున్నది
రైతులకు రెండు లక్షల వరకు ఉన్న వ్యవసాయ రుణాలన్నింటినీ మాఫీ చేస్తామని ఎన్నికల్లో హామీ ఇచ్చిన ప్రభుత్వం.. నేడు మాకు రెండు లక్షల వరకు రుణమాఫీ చేయక మోసం చేస్తున్నది. రెండు లక్షల పైన ఉన్న వ్యవసాయ రుణాలు ఇచ్చిన హామీ మేరకు పైన ఉన్నవి కాకుండా రెండు లక్షల వరకు మాఫీ చేయాలి. ఇచ్చిన హామీలను నెరవేర్చని సర్కారు రైతులను మాటలతో గారడి చేస్తున్నది. రైతులను మోసం చేసే ప్రభుత్వాలు చరిత్రలో ఏమయ్యాయో గమనించాలి. రెండు లక్షల వరకు రుణాలు మాఫీ చేస్తామని ప్రభుత్వం చెప్పినందున రెండు లక్షల వరకు రుణాలు తీసుకున్నాం. అవి వడ్డీతో ఎక్కువయ్యాయి. కాని వడ్డీని సాకుగా చూపించి రెండు లక్షల రుణం మాఫీ చేయడం లేదు. ప్రభుత్వం రుణమాఫీ చేయబోమని తెలియజేయడం విడ్డూరం. ఈ విషయాన్ని సీఎం మరొకసారి ఆలోచించాలి. రైతులకు న్యాయం చేయాలి.
– దామోదర్‌రెడ్డి, రైతు, రాంరెడ్డిపల్లి, కులకచర్ల మండలం
పచ్చి అబద్ధాలతో పబ్బం గడుపుతున్న కాంగ్రెస్
అడ్డగోలు హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ పచ్చి అబద్ధాలు ఆడుతూ పబ్బం గడుపుతున్నది. నేను నందిగామ సొసైటీలో రూ.40,000 క్రాప్ లోన్ తీసుకున్నా. ఇప్పటి వరకు రుణమాఫీ కాలేదు. అధికారులను అడిగితే అప్పుడు.. ఇప్పుడు అని కాలం వెళ్లదీస్తున్నారు. కాంగ్రెస్ నాయకులు మాత్రం రైతులందరికీ రుణమాఫీ చేశామని గొప్పలు చెప్పుకొంటున్నారు. ముందుగా రైతులకు రుణమాఫీ చేయండి. అప్పుల బాధ భరించలేక మిత్తీనైనా కడదామనే ఉద్దేశంతో వ్యవసాయశాఖ కార్యాలయం చుట్టూ చెప్పులరిగేలా తిరిగినా ఫలితం లేకుండా పోయింది. కాంగ్రెస్ సర్కార్ రుణమాఫీ అమలుపై పూటకో ప్రకటన చేస్తూ రైతులను మోసం చేస్తున్నది. రైతుల ఆశలు ప్రభుత్వం చేసిన ప్రకటనతో ఆవిరయ్యాయి.
– రాంబాబు, పీఏసీఎస్ డైరెక్టర్ నందిగామ
కండ్లు కాయలు కాసేలా చూస్తున్నం
ప్రభుత్వం రూ.2 లక్షల రుణమాఫీ అని చెప్పడంతో నేను తీసుకున్న రుణం రూ.1.56 లక్షలు మాఫీ అవుతుందని ఆశపడ్డా. నాకు గ్రామంలోని సర్వే నం.182, 185లలో 6.18 ఎకరాల భూమి ఉన్నది. నా కొడుకు నరేందర్‌రెడ్డి పేరున రూ.1.26 లక్షల రుణం ఉన్నది. మా అందరి పేరున ఒకే రేషన్‌కార్డు ఉండడంతో ఒక్కరికీ కూడా రుణమాఫీ కాలేదు. ప్రభుత్వం ఇచ్చిన హామీ రూ.2 లక్షలు కాకపోయినా మా ఇంట్లో ఒక్కరికైనా మాఫీ జరిగుంటే సంతోషపడేటోళ్లం. అటు వ్యవసాయశాఖ కార్యాలయం, ఇటు బ్యాంకుల చుట్టూ తిరిగి అలసిపోయాం. చేసినకాడికే మాఫీ.. ఇకపై ఉండదు అంటూ పత్రికల్లో వార్తలు వస్తుండటంతో ఆందోళన చెందుతున్నాం. పంటకు గిట్టుబాటు ధర లేకపోవడంతో చేసిన అప్పులు ఎలా తీర్చాలో తెలియని పరిస్థితి. రూ.2లక్షలలోపు ఉన్న రుణాలన్నీ మాఫీ చేస్తే బాగుంటుంది.
– సుశీల, రైతు, సంతాపూర్, కేశంపేట మండలం
మిత్తి కట్టినా మాఫీ కాలేదు
నాకు 4 ఎకరాల 20 గుంటల భూమి ఉన్నది. భూమిపై రూ.2 లక్షల పంట రుణం తీసుకున్నాను. మిత్తితో కలుపుకొంటే రెండు లక్షల 40 వేలు అయినవి. సీఎం రేవంత్‌రెడ్డి రూ.2 లక్షల రుణమాఫీ చేస్తానని చెప్పి ఇప్పటివరకు చేయలేదు. అధికారులు చెబితే రెండు లక్షలకుపైన ఉన్న మిత్తి డబ్బులు కట్టాను. బ్యాంక్‌కు ఎన్నిసార్లు తిరిగినా మాఫీ కాలేదని బ్యాంక్ మేనేజర్ చెప్తున్నాడు. మిత్తి కట్టిన కూడా మాఫీ ఎందుకు కాలేదో అర్థం కావడంలేదు. ఇప్పుడు చేసినకాడికే మాఫీ.. ఇకపై ఉండదు అంటూ పత్రికల్లో వార్తలు వస్తుండటంతో ఆందోళన చెందుతున్నాం. రూ.2లక్షలలోపు ఉన్న రుణాలన్నీ మాఫీ చేస్తే బాగుంటుంది. కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను మోసం చేస్తున్నది. రేవంత్ సర్కార్ రైతులందరికీ వెంటనే రుణమాఫీ చేయాలి. రైతు బాగుండాలంటే మరోసారి సీఎంగా కేసీఆర్ రావాలి.
– కాస అయిలమ్మ, నల్లచెరువు, మాడ్గుల మండలం
రుణమాఫీ చేస్తారనే నమ్మకంతో..
రుణమాఫీ చేస్తారనే నమ్మకంతో కాంగ్రెస్ పార్టీకి ఓటు వేశాను. కానీ నాకు ఇంత వరకు రుణమాఫీ కాలేదు. రెండు లక్షల వరకు రుణమాఫీ చేస్తామని చెప్పారు కదా అని లక్ష రూపాయలు రుణం తీసుకున్నాను, వడ్డీతో కలిసి రూ.1.30 లక్షల వరకు కావచ్చు. అధికారుల చుట్టూ తిరిగినా రుణమాఫీ కాలేదు. ప్రభుత్వం రుణమాఫీ చేస్తుందనే నమ్మకం రోజురోజుకూ తగ్గుతున్నది. వడ్డీ చెల్లిస్తే రుణమాఫీ అవుతుందని అధికారులు చెప్తే, మిత్తి డబ్బులు బ్యాంక్‌లో కట్టాను.ఇచ్చిన మాట ప్రకారం రైతుల బ్యాంకు ఖాతాలకు సంబంధించి ఏమన్న టెక్నికల్ సమస్య ఉంటే వెంటనే పరిష్కరించి రుణమాఫీ చేస్తే ప్రభుత్వానికి మంచి పేరు వస్తుంది. లేకపోతే రైతులు కాంగ్రెస్ ప్రభుత్వంపై నమ్మకాన్ని కోల్పోతారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను మోసం చేస్తున్నది. రేవంత్ సర్కార్ రైతులందరికీ వెంటనే రుణమాఫీ చేయాలి.
– నిర్డుల చిన్న మహేందర్‌రెడ్డి, సురంగల్, మొయినాబాద్ మున్సిపాలిటీ
చెప్పులరిగేలా తిరుగుతున్నం..
రుణమాఫీ కోసం కేశంపేట అగ్రికల్చర్ కార్యాలయం చుట్టూ చెప్పులరిగేలా తిరుగుతున్నం. మా భూమిని 2017లో ఐసీఐసీఐ బ్యాంకులో రూ.4 లక్షలకు తాకట్టు పెట్టాం. రూ.2లక్షల వరకు రుణమాఫీ జరగాలంటే మిగతా డబ్బులు చెల్లించాల్సి ఉంటుందని ప్రభుత్వం, అధికారులు చెప్పడంతో వడ్డీ వ్యాపారుల వద్ద మిగతా డబ్బులు అప్పుగా తీసుకొని రూ.4 లక్షలకు మిత్తితో మొత్తం రూ.5.20 లక్షలను ఐసీఐసీఐ బ్యాంకుకు చెల్లించాం. బ్యాంకు నుంచి ఎన్వోసీ కావాలని అగ్రికల్చర్ కార్యాలయ అధికారులు చెప్పడంతో ఎన్వోసీ తీసుకొని కార్యాలయంలో అప్పగించాం. రూ.2 లక్షలు మాఫీ కాకపోగా పంట రుణం రూ.1.30 లక్షలు కూడా మాఫీ కాలేదు. రూ.1.30 లక్షల రుణం కూడా ఇప్పటి వరకు మాఫీకాలేదు. వడ్డీ వ్యాపారులవద్ద తెచ్చిన రూ.5.20 లక్షలకు మిత్తిని కట్టలేకపోతున్నాం.
– రాఘవేందర్‌రెడ్డి, రైతు, కొత్తపేట, కేశంపేట మండలం
మాట తప్పిన ప్రభుత్వం
వంపుగూడెం గ్రామంలో నాకు, నా భార్యకు కలిపి 6 ఎకరాల 27 గుంటల భూమి ఉన్నది. కడ్తాల్‌లోని కెనరా బ్యాంక్‌లో రూ.2.65 లక్షలు పంట రుణం తీసుకోగా, వడ్డీతో కలిపి రూ.2.80 లక్షలు అయ్యింది. కాంగ్రెస్ ప్రభుత్వం రూ.2 లక్షల వరకు పంట రుణం చేస్తామని ప్రకటించింది. ఈ విషయమై వ్యవసాయ శాఖ అధికారులను సంప్రదిస్తే రెండు లక్షలపైన ఉన్న డబ్బులను రైతులు చెల్లిస్తే రుణమాఫీ పథకానికి అర్హులవుతారని చెప్పారు. దీంతో రెండు లక్షలకు పైన ఉన్న మిగతా రూ.80 వేలను బ్యాంకులో చెల్లించాను. కాంగ్రెస్ ప్రభుత్వం రుణమాఫీపై ఎన్నోసార్లు మాట తప్పి రైతులను వంచిస్తున్నది
– గాజుల జంగారెడ్డి, వంపుగూడెం, కడ్తాల్ మండలం
ప్రభుత్వం మాట నిలబెట్టుకోవాలి
కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీ ప్రకారం మాట నిలబెట్టుకోవాలి. గతంలో రూ.2 లక్షల వరకు రైతులకు రుణ మాఫీ చేస్తామని, మళ్లీ రెండు లక్షల పైబడి రుణం చెల్లిస్తే రూ.2 లక్షలు మాఫీ చేస్తామని చెప్పి ఇప్పుడు చేతులెత్తేయడం సరికాదు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి అమలు కాని హామీలు, అబద్దపు మాటలు చెప్పడమే తప్పా రైతులను ఆదుకున్న దాఖలాలు లేవు. నాకు రూ.4 లక్షల 45 వేలు బ్యాంకులో రుణం ఉంటే రూ.2 లక్షల 60 వేలు చెల్లించా. ప్రభుత్వం 2 లక్షల వరకు మాఫీ చేస్తానని ఆశ పెట్టడంతోనే ముందస్తుగా చెల్లించా. ఇప్పటివరకు రెండు లక్షల రుణం మాఫీ అవ్వలేదు. ప్రజా ప్రభుత్వం అనే బదులు మోసపూరిత ప్రభుత్వం అంటే కరెక్ట్‌గా సెట్ అవుతుంది.
– మల్లారెడ్డి, రైతు, కౌకుంట్ల గ్రామం, చేవెళ్ల మండలం
ఆశలు అడియాశలయ్యాయి
కాంగ్రెస్ సర్కార్ అధికారంలోకి రాగానే రుణమాఫీ చేస్తారని ఎంతో అశపడ్డాం. కానీ మాలాంటి ఎంతోమంది రైతుల ఆశలు అడియాశలయ్యాయి. కొంత మందికి మాత్రమే రుణమాఫీ చేసి చేతులు దులుపుకొన్నారు. మాది ఫరూఖ్‌నగర్ మండలం విఠ్యాల గ్రామపంచాయతీలోని శ్యామలబండాతండాలో మాకు కొంత భూమి ఉన్నది. గతంలో ఒక్కొక్కరం విడివిడిగా బ్యాంకులో లక్ష రూపాయల చొప్పున రుణం తీసుకున్నాం. రుణమాఫీ అవుతుందని ఎంతో అశగా ఎదురుచూశాం. నేటికీ బ్యాంకు, అధికారుల చుట్టూ తిరిగినా ఫలితం శూన్యం. ప్రజలను ఆశపెట్టే హామీలు ఇవ్వొద్దు.
– బాలు జెటావత్ శ్యామలబండతండా, విఠ్యాల గ్రామం
తడిగుడ్డతో గొంతు కోస్తున్న సర్కారు
నేను ఆలూర్ పీఏసీఎస్ బ్యాంక్‌లో 2లక్షల30వేలు తీసుకున్నా. రుణమాఫీ చేస్తామని రేవంత్‌రెడ్డి మొదలుకొని అందరూ ఊకదంపుడు ఉపన్యాసాలతో రాష్ట్ర ప్రజలను మోసం చేసి ఓట్లేయించుకున్నారు. ఇప్పుడు కాంగ్రెస్ సర్కారు తడి గుడ్డతో రైతుల గొంతు కోసింది. రుణమాఫీ చేస్తారనే ఆశతో ఉన్న మాకు నిరాశనే మిగిల్చింది. 40వేల కోట్లు ఒక్క ఎడమ చెయ్యితో చెల్లిస్తామని పొంకనాలు కొట్టిన రేవంత్‌రెడ్డి మా రైతుల కొంపలు ముంచిండు. సాగు చేయాలంటే కష్టంగా మారింది. గతంలో సీఎం కేసీఆర్ రైతు బంధు, రుణమాఫీ చేసి రైతులను ఆదుకున్నాడు. ఈ ప్రభుత్వంలో రైతులకన్నీ కష్టాలే. బ్యాంకులకెళితే రుణం ఇవ్వడంలేదు. అధికారుల చుట్టూ తిరిగినా ప్రయోజనం లేదు. రైతు బాగుండాలంటే మరోసారి సీఎంగా కేసీఆర్ రావాలి.
– బుల్కాపూరం అంజిరెడ్డి, రైతు, చేవెళ్ల మండలం, కమ్మెట గ్రామం