రంగారెడ్డి, సెప్టెంబర్ 5 (నమస్తే తెలంగాణ) :‘గురుబ్రహ్మ గురువిష్ణు గురుదేవో మహేశ్వర.. గురుసాక్షాత్ పరబ్రహ్మ తస్మైశ్రీ గురువేనమః’.. విద్యాబుద్ధులు నేర్పి.. మన ఉన్నతికి తోడ్పడేది గురువు.. తల్లిదండ్రుల తర్వాత స్థానం గురువుదే.. ఎంతో మందిని తీర్చిదిద్దే గురువే మనకు స్ఫూర్తి… ఏమిచ్చినా.. ఎంతిచ్చినా గురువు రుణం తీర్చుకోలేనిది.. మంగళవారం రంగారెడ్డి జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో ఉపాధ్యాయుల దినోత్సవం అట్టహాసంగా జరిగింది. విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ముఖ్య అతిథిగా హాజరై జ్యోతి ప్రజ్వలన చేశాక 203 మంది ఉత్తమ ఉపాధ్యాయులను సన్మానించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ సీఎం కేసీఆర్ నేతృత్వంలో విద్యారంగంలో నూతన శకం ఆవిష్కృతమైందన్నారు. గురుకుల పాఠశాలలు అద్భుత ఫలితాలను సాధిస్తూ దేశానికే రోల్ మాడల్‌గా నిలిచాయన్నారు. విద్యార్థులను తీర్చిదిద్దడంలో ఉపాధ్యాయుల పాత్ర కీలకమన్నారు. ‘మన ఊరు-మన బడి’తో ప్రభుత్వ పాఠశాలల స్వరూపం మారిందని, కార్పొరేట్ స్థాయిలో విద్య అందుతున్నదన్నారు.
అన్ని వర్గాల పేద విద్యార్థులకు కార్పొరేట్ విద్యను అందించాలన్న లక్ష్యంతో సీఎం కేసీఆర్ నెలకొల్పిన గురుకులాలు అద్భుత ఫలితాలను సాధిస్తూ దేశానికే రోల్ మోడల్‌గా నిలిచాయని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. జాతీయ ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకుని మంగళవారం రంగారెడ్డి జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో నిర్వహించిన వేడుకలకు మంత్రి సబితారెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. జ్యోతి ప్రజ్వలన చేశాక జిల్లా స్థాయిలో ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎంపికైన 203 మంది ఉపాధ్యాయులను సన్మానించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. తల్లిదండ్రులు జన్మనిస్తే.. భవిష్యత్తును ఇచ్చేది గురువేనని పేర్కొన్నారు. విద్యార్థులను ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దడంలో ఉపాధ్యాయుల కృషి ఎంతో ఉందన్నారు. ఎన్నో ఒడిదుడుకులు, కష్టాలకు ఓర్చుకుని కష్టపడి చదివి అత్యున్నత రాష్ట్రపతి పదవిని అలంకరించిన సర్వేపల్లి రాధాకృష్ణ ప్రతి ఒక్కరికీ స్ఫూర్తిగా నిలిచారని కొనియాడారు. సర్వేపల్లి బాటలోనే విద్యారంగంలో వినూత్న సంస్కరణలకు సీఎం కేసీఆర్ శ్రీకారం చుట్టారని పేర్కొన్నారు. గురుకులాల ఏర్పాటుతో విద్యారంగంలో నూతన శకం ఆవిష్కృతమైందని, అనతికాలంలోనే గురుకులాలు అద్భుత ఫలితాలను సాధిస్తున్నాయన్నారు. ఒక్కో విద్యార్థిపై ప్రభుత్వం రూ.1.25 లక్షలు ఖర్చు చేస్తున్నదని, చాలామంది విద్యార్థులు ప్రైవేటు పాఠశాలలకు స్వస్తి పలికి గురుకులాల బాట పడుతున్నారని పేర్కొన్నారు.
‘మన ఊరు-మన బడి’తో మారిన స్వరూపం
‘మన ఊరు-మన బడి’ కార్యక్రమంతో ప్రభుత్వ పాఠశాలల స్వరూపమే మారిపోయిందని మంత్రి సబితారెడ్డి అన్నారు. ఈ కార్యక్రమం ద్వారా పాఠశాలల్లో 12 రకాల మౌలిక సదుపాయాలు, ఇతర మరమ్మతుల కోసం పెద్దఎత్తున నిధులను ప్రభుత్వం ఖర్చు చేస్తున్నదన్నారు. తొలిమెట్టు కార్యక్రమంలో విద్యార్థులకు సులభంగా విద్యాబోధన చేయడం ద్వారా విద్యార్థులు మంచి ఫలితాలు సాధించడంలో ఉపాధ్యాయుల కృషి ఎంతో ఉందన్నారు. ప్రభుత్వ పాఠశాలలకు చెందిన విద్యార్థులు చదువుల్లోనే కాకుండా క్రీడల్లో జాతీయ, అంతర్జాతీయ స్థాయిల్లో రాణిస్తూ రాష్ట్ర ఖ్యాతిని చాటుతున్నారని పేర్కొన్నారు. తెలంగాణ ప్రభుత్వం విద్యార్థుల సంక్షేమంతోపాటు ఉపాధ్యాయుల సంక్షేమానికి పాటుపాడుతూ అనేక కార్యక్రమాలను అమలు చేస్తున్నదని మంత్రి పేర్కొన్నారు.
ఉపాధ్యాయుల పాత్ర కీలకం
జిల్లా పరిషత్ చైర్పర్సన్ అనితారెడ్డి మాట్లాడుతూ.. నవ సమాజ నిర్మాణంలో కీలకపాత్ర ఉపాధ్యాయులదేనని తెలిపారు. విద్యార్థులకు చదువుతోపాటు సంస్కారం, క్రమశిక్షణను అలవర్చేందుకు ఉపాధ్యాయులు కృషిచేయాలని ఆమె కోరారు.
ఉపాధ్యాయ వృత్తికి ఎంతో గౌరవం
కలెక్టర్ హరీశ్ మాట్లాడుతూ.. తాను కూడా ఉపాధ్యాయుడిగా పనిచేశానని, ఉపాధ్యాయ వృత్తికి సమాజంలో ఎంతో గౌరవం ఉందన్నారు. సీఎం కేసీఆర్ తెలంగాణలో విద్యారంగానికి పెద్దపీట వేసి దేశంలో ఎక్కడాలేని విధంగా గురుకులాలను ఏర్పాటు చేసి నాణ్యమైన విద్యను అందిస్తున్నారని పేర్కొన్నారు. ఉపాధ్యాయులు ప్రభుత్వ సంకల్పం నెరవేరేలా కృషిచేయాలని కలెక్టర్ సూచించారు. కార్యక్రమంలో జడ్పీ చైర్పర్సన్ అనితారెడ్డి, ఎమ్మెల్యేలు కాలె యాదయ్య, జైపాల్ యాదవ్, ఎమ్మెల్సీ దయానంద్, కలెక్టర్ హరీశ్, డీఈవో సుశీందర్‌రావు, జడ్పీ సీఈవో దిలీప్‌కుమార్ పాల్గొన్నారు.
గౌరవప్రదమైంది ఉపాధ్యాయ వృత్తి
వికారాబాద్, సెప్టెంబర్ 5 (నమస్తే తెలంగాణ) : ఎందరో గొప్ప వ్యక్తులను తీర్చిదిద్దిన ఘనత ఉపాధ్యాయులదేనని, ఉపాధ్యాయ వృత్తి ఎంతో పవిత్రమైనదని, గౌరవప్రదమైనదని రాష్ట్ర సమాచార, పౌరసంబంధాలు, గనులు, భూగర్భవనరుల శాఖ మంత్రి పట్నం మహేందర్‌రెడ్డి అన్నారు. మంగళవారం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో నిర్వహించిన ఉపాధ్యాయ దినోత్సవ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొని, జిల్లాస్థాయి ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎంపికైన 75 మందిని కలెక్టర్ నారాయణరెడ్డి తదితరులతో కలిసి సన్మానించి ప్రశంసాపత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం విద్యాభివృద్ధికి ఎంతో కృషి చేస్తున్నదని, గత తొమ్మిదేండ్లలో రూ.1.87 లక్షల కోట్ల నిధులను ఖర్చు చేసిందన్నారు. అన్ని వర్గాల విద్యార్థులకు ఉచితంగా నాణ్యమైన విద్యనందించేందుకు ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ గురుకుల పాఠశాలలను ఏర్పాటు చేసిందని మంత్రి మహేందర్‌రెడ్డి వెల్లడించారు. గురుకులాలను ఏర్పాటు చేయడంతోపాటు 12 వేల పోస్టులను భర్తీ చేసిందన్నారు. విద్యార్థుల తల్లిదండ్రులు కూడా బాధ్యతగా తీసుకొని తమ పిల్లలను ఉత్తమ విద్యార్థులుగా తీర్చిదిద్దేందుకు సహకరించాలని సూచించారు.
సమాజ నిర్మాణంలో ఉపాధ్యాయులే కీలకం
సమాజ నిర్మాణంలో ఉపాధ్యాయుల పాత్ర కీలకమని, ఉపాధ్యాయులు మంచి విద్యనందిస్తూనే విద్యార్థులు నైతిక విలువలు పాటించేలా కృషి చేయాలని కలెక్టర్ నారాయణరెడ్డి సూచించారు. భారతీయ సంస్కృతి సాంప్రదాయాలతోపాటు విలువలతో కూడిన విద్యను అందించాలన్నారు. చెడుకు దూరంగా సమాజంలో మంచి జీవనాన్ని అలవర్చేలా ముందుకు సాగాలన్నారు. పిల్లల భవిష్యత్తు చాలా ముఖ్యమని.. వారిలో ఆ నమ్మకాన్ని కలిగించేలా ఉపాధ్యాయులు విద్యా వ్యవస్థను ముందుకు తీసుకెళ్లేలా కృషి చేయాలని సూచించారు. విద్యార్థులను మంచి పౌరులుగా తీర్చిదిద్దే క్రమంలో తోటివారితో మంచిగా మెలిగేలా చూడాలన్నారు. దీనికి తల్లిదండ్రుల ప్రోత్సాహం కూడా అవసరమని కలెక్టర్ పేర్కొన్నారు.
ఈ సందర్భంగా సమగ్ర మరియు శిక్షణా భారత కృత్రిమ అవయవాల నిర్మాణ సంస్థ సహకారంతో రూ.5.51 లక్షల వ్యయంతో 192 మంది దివ్యాంగులకు 278 ఉచిత ఉపకరణాలను మంత్రి మహేందర్‌రెడ్డి అందజేశారు. కార్యక్రమంలో ఎస్పీ కోటిరెడ్డి, అదనపు కలెక్టర్లు రాహుల్‌శర్మ, లింగ్యానాయక్, ట్రైనీ కలెక్టర్ అమిత్ నారాయణ్, గ్రంథాలయ సంస్థ చైర్మన్ సుశీల్‌కుమార్‌గౌడ్, డీఈవో రేణుకాదేవి, వికారాబాద్ మున్సిపల్ చైర్పర్సన్ మంజుల పాల్గొన్నారు.