రాష్ట్ర ఆవిర్భావ వేడుకల్లో భాగంగా గురువారం అమరవీరులకు ఉమ్మడి జిల్లా ప్రజలు ఘనంగా నివాళులర్పించారు. రెండు నిమిషాలు మౌనం పాటించి స్మరించుకున్నారు. పలుచోట్ల జరిగిన కార్యక్రమాల్లో ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొని అమరవీరుల కుటుంబ సభ్యులను సన్మానించారు. రంగారెడ్డి కలెక్టరేట్లో సంస్మరణ సభను నిర్వహించగా, వికారాబాద్ జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన అమరవీరుల స్థూపాన్ని విద్యాశాఖ మంత్రి సబితారెడ్డి ఆవిష్కరించారు. అనంతరం అమరుల కుటుంబ సభ్యులతో కలిసి భోజనం చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ స్వరాష్ట్రం కోసం ప్రాణత్యాగం చేసిన అమరుల కుటుంబాలను ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకుంటున్నదన్నారు. వారి ఆకాంక్షలకు అనుగుణంగా సీఎం కేసీఆర్ పాలన సాగిస్తూ రాష్ర్టాన్ని ప్రగతిలో పరుగులు పెట్టిస్తున్నారన్నారు.
వికారాబాద్, జూన్ 22 (నమస్తే తెలంగాణ): తెలంగాణ రావాలని, మా పాలన మాకొస్తే బాగు చేసుకుంటామనే ఆకాంక్షతో ఎంతోమంది తమ ప్రాణాలను త్యాగం చేశారని, అమరుల త్యాగాలు మరువలేనివని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి పి.సబితాఇంద్రారెడ్డి అన్నారు. గురువారం జిల్లా కేంద్రంలోని ఆర్అండ్బీ అతిథి గృహం పరిధిలో ఏర్పాటు చేసిన అమరవీరుల స్థూపాన్ని మంత్రి సబితారెడ్డి జడ్పీ చైర్పర్సన్, ఎమ్మెల్యేలతో కలిసి ప్రారంభించారు. అంతకు ముందు కలెక్టరేట్లో అమరవీరుల కుటుంబ సభ్యులతో కలిసి మంత్రి, ఎమ్మెల్యేలు, కలెక్టర్, ఎస్పీలు భోజనం చేశారు. అక్కడి నుంచి అమరవీరుల కుటుంబ సభ్యులతో అమరవీరుల స్థూపం వద్ద జరిగే సమావేశానికి కలిసి వచ్చారు. అధికారులు, ప్రజాప్రతినిధులు, ప్రజలతో కలిసి ముందుగా అమరవీరులను తలచుకుంటూ 2 నిమిషాలు మౌనం పాటించారు.
అమరుల త్యాగాల ఫలితమే తెలంగాణ
మంత్రి సబితారెడ్డి మాట్లాడుతూ.. 1969లో జరిగిన ఉద్యమం ఒక ఎత్తు అయితే మలిదశ ఉద్యమం మరో ఎత్తని తెలిపారు. సీఎం కేసీఆర్ పిలుపు మేరకు ఎంతో మంది ఉద్యమంలో పాల్గొన్నారని, విద్యార్థులు, ఉద్యోగులు అన్నీ వదులుకొని ఉద్యమించారని గుర్తు చేశారు. అమరవీరుల త్యాగం అజరామరమని కొనియాడారు. ఆ దిశగా సీఎం కేసీఆర్ దశాబ్ది ఉత్సవాల్లో అమరులను స్మరించుకోవాలనే అమరుల సంస్మరణ దినోత్సవాలను జరపాలని నిర్ణయించారన్నారు. త్యాగాలను గుర్తు చేసుకొని బాధ్యతగా పనిచేయాలని సీఎం కేసీఆర్ తరచూ చెబుతుంటారన్నారు. అమరుల త్యాగాల ఫలితమే తెలంగాణ రాష్ట్రమనేది అందరూ గుర్తుంచుకోవాలని, సీఎం కేసీఆర్ సచివాలయం ముందు అమరవీరుల స్థూపాన్ని ఏర్పాటు చేశారని మంత్రి తెలిపారు.
తెలంగాణ కోసం ఇంద్రారెడ్డి తన వంతు ప్రయత్నం
తొలి దశ ఉద్యమంలో ఇంద్రారెడ్డి నిద్రపోతున్న తెలంగాణను తట్టిలేపారని మంత్రి పేర్కొన్నారు. తెలంగాణ అని నినదించేందుకు భయపడే ఆ రోజుల్లో వాహనంపై జై తెలంగాణ అని రాసుకున్నది ఇంద్రారెడ్డి మాత్రమేనని మంత్రి సబితారెడ్డి గుర్తు చేశారు. నిధులు రావోనని భయపడే రోజుల్లో ఇంద్రారెడ్డి తనవంతు ప్రయత్నం చేశారని, తెలంగాణ కోసం అందరినీ ఒక్కతాటిపైకి తీసుకురావడంలో ఇబ్బందులు ఎలా ఉంటాయనేది తనకు తెలుసని మంత్రి అన్నారు. నీళ్లు, నిధులు, నియామకాలు అనే ఆకాంక్షను నెరవేర్చే దిశగా సీఎం కేసీఆర్ అడుగులు వేస్తున్నారని మంత్రి పేర్కొన్నారు. అమరవీరుల స్థూపం ఏర్పాటు చేసేందుకు కృషి చేసిన కలెక్టర్ నారాయణరెడ్డిని అభినందించారు.
ఉద్యమకారులకు అండగా ప్రభుత్వం
ఈ సందర్భంగా జడ్పీ చైర్పర్సన్ సునీతారెడ్డి మాట్లాడుతూ.. అమరవీరుల త్యాగ ఫలితంగానే మనమందరం సంతోషంగా ఉంటున్నామన్నారు. తెలంగాణ రాష్ట్ర సాధనలో ఉద్యమకారులు ఎంతో కృషి చేశారని వారిని కొనియాడారు. ఉద్యమకారులను గుర్తించి ప్రభుత్వం వారికి అండగా నిలుస్తుందని ఆమె తెలిపారు.
అమరవీరుల స్థూపానికి ప్రత్యేక గుర్తింపు
ఎమ్మెల్యే ఆనంద్ మాట్లాడుతూ.. అమరవీరుల స్థూపానికి ప్రత్యేక గుర్తింపు ఉందన్నారు. 25 ఫీట్లు ఉన్న స్థూపానికి నాలుగు దిక్కులు ఉంటాయన్నారు. స్థూపంపై ధర్మ చక్రం ఉంటుందని, దానిపై తెలుపు రంగులో ఉన్న లిల్లిపువ్వు ఉంటుందన్నారు. లిల్లి పువ్వు శాంతికి సంకేతమని వివరించారు. దళిత బంధు రెండో విడతలో తెలంగాణ ఉద్యమకారుడు నర్సింహులు పేరును లిస్టులో రాసినట్లు తెలిపారు.
అలుపెరగని పోరాటం
కలెక్టర్ నారాయణరెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణ ఉద్యమం సమయంలో అలుపెరగని పోరాటం చేశారన్నారు. తమ ప్రాణాలను సైతం లెక్కచేయకుండా ఆత్మబలిదానాలు చేసుకొని తెలంగాణ రాష్ట్ర సాధనలో ముఖ్య పాత్ర పోషించారని కొనియాడారు. వారి కుటుంబాలకు ప్రభుత్వం ఆదకుంటుందని వివరించారు. అనంతరం అమరవీరుల కుటుంబాలను మంత్రి సన్మానించి, జ్ఞాపికలను అందజేశారు.
కార్యక్రమంలో ఎమ్మెల్యేలు మహేశ్‌రెడ్డి, రోహిత్‌రెడ్డి, నరేందర్ర్రెడ్డి, యాదయ్య, ఎస్పీ కోటిరెడ్డి, రాష్ట్ర బీసీ కమిషన్ సభ్యుడు శుభప్రద్‌పటేల్, జడ్పీ వైస్ చైర్మన్ విజయ్‌కుమార్, జిల్లా అదనపు కలెక్టర్ రాహుల్‌శర్మ, ట్రైనీ కలెక్టర్ సంచిత్‌గంగ్వార్, ఆర్డీవో విజయకుమారి, మున్సిపల్ చైర్పర్సన్ మంజుల, మార్కెట్ కమిటీ చైర్పర్సన్ దీప, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ సుశీల్‌కుమార్‌గౌడ్, ఎంపీపీ చంద్రకళ ఉన్నారు.