బొంరాస్‌పేట, అక్టోబర్ 16 : మోసకారి కాంగ్రెస్ పార్టీని వచ్చే ఎన్నికల్లో తరిమికొట్టాలని రాష్ట్ర గనులు, భూగర్భ వనరుల శాఖ మంత్రి పట్నం మహేందర్‌రెడ్డి ప్రజలకు పిలుపునిచ్చారు. బొంరాస్‌పేట మండలం మదన్‌పల్లి గ్రామంలోని ఆంజనేయస్వామి ఆలయంలో, ఎన్నికల ప్రచార రథానికి ఎమ్మెల్యే పట్నం నరేందర్‌రెడ్డితో కలిసి పూజలు నిర్వహించిన అనంతరం ఆయన బీఆర్ఎస్ ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా గ్రామంలో నిర్వహించిన బహిరంగ సభలో మంత్రి మాట్లాడుతూ.. కాంగ్రెస్, బీజేపీ నాయకులకు ఎన్నికలప్పుడే ప్రజలు గుర్తుకు వస్తారని, ఇలాంటి పార్టీలను ప్రజలు నమ్మరాదని సూచించారు. కొడంగల్ నియోజకవర్గంలో 60 ఏండ్లలో చేయని అభివృద్ధి పనులను ఐదేండ్లలో చేసి చూపించామని చెప్పారు. సీఎం కేసీఆర్ ప్రకటించిన ఎన్నికల మేనిఫెస్టోను చూసి ప్రతిపక్ష పార్టీలకు వణుకు పుడుతున్నదని పేర్కొన్నారు. మహిళలకు రూ.400కే వంట గ్యాస్ సిలిండర్, పేద మహిళలకు నెలకు రూ.3 వేలు, ఆసరా పింఛన్లు రూ.2 వేల నుంచి రూ.5 వేలకు పెంపు, రూ.5 లక్షల కేసీఆర్ బీమా, రైతుబంధు ద్వారా రూ.16 వేల పెట్టుబడి సహాయం వంటి ప్రజామోదయోగ్యమైన పథకాలను బీఆర్ఎస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించిందని తెలిపారు. బీఆర్ఎస్ ప్రభుత్వం గ్రామాల అభివృద్ధికి ఎంతో కృషి చేసిందన్నారు. కొడంగల్‌లో మరోసారి పట్నం నరేందర్‌రెడ్డిని ఆశీర్వదిస్తే నియోజకవర్గాన్ని మరింత అభివృద్ధి చేస్తామని మహేందర్‌రెడ్డి అన్నారు.
కార్యక్రమంలో బొంరాస్‌పేట, దుద్యాల, కోస్గి, కొడంగల్, మద్దూరు మండలాల బీఆర్ఎస్ అధ్యక్షులు యాదగిరి, చాంద్‌పాషా, హన్మంత్‌రెడ్డి, దామోదర్‌రెడ్డి, వెంకటయ్య, బొంరాస్‌పేట జడ్పీటీసీ చౌహాన్ అరుణాదేశు, వైస్ ఎంపీపీ శ్రావణ్‌గౌడ్, పీఏసీఎస్ చైర్మన్ విష్ణువర్ధన్‌రెడ్డి, రైతు బంధు సమితి మండల అధ్యక్షుడు మహేందర్‌రెడ్డి, కోస్గి మార్కెట్ కమిటీ చైర్మన్ వీరారెడ్డి, నారాయణపేట జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రామకృష్ణ, మాజీ వైస్ ఎంపీపీలు నారాయణరెడ్డి, సుదర్శన్‌రెడ్డి, పార్టీ నాయకులు మధుయాదవ్, దేశ్యానాయక్, రమణారెడ్డి, టీటీ రామూనాయక్, బాబర్, నరేశ్‌గౌడ్, మహేందర్, వాహబ్, సలాం, రవిగౌడ్, సర్పంచ్‌లు, ఎంపీటీసీలున్నారు.
మదన్‌పల్లి గ్రామానికి చెందిన కాంగ్రెస్ కార్యకర్తలు బాబయ్య, రమేశ్, బాబు, శివకుమార్, అంజయ్య, ముద్దప్ప, నరేశ్, గోపాల్ తదితరులు మంత్రి, ఎమ్మెల్యే సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు. వీరికి మహేందర్‌రెడ్డి గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
మండలం నుంచి ప్రచారం ప్రారంభించడానికి వచ్చిన మంత్రి మహేందర్‌రెడ్డి, ఎమ్మెల్యే పట్నం నరేందర్‌రెడ్డిలకు పార్టీ శ్రేణులు ఘనంగా స్వాగతం పలికారు. మంత్రి, ఎమ్మెల్యేపై పూలుచల్లి స్వాగతించారు. పెద్దఎత్తున పటాకులు కాల్చారు. మదన్‌పల్లి నుంచి 500 బైకులతో ర్యాలీ నిర్వహించారు.
మండలంలో మంత్రి, ఎమ్మెల్యే నిర్వహించిన ఎన్నికల ప్రచారానికి ప్రజల నుంచి విశేష స్పందన లభించింది. సభలకు జనం పెద్దఎత్తున హాజరయ్యారు. బీఆర్ఎస్ ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించిన వాటి గురించి మంత్రి, ఎమ్మెల్యే వివరిస్తున్నప్పుడు ప్రజలు చప్పట్లు కొట్టి హర్షాతిరేకాలు వ్యక్తం చేశారు.
వచ్చే ఎన్నికల్లో పార్టీ నాయకులు, కార్యకర్తలు సైనికుల్లా పనిచేయాలని కొడంగల్ నియోజకవర్గ బీఆర్ఎస్ అభ్యర్థి, ఎమ్మెల్యే పట్నం నరేందర్‌రెడ్డి అన్నారు. సోమవారం మదన్‌పల్లి, మదన్‌పల్లితండా, బురాన్‌పూర్, సూర్యానాయక్‌తండా, గట్టెగానితండా, టేకులగడ్డతండా, సాలిండాపూర్ గ్రామాల్లో నిర్వహించిన ఎన్నికల ప్రచార సభలో మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ ప్రజలకు ఆమోదయోగ్యమైన పాలన అందిస్తున్నారని పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు చెప్పే మోసపూరిత హామీలకు మోసపోరాదని ప్రజలకు సూచించారు. సీఎం కేసీఆర్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను దేశమే కాపీ కొడుతున్నదని, అలాంటిది కాంగ్రెస్ హామీలను కాపీ కొట్టే కర్మ తమకు ఏముందని తెలిపారు. కాంగ్రెస్ పార్టీకి సంక్షేమ పథకాలను అమలు చేయడం చేతకాదని, తమ ప్రభుత్వం పేదలకు అందిస్తున్న సంక్షేమ పథకాలను అడ్డుకోవడానికి మాత్రం చేతనైతదని విమర్శించారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే తండాలకు గుర్తింపు వచ్చిందని, రూ.200 కోట్లతో తండాలకు బీటీ రోడ్లు నిర్మించామని చెప్పారు. పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకంతో సాగునీరందిస్తామని చెప్పారు. చెప్పింది చేసిచూపడమే బీఆర్ఎస్ ప్రభుత్వ లక్ష్యమన్నారు. ఐదేండ్లలో నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ సేవ చేశానని, రెండోసారి గెలిపిస్తే ప్రజలకు సేవకుడిలా పని చేస్తానని హామీ ఇచ్చారు. కేసీఆర్ మూడోసారి గెలిచి హ్యాట్రిక్ కొట్టడం ఖాయమని ఎమ్మెల్యే ధీమా వ్యక్తం చేశారు.