వికారాబాద్, సెప్టెంబర్ 17, (నమస్తే తెలంగాణ): జిల్లాలో జాతీయ సమైక్యతా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. వికారాబాద్ జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ ఆవరణలో రాష్ట్ర గనులు, భూగర్భవనరుల శాఖ మంత్రి పట్నం మహేందర్‌రెడ్డి పోలీసుల గౌరవ వందనాన్ని స్వీకరించి, జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం సంగం లక్ష్మీబాయి గురుకుల పాఠశాల, వికారాబాద్ జడ్పీహెచ్ఎస్ పాఠశాల, కులకచర్ల మండలం బండెల్కిచర్ల గిరిజన ఆశ్రమ పాఠశాల విద్యార్థులు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరిని అలరించాయి. ఈ సందర్భంగా స్వయం సహాయక సంఘాలకు బ్యాంకు లింకేజీ కింద రూ.10 కోట్లు, స్త్రీనిధి కింద రూ.2.30 కోట్లు, మెప్మా కింద రూ.4 కోట్ల చెక్కులను మంత్రి అందజేశారు. అనంతరం పలువురు దివ్యాంగులకు వీల్చైర్లను మంత్రి మహేందర్‌రెడ్డి, కలెక్టర్, ఎమ్మెల్యేలు అందజేశారు. జాతీయ సమైక్యతా దినోత్సవం సందర్భంగా సీఎం కేసీఆర్ సారథ్యంలో తొమ్మిదిన్నరేండ్లలో సాధించిన విజయాలపై మంత్రి మహేందర్ రెడ్డి మాట్లాడుతూ బీఆర్ఎస్ ప్రభుత్వం పేదరిక నిర్మూలనే లక్ష్యంగా దేశంలో ఎక్కడాలేని విధంగా సంక్షేమ పథకాలను అమలు చేస్తుందని, జిల్లా ప్రజలందరి సహకారంతో జిల్లాను మరింత ప్రగతిపథంలోకి తీసుకెళ్లేందుకు కృషి చేస్తామన్నారు.
రైతులకు రూ.2882 కోట్ల రైతుబంధు సాయం..
రైతుబంధు పథకంలో భాగంగా ఎకరానికి రూ.10 వేల చొప్పున వానాకాలం, యాసంగి సీజన్లలో 2,46,285 మంది రైతులకుగాను రూ.2882 కోట్లను నేరుగా రైతుల బ్యాంకు ఖాతాల్లో జమ చేశారని రాష్ట్ర గనులు, భూగర్భవనరుల శాఖల మంత్రి పట్నం మహేందర్‌రెడ్డి తెలిపారు. అదేవిధంగా రైతులపై రుణభారం ఉండకూడదనే దృఢ సంకల్పంతో రూ.లక్షలోపు పంట రుణాలను రాష్ట్ర ప్రభుత్వం మాఫీ చేసిందని 64,993 మంది రైతులకు సంబంధించిన రూ.348 కోట్ల రుణాలను ప్రభుత్వం మాఫీ చేసిందన్నారు. రైతుబీమా పథకం కింద 4640 మంది రైతు కుటుంబాలకు రూ.236 కోట్ల బీమా పరిహారం ప్రభుత్వం అందించిందన్నారు. అదేవిధంగా రైతుల సమస్యల పరిష్కార మార్గాలను చర్చించడానికి, ఆధునిక వ్యవసాయ పద్ధతులలో మెళకువలు అందించేందుకు 99 రైతు వేదికలను రూ.21.78 కోట్లతో నిర్మించారన్నారు. సమీకృత ఉద్యాన అభివృద్ధి మిషన్ పథకం ద్వారా పండ్ల తోటల పెంపకానికి సంబంధించి జిల్లాలో 784 మంది రైతుల ద్వారా 765 ఎకరాల్లో పండించేందుకు ప్రోత్సహిస్తున్నారన్నారు.
దళితబంధుతో ఆర్థిక సాధికారత…
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమల్లోకి తీసుకువచ్చిన దళితబంధు పథకంతో దళిత కుటుంబాలు ఆర్థిక సాధికారత సాధిస్తున్నారన్నారు. జిల్లాలో మొదటి విడతలో భాగంగా 358 మంది లబ్ధిదారులకు రూ.10 లక్షల చొప్పున రూ.35.80 కోట్ల ఆర్థిక సహాయం అందించగా, రెండో విడుతలో భాగంగా ప్రతి నియోజకవర్గంలో 1100 మంది లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ కొనసాగుతుందన్నారు. మరోవైపు రెండో విడత గొర్రెల పంపిణీలో భాగంగా ఇప్పటివరకు అర్హతగల 200 మంది గొల్ల కురుమలకు గొర్రెలను పంపిణీ చేసినట్లు మహేందర్ రెడ్డి వెల్లడించారు. సంబంధిత గొల్ల కురుమలకు రూ.2.64 కోట్ల సబ్సిడీతో గొర్రెలను పంపిణీ చేశారన్నారు. అదేవిధంగా మత్స్యకారుల జీవితాల్లో వెలుగులు నింపుతున్న చేపల పంపిణీకి సంబంధించి ఈ ఏడాది కోటి26 లక్షల చేపలను 733 చెరువుల్లో, అదేవిధంగా జిల్లాలోని 17 చెరువుల్లో 12.66 లక్షల రొయ్య పిల్లలను వదిలారన్నారు. అదేవిధంగా జిల్లావ్యాప్తంగా రూ.70.47 కోట్లతో 17 చెక్‌డ్యాంలను నిర్మించారన్నారు. కోట్‌పల్లి రిజర్వాయర్ కింద 9200 ఎకరాలకు నీరందించే ప్రతిపాదనలు రూపొందించారన్నారు.
రూ.303 కోట్ల వ్యయంతో నిరంతర విద్యుత్
వ్యవసాయ అనుబంధ రంగాలకు రైతులకు 24 గంటల నిరంతర విద్యుత్ సరఫరా కోసం 11,617 కిలోమీటర్ల పొడవున 33 కేవీ, 11కేవీ, ఎల్టీ సామర్థ్యంగల విద్యుత్తు లైన్లను, 13,145 డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్లను రూ.303 కోట్ల నిధులు ఏర్పాటు చేశారన్నారు. ప్రభుత్వం 100 యూనిట్లలోపు విద్యుత్తును వినియోగిస్తున్న ఎస్సీ వర్గానికి చెందిన 18,138 మంది వినియోగదారులకు రూ.3.50 కోట్ల సబ్సిడీ, ఎస్టీ వర్గానికి చెందిన 7,149 మంది వినియోగదారులకు రూ.కోటి విలువగల సబ్సిడీని అందిస్తుందన్నారు. అదేవిధంగా 250 యూనిట్లలోపు విద్యుత్తును వినియోగిస్తున్న 1064 సెలూన్లకు రూ.2 కోట్ల సబ్సిడీ, 1601 లాండ్రీ షాపులకు రూ.3 కోట్ల సబ్సిడీని ప్రభుత్వం అందించిందన్నారు.
విద్యావ్యవస్థలో సమూల మార్పులు…
మన ఊరు-మన బడి కార్యక్రమంతో జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలు పూర్తిగా మారిపోయాయని మంత్రి మహేందర్‌రెడ్డి తెలిపారు. మొదటి విడుతలో 371 స్కూళ్లలో పనులు చేపట్టగా, ఇప్పటికే 24 పాఠశాలలను ప్రారంభించడంతోపాటు మరో 16 స్కూళ్లను ప్రారంభించేందుకు సిద్ధం చేశారన్నారు. మన ఊరు-మన బడి కార్యక్రమానికి ఇప్పటివరకు రూ.144 కోట్లను ప్రభుత్వం విడుదల చేసిందన్నారు. జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమాన్ని అమల్లోకి తీసుకువచ్చారన్నారు. 33 గురుకుల పాఠశాలలను ఏర్పాటు చేసి 15,941 మంది విద్యార్థులకు అవకాశం కల్పించారన్నారు. ఒక్కో విద్యార్థికీ ఏడాదికి రూ.1.30 లక్షలను ప్రభుత్వం ఖర్చు చేస్తుందన్నారు.
టీఎస్-ఐపాస్‌తో రూ.1676 కోట్ల పెట్టుబడులు..
టీఎస్-ఐపాస్‌తో పారిశ్రామిక రంగంలో నవశకం మొదలైందని, జిల్లాలో ఇప్పటివరకు టీఎస్-ఐపాస్ ద్వారా 611 పరిశ్రమలు ఏర్పాటుకాగా రూ.1676 కోట్ల పెట్టుబడులు వచ్చాయని, 2022-23 సంవత్సరానికిగాను 1451 మంది నిరుద్యోగులకు ఉపాధి లభించిందన్నారు. అదేవిధంగా గ్రామీణ రోడ్ల మరమ్మతుల్లో భాగంగా 108 పనులకుగాను రూ.99.47 కోట్ల నిధులను ప్రభుత్వం మంజూరు చేసిందన్నారు. సింగిల్ లేన్-డబుల్ లేన్ రోడ్ల వెడల్పునకు సంబంధించి 7 పనులకు రూ.150 కోట్లను మంజూరు చేశారన్నారు. తాండూరు పట్టణంలో రోడ్డు ఓవర్ బ్రిడ్జి నిర్మాణానికి రూ.74 కోట్లు, తాండూరు పట్టణ సుందరీకరణకుగాను రూ.25 కోట్లను ప్రభుత్వం మంజూరు చేసిందన్నారు. వికారాబాద్ పట్టణంలో రోడ్ ఓవర్ బ్రిడ్జిని నిర్మించేందుకు రూ.96 కోట్లు, రూ.60కోట్ల నిధులతో వికారాబాద్ పట్టణంలోని ప్రధాన రహదారుల అభివృద్ధి, డివైడర్లు, సింహద్వారాల ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. కార్యక్రమంలో కలెక్టర్ సి.నారాయణరెడ్డి, ఎమ్మెల్యేలు మెతుకు ఆనంద్, మహేశ్‌రెడ్డి, రాష్ట్ర బీసీ కమిషన్ సభ్యుడు శుభప్రద్‌పటేల్, జిల్లా ఎస్పీ కోటిరెడ్డి, అదనపు కలెక్టర్లు రాహుల్‌శర్మ, లింగ్యానాయక్, జడ్పీ వైస్ చైర్మన్ బి.విజయ్‌కుమార్, వికారాబాద్ మున్సిపల్ చైర్పర్సన్ మంజుల, జిల్లా అధికారులు పాల్గొన్నారు.
సబ్బండ వర్ణాలకు సంక్షేమం..
సీఎం కేసీఆర్ కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాలతో పేదింటి ఆడబిడ్డల పెండ్లీలకు లక్షా116ల ఆర్థిక సహాయాన్ని అందిస్తున్నారన్నారు. జిల్లాలో ఇప్పటివరకు 30,278 మంది లబ్దిదారులకు రూ.351 కోట్లు, షాదీముబారక్ కింద 6676 మంది లబ్ధిదారులకు రూ.77.48 కోట్ల ఆర్థిక సహాయాన్ని అందజేసిందన్నారు. అదేవిధంగా ఆసరా పథకంలో భాగంగా జిల్లాలోని 1,12,204 మంది పింఛన్‌దారులకు ప్రతినెలా రూ.27.46 కోట్లను పింఛన్ల నిమిత్తం ఖర్చు చేస్తున్నారన్నారు. అదేవిధంగా ఎస్సీ వర్గానికి చెందిన ఇల్లులేని అర్హులైన 350 మంది నిరుపేదలకు ఇండ్ల పట్టాలను పంపిణీ చేశారన్నారు. అదేవిధంగా జిల్లాలో అర్హులైన 435 మంది పోడుదారులకు 550 ఎకరాల మేర పోడు పట్టాలను ప్రభుత్వం అందజేసిందన్నారు. గిరిజనుల ఆత్మగౌరవం పెంపొందేవిధంగా జిల్లా కేంద్రంలో రూ.1.10 కోట్లతో గిరిజన భవన్ నిర్మిస్తున్నారని, పరిగి, కొడంగల్, తాండూరు నియోజకవర్గాల్లోనూ గిరిజన్ భవన్లను నిర్మిస్తున్నారన్నారు.
పేదలకు మెరుగైన వైద్యం…
రాష్ట్ర ప్రభుత్వం వైద్యారోగ్యానికి అత్యంత ప్రాధాన్యతనిస్తున్నది. తల్లీబిడ్డల సంరక్షణకుగాను అమల్లోకి తీసుకువచ్చిన కేసీఆర్ కిట్స్ పథకం ద్వారా ఇప్పటివరకు 42,663 మందికి కేసీఆర్ కిట్లను పంపిణీ చేయడం జరిగిందన్నారు. అదేవిధంగా జిల్లావ్యాప్తంగా 42 వైద్య శిబిరాల్లో 4.83 లక్షల మందికి కంటి పరీక్షలు నిర్వహించి 1.24 లక్షల మందికి కంటి అద్దాలను పంపిణీ చేశారన్నారు. రూ.1.50 కోట్లతో తెలంగాణ డయాగ్నోస్టిక్ కేంద్రాన్ని అందుబాటులోకి తీసుకువచ్చి ఇప్పటివరకు 92,794 మందికి వివిధ పరీక్షలు చేశారన్నారు. ప్రభుత్వ మెడికల్ కాలేజీ నిర్మాణానికి రూ.235 కోట్లను ప్రభుత్వం మంజూరు చేసిందన్నారు.