మంచాల, జూన్ 13 : వ్యవసాయమే జీవనాధారంగా బతుకుతున్న తమ గ్రామాల్లో మైనిం గ్ పేరుతో దుమ్మూదూళి కాలుష్యంతో ఇబ్బందులు వద్దే..వద్దని స్పష్టం చేస్తున్నారు చిత్తాపూర్, తిప్పాయిగూడ, తాళ్లపల్లిగూడ గ్రామాలవాసులు. మండలంలోని చిత్తాపూర్లోని సర్వేనంబర్ 92లో 270 ఎకరాల ప్రభుత్వ భూమి ఉన్నది. అందులో చిత్తాపూర్, తిప్పాయిగూడ గ్రామాలకు చెందిన 96మంది రైతులకు ప్రభుత్వం 237 ఎకరాల భూములకు సర్టిఫికెట్లు కూడా పంపిణీ చేయగా..
అందులో ఇంకా మరో 33 ఎకరాల మిగులు భూమి ఉన్నది. చిత్తాపూర్, తిప్పాయిగూడ మధ్యలో ఉన్న తోల్చగుట్టను ప్రభుత్వం సేవియర్ మైన్ అండ్ మినరల్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీకి మైనింగ్ తవ్వకాల కోసం కేటాయించింది. ఈ కంపెనీ రూ. 3 కోట్లతో 15,378 హెక్టార్లలో మైనింగ్ క్వారీకి అనుమతులూ తీసుకున్నట్టు సమాచారం. ఎత్తైన గుట్టలో మైనింగ్‌ను ఏర్పాటు చేస్తే గుట్ట పరిసర ప్రాంతాల్లో ఉన్న చెరువులు, కుంటలు కనుమరుగు కావడమే కాకుండా ఎంతో మంది ఉపాధిని కోల్పోయి రోడ్డున పడే దుస్థితి వస్తుందని ప్రజలు మండిపడుతున్నారు.
ప్రభుత్వం కార్పొరేట్ సంస్థలకు కొమ్ముకాస్తూ గనుల తవ్వకాలకు అనుమతి ఇవ్వడంతో మండలంలోని చిత్తాపూర్, తాళ్లపల్లిగూడ, తిప్పాయిగూడ గ్రామాలవాసులు మండిపడుతున్నారు. రాచకొండ సమీపంలో ఉన్న ఈ గ్రామాల్లో గతంలో నక్సలైట్ల ప్రాబల్యం ఉండడంతో అభివృద్ధికి దూరంగా ఉండే. ఇప్పుడిప్పుడే ఈ గ్రామాలు అభివృద్ధి చెందుతున్న సమయంలో తోల్చగుట్టపై మైనింగ్ తవ్వకాలు చేపడితే ఆ గుట్ట మొత్తం కనుమరుగు కావడమే కాకుం డా తమ బతుకులు ఛిద్రమైపోతాయని.. చివరకు పశువులు తినేందుకు గడ్డి కూడా దొరకని పరిస్థితి నెలకొంటుందని.. వాతావరణం మొత్తం కాలుష్యమయంగా మారుతుందని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
మైనింగ్‌ను అడ్డుకుంటాం..
ప్రభుత్వం మైనింగ్‌ను ఏర్పాటు చేయాలని చూస్తే అడ్డుకునేందుకు మండలంలోని తిప్పాయిగూడ, చిత్తాపూర్, తాళ్లపల్లిగూడ గ్రామాల ప్రజలు పార్టీలకతీతంగా సిద్ధమవుతున్నారు. సమావేశాలు ఏర్పాటు చేసుకోని మైనింగ్‌ను రద్దు చేయాలంటూ పోరాడాలని నిర్ణయించుకున్నారు. చిత్తాపూర్ గ్రామానికి ప్రజాభిప్రాయ సేకరణకొచ్చే అధికారులను అడ్డుకోవడమే కాకుండా.. మైనింగ్ ఇక్కడ వద్దని నిరసన తెలపాలని తీర్మానించుకున్నారు. ప్రజాభిప్రాయ సేకరణను కాకుం డా ప్రభుత్వం బలవంతంగా మైనింగ్‌ను ఏర్పాటు చేస్తే చూస్తూ ఊరుకోమని హెచ్చరిస్తున్నారు.
మైనింగ్ వద్దు..
చిత్తాపూర్లో ప్రభుత్వం మైనింగ్‌ను ఏర్పాటు చేయాలని చూస్తే ఊరుకునే ప్రసక్తే లేదు. ఇక్కడ చిన్న సన్న కారు రైతులే ఉన్నారు. వ్యవసాయం చేసుకుని జీవిస్తున్నారు. మైనింగ్‌ను ఏర్పాటు చేస్తే ఎన్నో కుటుంబాలు రోడ్డున పడతాయి.
-బొడ్డు నాగరాజుగౌడ్, మాజీ ఉప సర్పంచ్
పంట పొలాలు దెబ్బతింటాయి..
పంట పొలాల్లో మైనింగ్‌ను ఏర్పాటు చేస్తే ఆ భూములు పూర్తిగా దెబ్బతింటాయి. దీంతో ప్రజల మనుగడ ప్రశ్నార్థ్ధకంగా మారుతుంది. తోల్చగుట్టపైకి గ్రామస్తులు చాలామంది తమ మేకలు, గొర్రెలను మేతకోసం తీసుకెళ్తారు. అక్కడ మైనింగ్‌ను ఏర్పాటు చేస్తే గుట్ట కనుమరుగు కావడంతోపాటు మూగజీవాలకు మేత దొరకని పరిస్థితి ఏర్పడుతుంది.
-జోగు శంకరయ్య, తాళ్లపల్లిగూడ సర్పంచ్
ప్రజలు వ్యతిరేకిస్తున్నారు..
మైనింగ్‌తో చిత్తాపూర్ గ్రామం ఉనికిని కోల్పోయే ప్రమాదం ఉన్నది. మా గ్రామంలో మైనింగ్ వద్దని ప్రజలు ముక్తకంఠంతో వ్యతి రేకిస్తున్నారు. ప్రభుత్వం తమ గ్రామంలో బలవంతంగా మైనింగ్‌ను ఏర్పాటు చేయొద్దు. -వింజమూరి అలివేలు, సర్పంచ్, చిత్తాపూర్