వికారాబాద్, జనవరి 5 : కొన్ని రోజులుగా వికారాబాద్ జిల్లాలో చలి తీవ్రత బాగా పెరిగింది. దీంతో ప్రజలు గజగజ వణుకుతున్నారు. జిల్లాలో 9 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రత నమోదు కాగా.. కోట్పల్లి మండలంలో 8 డిగ్రీలకు పడిపోయింది. ఉష్ణోగ్రతలు సాధారణంకన్నా తక్కువగా నమోదు కావడం ఆందోళన కలిగిస్తున్నది. చలి తీవ్రతతో సాధారణంగా వచ్చే జలుబు, దగ్గు, శ్వాసకోశ వ్యాధులకు తోడు మరిన్ని కొత్తవి చుట్టుముట్టే అవకాశం ఉన్నదని వైద్యులు పేర్కొంటున్నారు. రోజురోజుకూ పడిపోతున్న ఉష్ణోగ్రతల దృష్ట్యా చిన్నారులు, వృద్ధులు అప్రమత్తంగా ఉండాలంటున్నారు.
అవసరమైతేనే..
ఉదయం 8 గంటల తర్వాతే ఇంటి నుంచి బయటికెళ్లాలి. అత్యవసరమైతే విధిగా స్వెట్టర్లు, కాళ్లకు బూట్లు, సాక్సులు, తలకు ఉలెన్ క్యాప్స్ పెట్టుకుని వెళ్లాలి. రాత్రి 7 గంటల తర్వాత చిన్నాపెద్ద తేడాలేకుండా అందరూ బయట తిరగొద్దు. వెచ్చని నీటితో స్నానం చేయాలి. గోరువెచ్చని ద్రవ పదార్థాలు ఎక్కువగా తీసుకోవాలి. శీతల గిడ్డంగుల్లో పనిచేసే కూలీలు అప్రమత్తంగా ఉండాలి. అరగంటఓసారి గిడ్డంగుల నుంచి బయటికి రావాలి. ఉదయం 9-10 గంటల మధ్య ప్రతి ఒక్కరూ తమ శరీరంపై కనీసం అరగంట పాటు సూర్యకాంతి పడేలా చర్యలు తీసుకోవాలి.
జాగ్రత్తలు తప్పనిసరి
రోజురోజుకూ చలి తీవ్రత పెరుగుతున్నది. చిన్నారులు, వృద్ధులు చాలా జాగ్రత్తగా ఉండాలి. గోరువెచ్చని నీటినే తాగాలి. బయటికెళ్లే సమయంలో వేడినిచ్చే దుస్తులను ధరించాలి. కాళ్లకు సాక్సులు, షూలు, తలకు మంకీక్యాప్లు పెట్టుకోవడం మంచిది. చలితో దగ్గు, జలుబు, ఫ్లూ వంటి వ్యాధులు వచ్చే ప్రమాదం ఉన్నది. దగ్గు, జలుబు వస్తే వెంటనే వైద్యులను సంప్రదించాలి. ఆస్తమా ఉన్నవారు చలి గాల్లులో తిరగొద్దు.
– డా. రామచంద్రయ్య, సూపరింటెండెంట్, వికారాబాద్ ప్రభుత్వ దవాఖాన