Kondurg | కొందుర్గు, ఏప్రిల్ 12 : ఎర్రటి ఎండలో ఉపాధి పనులు చేస్తున్న కూలీలకు మౌలిక వసతులు కల్పించాలని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు శ్రీను నాయక్ డిమాండ్ చేశారు. శనివారం మండల పరిధిలోని వెంకిర్యాల గ్రామంలో ఉపాధి పనులు చేస్తున్న కూలీలతో ఆయన మాట్లాడారు. కూలీల పరిస్థితిని గమనించిన ఆయన ప్రభుత్వాన్ని వారి ఇబ్బందులను తీర్చాలని కోరారు. టెంట్ల సౌకర్యం, మంచినీరు, అత్యవరస మెడికల్ కిట్టు, పనిముట్లు కల్పించాలన్నారు. అదే విధంగా కొలతలతో సంబంధం లేకుండా రోజువారి కూలీ 300 నుంచి 800 రూపాయలకు పెంచి ఇవ్వాలని, 100 పనిదినాలు కాకుండా అవసరమైన మేరకు ఉపాధి కల్పించాలన్నారు. ఇందిరమ్మ ఆత్మీయ భరోసాలో భాగంగా భూమి లేని వారికి 1200 రూపాయలు చెల్లించాలని డిమాండ్ చేశారు. ఉపాధి కూలీల సమస్యలపై నిరంతరం పోరాడుతామన్నారు. కార్యక్రమంలో మల్లేష్, నర్సింలు, యాదమ్మ, పద్మమ్మ, స్వరూప, చంద్రకాంత్, శ్రీను, శివ, ఆంజనేయులు, కృష్ణయ్య తదితరులు పాల్గొన్నారు.