జిల్లాలో మధ్యాహ్న భోజన కార్మికలు బిల్లులు రాక అనేక అవస్థలకు గురవుతున్నారు. అధిక వడ్డీలకు అప్పులు తీసుకొచ్చి భోజనం పెడుతున్నప్పటికీ బిల్లులు చెల్లించడంలేదు. నెలల తరబడి బిల్లులు రాకపోవడంతో కిరాణా, కూరగాయలు, గుడ్ల దుకాణాల యజమానుల నుంచి వచ్చే ఒత్తిడికి రోజురోజుకూ మానసికంగా కుంగిపోతున్నారు. బిల్లుల కోసం తిరుగుతున్నప్పటికీ ప్రభుత్వం నుంచి నిధులు రావడంలేదని అధికారులు చెబుతున్నారు. బిల్లుల చెల్లింపులో సర్కారు చేస్తున్న జాప్యంతో అనేకమంది మధ్యాహ్న భోజన కార్మికులకు ఆత్మహత్యలే శరణ్యంగా మారాయి. పెండింగ్ బిల్లులపై ప్రత్యక్ష పోరుకు సిద్ధం కావాలని వారు నిర్ణయించారు. ఈ మేరకు సీఐటీయూ ఆధ్వర్యంలో ఇబ్రహీంపట్నంలో జరిగిన మధ్యాహ్న భోజన కార్మికుల మహాసభల్లో ఈ మేరకు తీర్మానించారు.
– రంగారెడ్డి, నవంబర్ 19 (నమస్తే తెలంగాణ)
మధ్యాహ్న భోజన కార్మికులు అప్పులతో సతమతమవుతున్నారు. కూరగాయలు, పప్పులు, నూనె, గుడ్లు, ఇతరత్రా సరుకులకు ధరలు విపరీతంగా పెరిగి తడిసి మోపెడవుతున్నాయి. దీనికితోడు నెలనెలా బిల్లులు రాకపోవడంతో అప్పులు చేసి వంట చేసి మరీ విద్యార్థులకు వడ్డిస్తున్నారు. అయినప్పటికీ ప్రభుత్వం బిల్లులు చెల్లించకపోవడంతో వారు నానా తంటాలు పడుతున్నారు. ప్రతి రెండు నెలలకోసారి కార్మికుల బిల్లులు చెల్లించాలని ప్రభుత్వ ఉన్నతాధికారులు ఆదేశించారు. అయినా జిల్లా ఉన్నతాధికారులు మధ్యాహ్న భోజన కార్మికులకు బిల్లులు చెల్లించడంలో జాప్యం చేస్తున్నారు. కార్మికుల బిల్లుల జాప్యం గురించి బయటకి చెప్పొద్దని కొందరు ఉన్నతాధికారులు, పాఠశాలల ఎంఈవోలు ప్రధానోపాధ్యాయులను ఆదేశిస్తున్నారు. ఒకటో తరగతి నుంచి ఎనిమిదో తరగతి విద్యార్థులకు అందించే భోజనానికి కేంద్ర ప్రభుత్వం బిల్లులు ఇస్తుంది. కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే నిధులు మాత్రం సకాలంలో అందుతునన్నాయని కార్మికులు చెబుతున్నారు. కాగా.. తొమ్మిది, పది తరగతుల వారికి అందించే భోజనానికి బిల్లులు రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుంది. అయితే, రాష్ట సర్కారు కేవలం గుడ్ల బిల్లులు మాత్రమే ఇచ్చి చేతులు దులుపుకొంటున్నది.
రాష్ట్ర ప్రభుత్వం 9, 10 తరగతులకు మధ్యాహ్న భోజనానికి సంబంధించిన నిధులను మాత్రమే ఇస్తున్నది. ఈ నిధులకు సంబంధించి జిల్లావ్యాప్తంగా ఇప్పటి వరకు రూ.5కోట్ల బకాయిలున్నాయి. ఫిబ్రవరి నుంచి ఇప్పటి వరకు ఇవ్వాల్సిన బిల్లులను ఇవ్వకుండా ప్రభుత్వం కాలయాపన చేస్తూ తమను అప్పుల ఊబిలోకి నెట్టేస్తున్నట్లు కార్మకులు వాపోతున్నారు.
రంగారెడ్డిజిల్లాలో ప్రైమరీ పాఠశాలలు 882 ఉండగా.. ఇందులో 52,494., ప్రాథమికోన్నత పాఠశాలలు 181 ఉండగా.. 14,393., 249 ఉన్నత పాఠశాలలుండగా., 61,739 మంది విద్యార్థులున్నారు. అలాగే, కేజీబీవీ పాఠశాలలు 20 వరకు ఉండగా.. 6,842., మోడల్ పాఠశాలలు 9 ఉండగా.. విద్యార్థులు 5,971 మంది ఉన్నారు. ఇందులో ఒకటో తరగతి నుంచి ఐదో తరగతి వరకు ఒక్కొక్క విద్యార్థికి రోజుకు రూ.6.70., ఆరో తరగతి నుంచి ఎనిమిది వరకు ఒక్కో విద్యార్థికి రూ.10.17., 9, 10 తరగతుల ఒక్కో విద్యార్థికి రూ.13.17 ఇస్తున్నారు. ఒక్క గుడ్డుకు రోజుకు రూ.6 చొప్పున అందిస్తున్నారు.
రంగారెడ్డిజిల్లాలో మధ్యాహ్న భోజన కార్మికులకు ఇవ్వాల్సిన పెండింగ్ బిల్లులను వెంటనే విడుదల చేయాలి. బిల్లులు పెండింగ్లో ఉండటంతో మధ్యాహ్న భోజన కార్మికులు అప్పుల ఊబిలో కూరుకుపోతున్నారు. ఈ విషయమై పలుమార్లు అధికారులకు తెలిపినప్పటికీ స్పందించడంలేదు. ప్రభుత్వం అనుసరిస్తున్న విధానంతో కార్మికులు విసుగుచెందుతున్నారు.
– స్వప్న, సీఐటీయూ జిల్లా అధ్యక్షురాలు