సూర్యాపేట టౌన్, మే 17 : మాయ మాటలు, నెరవేర్చలేని హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ అనతి కాలంలోనే ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత ఎదుర్కొంటున్నదని, అన్ని రంగాల ప్రజలు అసంతృప్తితో ఉన్నారని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి అన్నారు. మాజీ సీఎం కేసీఆర్ చక్కటి పాలనను దూరం చేసుకున్నామనే భావన అందరిలో ఉందని, ప్రస్తుతం అన్ని రంగాల ప్రజలతో పాటు పట్టభద్రులంతా బీఆర్ఎస్ వెంటే ఉన్నారని తెలిపారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా సూర్యాపేటలోని బీఆర్ఎస్ జిల్లా కార్యాలయంలో శుక్రవారం ఆయన పార్టీ ముఖ్య కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జగదీశ్‌రెడ్డి మాట్లాడుతూ ఇచ్చిన హామీల అమలులో కాంగ్రెస్ పూర్తిగా విఫలమైందని, వైఫల్యాలకు కేరాఫ్ ఆ పార్టీ అని ఎద్దేవా చేశారు. బీజేపీతో తెలంగాణకు కొత్తగా ఒరిగేదేమీ లేదన్నారు. ఆ రెండు పార్టీలు అధికారం కోసం పాకులాడటం తప్ప, ప్రజల అవసరాలు, కష్ట సుఖాలు పట్టవని చెప్పారు. జాతీయ పార్టీలతో రాష్ర్టాలకు ఒరిగేదేమీ లేదని, ప్రాంతీయ పార్టీలతోనే అన్ని రంగాల అభివృద్ధి సాధ్యమవుతుందని తెలిపారు. సుమారు 14 ఏండ్లు పోరాడి తెలంగాణ రాష్ర్టాన్ని సాధించి పదేండ్ల కాలంలోనే వందేండ్ల అభివృద్ధిని చేసి చూపించిన ఘనత కేసీఆర్‌దేనని, తెలంగాణకు ఆయనే శ్రీరామరక్ష నేడు ప్రజలందరికీ అర్థమైందని తెలిపారు.
అధికార దాహంతో మోసపూరిత రాజకీయాలకు పాల్పడే పార్టీలను ప్రస్తుతం ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరన్నారు. అతి తక్కువ సమయంలో కాంగ్రెస్‌పై జనం నుంచి వ్యతిరేకత వచ్చిందని, అన్ని రంగాల ప్రజల్లో బీఆర్ఎస్ పార్టీ, కేసీఆర్‌పై మరింత విశ్వాసం పెరిగిందని తెలిపారు. ఇటీవల కేసీఆర్ నిర్వహించిన బస్సుయాత్రకు ప్రజలనుంచి వచ్చిన స్పందనే అందుకు నిదర్శనమని చెప్పారు. రాజకీయాల్లో గెలుపోటములు సహజమని, ప్రజల తీర్పును అంతా అంగీకరించక తప్పదని అన్నారు. కానీ ప్రజా క్షేత్రంలో ఎక్కువ కాలం నిలువాలంటే మనం చేసిన మంచి పనులు, అభివృద్ధి, ప్రశాంత వాతావరణం ముఖ్యమని తెలిపారు. ఈ నెలలో జరుగనున్న గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో పట్టభద్రులంతా ఏకమై బీఆర్ఎస్ అభ్యర్థి రాకేశ్‌రెడ్డిని అత్యధిక మెజార్టీతో గెలిపించడం ఖాయమన్నారు. సమావేశంలో మాజీ ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్, మున్సిపల్ చైర్పర్సన్ పెరుమాళ్ల అన్నపూర్ణ, జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ నిమ్మల శ్రీనివాస్ గౌడ్, మున్సిపల్ వైస్ చైర్మన్ పుట్ట కిశోర్, జడ్పీటీసీ జీడి భిక్షం, ఎంపీపీలు, కౌన్సిలర్లు, ఎంపీటీసీలు, సర్పంచులు తదితరులు పాల్గొన్నారు.