MLA Sabitha | బడంగ్‌పేట, జనవరి 10 : మీర్‌పేట మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఉన్న పెండింగ్ పనులను త్వరగా పూర్తి చేయించాలని మాజీ మంత్రి, ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి అధికారులను ఆదేశించారు. జిల్లెలగూడలో ఉన్న ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో మున్సిపల్ కమిషనర్ ఆర్ జ్ఞానేశ్వర్, డీఈ వెంకన్న, ఏఈ శ్రీనివాస్ తదితరులతో సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. మీర్‌పేట పెద్ద చెరువు సమీపంలో నిర్మాణం చేస్తున్న క్రీడా మైదానం పనులను త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశాలు జారీ చేశారు. క్రికెట్, కబడ్డీ, బ్యాడ్మింటన్, టెన్నిస్ తదితర కోర్టులను ఏర్పాటు చేయించాలన్నారు.
చిన్న పిల్లలకు సంబంధించిన ఆట వస్తువులను ఏర్పాటు చేయించాలన్నారు. ఈ ప్రాంత ప్రజల కోసం అనువుగా ఉండేలా క్రీడా మైదానాన్ని తీర్చిదిద్దాలన్నారు. ఏ మాత్రం జాప్యం చేయకుండా పనులు వేగంగా చేయాలన్నారు. టెండర్ ప్రక్రియ త్వరగా పూర్తి చేయాలన్నారు. గ్రౌండ్ చుట్టూ గ్రీనరీ ఉట్టి పడే విధంగా తయారు చేయాలని ఆమె అధికారులకు సూచించారు. ఆటలు ఆడుకోవడానికి లైటింగ్ సిస్టం ఏర్పాటు చేయాలన్నారు. కార్పొరేషన్ పాలక వర్గం పదవి కాలం ముగియక ముందే పనులు పూర్తి చేయించాలని ఆదేశించారు.
చెరువుల్లో గుర్రపు డెక్కను పూర్తిగా తొలగించాలని ఎమ్మెల్యే చెప్పారు. మంత్రాల చెరువు, చందన చెరువు, పెద్ద చెరువుల పరిధిలో ఉన్న సమస్యలను పరిష్కరించాలన్నారు. చెరువుల చుట్టూ గ్రిల్స్ ఏర్పాటు చేయాలన్నారు. తాత్సారం చేయకుండా పనులు చేయాలని చెప్పారు. శ్మశాన వాటికల్లో పెండింగ్‌లో ఉన్న పనులు పూర్తి చేయాలన్నారు. పనులు ఆలస్యం కావడానికి కారణాలు ఏమిటని అధికారులను అడిగారు. సాకులు చెప్పకుండా పనులు త్వరగా పూర్తి చేయాలన్నారు.
అనంతరం దివ్యాంగులకు ట్రై సైకిల్స్, సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను అందజేశారు. ఆశ వర్కర్ల సమస్యలను పరిష్కరించే విధంగా చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యేకు వినతి పత్రం అందజేశారు. కార్యక్రమంలో మాజీ ఎంపీపీ సిద్దాల లావణ్య బీరప్ప, బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు అర్కల కామేశ్ రెడ్డి, సునీతా బాల్ రాజ్, రమేశ్, శ్రీనూనాయక్, యెల్చ సుదర్శన్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.