పరిగి, సెప్టెంబర్ 24 : రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వైద్య రంగాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేస్తున్నది. ప్రభుత్వ దవాఖానల పర్యవేక్షణను గాలికి వదిలిన సర్కారు.. మరోవైపు మూగజీవాలకు అవసరమైన మందులను కూడా సక్రమంగా సరఫరా చేయడం లేదు.
గత 8 నెలలుగా పశువైద్య కేంద్రాలకు మందులు సరఫరా కాకపోవడంతో.. ఏ చిన్నపాటి వ్యాధితో మూగజీవాలను వైద్యం కోసం దవాఖానకు తీసుకెళ్తే వైద్యులు మందులను బయటికే రాస్తున్నారు. ఆఖరికి బ్యాండేజీలనూ కొన్ని చోట్ల బయటి నుంచే తెప్పిస్తున్నారు. సీఎం రేవంత్రెడ్డి సొంత జిల్లాలోనే పరిస్థితి ఇలా ఉందంటే.. రాష్ట్రంలోని మిగతా జిల్లాల్లో ఎలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు.
జిల్లాలో నెలకు 80వేలకు పైగా వైద్యం..
వికారాబాద్ జిల్లాలో సుమారు 12 లక్షలకు పైగా పశు సంపద ఉన్నది. 2018 జనాభా లెక్కల ప్రకారం గోజాతి 1,72,506, గేదె జాతి 80,401, గొర్రెలు 2,37 536, మేకలు 2,54,144, కోళ్లు 5,32,946 ఉన్నాయి. జిల్లాలో 34 ప్రాథమిక పశువైద్య కేంద్రాలు, ఐదు ఏరియా పశువైద్య కేంద్రాలు, 58 పశువైద్య ఉపకేంద్రా లున్నాయి. గత నెలలో అన్ని పశువైద్య కేంద్రాల్లో కలిసి 80 వేలకు పైచిలుకు మూగజీవాలకు వైద్యం అందించారు.
ఈ లెక్కన రోజు కనీసం 2500 పైగా చికిత్స అందుతుంది. ప్రస్తుతం సీజన్ కావడంతో గొర్రెలు, మేకలకు గాలికుంటు, నీలినాలుక, దొమ్మ రోగం, మూతి, ఇతర వ్యాధులు సోకుతుంటాయి. దీంతో ప్రతిరోజూ పశు వైద్యశాలలకు చికిత్స నిమిత్తం తీసుకొచ్చే మూగజీవుల సంఖ్య పెరుగుతున్నది. జనవరి వరకు ఇదే పరిస్థితి ఉంటుంది. పశు జాతి వర్షాకాలంలోనే ఎక్కువగా రోగాల బారిన పడుతుంటుంది. ఈ నేపథ్యంలో అవసరమైన మందులను పశువైద్యశాల ల్లో అందుబాటులో ఉంచాల్సిన ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం వహించడం విడ్డూరం.
రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి పది నెలలు గడుస్తున్నది. గత 8 నెలలుగా పశు దవాఖానలకు మందులు సరఫరా నిలిచిపోవడంపై తీవ్ర స్థాయి లో విమర్శలు వస్తున్నాయి. సరఫరా లేక పశువైద్యశాలలన్నింటిలోనూ మందులు నిండుకున్నాయి. కొన్నిచోట్ల బ్యాండేజీలు సైతం బయటి నుంచే తెప్పిస్తున్నారు. ఇదిలావుండగా అత్యవసర మందులైనా కొనుగోలు చేయాలని ఆగస్టు నెలాఖరులో జరిగిన జిల్లా స్థాయి మందుల కొనుగోలు కమిటీ సమావేశంలో నిర్ణయించగా ఇప్పటివరకు ఆ మందులు సైతం పశువుల దవాఖానలకు చేరలేదు.
ఖాళీగా పోస్టులు ..
జిల్లాలోని పశు వైద్యశాలల్లో పలు పోస్టులు ఖాళీగా ఉండడంతో మూగజీవాలకు వైద్యం అరకొరగా అందుతున్నది. జిల్లాలో ఐదు ఏరియా దవాఖానలుండగా ఐదు గురు అసిస్టెంట్ డైరెక్టర్లు పనిచేస్తున్నారు. 34 పశువైద్యశాలలుండగా వాటిలో 14 మంది రెగ్యులర్ డాక్టర్లు, నలుగురు కాంట్రాక్టు పద్ధతిలో పనిచేస్తుండగా.. మిగిలిన 16 పోస్టులు ఖాళీగా ఉన్నాయి.
అదేవిధంగా 58 పశువైద్య ఉప కేంద్రాలుండగా వాటిలోనూ సగానికి పైగా ఖాళీలే. కులకచర్ల, దోమ, యాలాల, బంట్వారం, పెద్దేముల్, దౌల్తాబాద్, బషీరాబాద్ మండల కేంద్రాల్లోని దవాఖానల్లోనే పశువైద్యుల పోస్టులు ఖాళీగా ఉండగా అక్కడ ఇన్చార్జిలతో నెట్టుకొస్తున్నారు. కాగా ప్రభుత్వం వికారాబాద్, పరిగి, కొడంగల్, తాండూరు మున్సిపాలిటీల్లో జంతు జనన నియంత్రణ కేంద్రాలను ఏర్పాటుచేసి వీధికుక్కలకు కు.ని. ఆపరేషన్లు చేయాలని నిర్ణయించింది.
ఇప్పటికే వికారాబాద్, పరిగిలో ఈ ఆపరేషన్లు ప్రారంభం కా గా కొడంగల్, తాండూరులలో త్వరలో షురూ కానున్నాయి. ఈ కేంద్రాల్లో ప్రతిరోజూ ఇద్దరు వైద్యులు, ఇద్దరు అసిస్టెంట్లు విధులు నిర్వర్తించేలా అధికారులు డ్యూటీలు కేటాయించారు. అసలే పశువైద్యుల కొరతతో ఇబ్బందులు పడుతుండగా ఉన్న వారిలోనే ప్రతిరోజూ నాలుగు కేంద్రాల్లో కలిపి 8 మంది వైద్యులు, 8 మంది సహాయకులను నియమించడంతో 8పశువైద్య కేంద్రాల్లో వైద్యం స్తంభించే అవకాశం ఉన్నది.
సీఎం సొంత జిల్లాలో.. మూగజీవాల రోదన..
రాష్ట్రంలో ఎక్కడ ఎలా ఉన్నా, సీఎం సొంత జిల్లా అంటే అన్నింటిలో ముందుంటుంది. కానీ సీఎం రేవంత్రెడ్డి సొంత జిల్లా వికారాబాద్లో మూగజీవాలకు వై ద్యం అరకొరగా అందుతుండడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పశువైద్య శాఖను ముఖ్యమంత్రే చూస్తుండగా జిల్లాలోని పశువైద్యశాలల్లో డాక్టర్లు, సహాయకుల కొరత, 8 నెలలుగా పశువైద్యశాలలకు మందులు అందకపోవడం చూస్తుంటే ఇదే మి పర్యవేక్షణ అని పలువురు ముక్కున వేలేసుకుంటున్నారు.
మిగతా జిల్లాల్లో ఎలా ఉన్నా సీఎం సొంత జిల్లాలో ఎలాంటి ఇబ్బందుల్లేకుండా ఉన్నతాధికారులు తగిన చర్యలు తీసుకుంటారు. కానీ వికారాబాద్లో పరిస్థితి అందుకు పూర్తి భిన్నంగా ఉన్నది. ఇప్పటికైనా జిల్లాలో ఖాళీగా ఉన్న పశువైద్యులు, సహాయకుల పోస్టుల ను వెంటనే భర్తీ చేయాలని, మూగజీవాలకు వైద్యం కోసం అవసరమైన మందులు సరఫరా చేయాలని పలువురు కోరుతున్నారు.