కీసర, ఏప్రిల్ 23: హైదరాబాద్ దమ్మాయిగూడ మున్సిపాలిటీ పరిధిలోని జన్నురాం కాలనీలో సమస్యలు విలయతాండవం చేస్తున్నాయి. అక్కడి ప్రజలు సమస్యలతో కక్కలేక మింగలేక చచ్చి బ్రతుకుతున్నారు. దమ్మాయిగూడ మున్సిపాలిటీ పరిధి చీర్యాల్ రెవెన్యూ పరిధిలోని జన్నురాం కాలనీ ఏర్పడి సుమారు 20 సంవత్సరాలు అవుతున్న అక్కడి సమస్యలను పరిష్కరించిన నాథుడే దిక్కులేకుండా పోయాడని అక్కడి కాలనీవాసులు లబోదిబో మొత్తుకుంటున్నారు.
2005 సంవత్సరంలో జన్నురాం కాలనీని నిర్మించారు. ఇక్కడ 29 బ్లాక్‌లో ఒక్కో బ్లాక్‌లో 24 కుటుంబాల చొప్పున మొత్తం 696 కుటుంబాలు జీవిస్తున్నాయి. గత ఏడు సంవత్సరాల క్రితం ఓవర్ హెడ్ ట్యాంక్ నిర్మించారు. ఇంత వరకు ఆ వాటర్ ట్యాంక్‌ను ప్రారంభించింది లేదు.. ఆ కాలనీవాసులకు నీళ్లు అందింది లేదు. ఆ కాలనీలో అండర్‌గ్రౌండ్ డ్రైనేజీలు నిండి పొంగిపొర్లి కంపుతో దుర్వాసన వస్తుందని ఈ విషయంపై దమ్మాయిగూడ మున్సిపల్ కమిషనర్‌కు పలుమార్లు వినతిపత్రాలు ఇచ్చిన ఫలితం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నీళ్లు లేక అలమటిస్తున్నామని, 15 రోజుల కొకసారి డ్రమ్‌లో నీళ్లు పోసి చేతులు దులుపుకుంటున్నారని, ఆ కలుషితమైన నీటిని తాగడం వల్ల క్యాన్సర్ వంటి భయంకరమైన రోగాలు వచ్చి మమ్మల్నీ పట్టి పీడిస్తున్నాయని కాలనీవాసులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సమస్యల మధ్య తమ జీవితాలను వెళ్లదీస్తున్నామని అందోళనకు గురి అవుతున్నారు. కాలనీ పక్కనే జవహర్‌నగర్ డంపింగ్‌యార్డు పక్కనే ఉండటంతో భూగర్భ జలాలన్ని పూర్తి కలుషితం అయిపోతున్నాయని అంటున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి తమ కాలనీలో నెలకొన్న సమస్యలను పరిష్కారించాలని ఆ కాలనీవాసులు కోరుతున్నారు.