Rajiv Yuva Vikasam | మేడ్చల్, జూన్15(నమస్తే తెలంగాణ): ఇప్పట్లో రాజీవ్ యువ వికాసం పథకం రాయితీ రుణాలు ఇప్పట్లో అందేలా కనపడటం లేదు. ఈ నెల 2 న రాయితీ రుణాలు అందించాలని నిర్ణయించినా రుణాలు అందలేదు. దీంతో దరఖాస్తుదారులకు రాయితీ రుణాల కోసం ఎదురుచూపులు తప్పడం లేదు. ప్రభుత్వం నిరుద్యోగులకు స్వయం ఉపాధి ఆవకాశాలు కల్పించాలన్నా ఉద్దేశ్యంతో రాజీవ్ యువ వికాసం పథకం ద్వారా రూ. 50 వేల నుంచి రూ. 4లక్షల వరకు రాయితీ రుణాలను ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు అందించాలని నిర్ణయించింది. అయితే రుణాలు అందజేయడం అప్పుడూ.. ఇప్పుడూ అంటూ ఆర్భాటాలు చేయడమే తప్ప అమలులో మాత్రం అంతగా దృష్టి సారించడం లేదని దరఖాస్తుదారులు ఆరోపిస్తున్నారు. మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాలో రాజీవ్ యువ వికాస పథకానికి 66,540 దరఖాస్తులు వచ్చాయి. జిల్లాలో మేడ్చల్, మల్కాజిగిరి, ఉప్పల్, కూకట్పల్లి, కుత్బుల్లాపూర్ నియోజకవర్గాలలోని 66,450 దరఖాస్తులకు గాను 22,648 యూనిట్లు మంజూరు అయినట్లు తెలుస్తోంది.
అర్హుల జాబితా గోప్యం
రాజీవ్ యువ వికాసం పథకానికి లబ్ధిదారుల ఎంపిక పూర్తయినట్లు అధికారులు చెబుతున్నప్పటికీ లబ్ధిదారుల జాబితాను మాత్రం గోప్యంగా ఉంచుతున్నారు. ఎంపిక చేసిన లబ్ధిదారుల జాబితాకు జిల్లా ఇంచార్జి మంత్రి అమోదం తెలపాల్సి ఉంటుంది. ముందుగా జిల్లా ఇంచార్జి మంత్రి అమోదం తెలిపితే బ్యాంకు అధికారులు అమోదించనట్లయితే పరిస్థితి ఏమిటన్న దానిపై అధికారులు మల్లగుల్లలు పడుతున్నారు. ఎంపిక చేసిన లబ్ధిదారులలో ఒకవేళ ఇంతకు ముందు బ్యాంకు రుణాలు తీసుకున్నట్లయితే బ్యాంకు అధికారులు రుణాలు అందించే అవకాశం లేదని తెలుస్తోంది. రాయితీ రుణాలు అందజేతలో సిబిల్ స్కోర్‌ను పరిగణలోకి తీసుకోవడం లేదని అధికారులు చెబుతున్నప్పటికీ ఇందులో నిజం కనిపించడం లేదు. రుణాలు అందించేందుకు సిబిల్ స్కోర్‌నే ప్రమాణికంగా బ్యాంకు అధికారులు తీసుకుంటున్నట్లు సమచారం. దీంతో ఇప్పటి వరకు లబ్ధిదారుల జాబితాను ప్రకటించడం లేదన్న అనుమనాలు వస్తున్నాయి. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ముస్లిం, క్రిస్టియన్ మైనార్టీ శాఖల నుంచి వేర్వురుగా దరఖాస్తులు స్వీకరించిన విషయం విదితమే. అయితే అత్యధికంగా దరఖాస్తులు వచ్చిన నేపథ్యంలో తక్కువగా యూనిట్లు మంజూరైన క్రమంలో కావాలనే రుణలు అందించేందుకు జాప్యం చేస్తున్నారని దరఖాస్తుదారులు ఆందోళన చెందుతున్నారు.