శామీర్‌పేట, ఆగస్టు 17 : గ్రామాభివృద్ధిపై ప్రజాప్రతినిధులు, అధికారులు దృష్టి సారించాలని అడిషనల్ కలెక్టర్ శ్యాంసన్ అన్నారు. మూడుచింతల్‌పల్లి మండలంలోని లక్ష్మాపూర్, లింగాపూర్ తాండా, ఆద్రాస్‌పల్లి గ్రామాల్లో మంగళవారం ఆయన పర్యటించి మాట్లాడుతూ.. పల్లెల ప్రగతి కోసం ప్రభుత్వం ఎన్నో కార్యక్రమాలను తీసుకువచ్చి అన్ని రంగాల్లో అభివృద్ధి పరుస్తుందన్నారు. ఈ అవకాశాన్ని గ్రామ పంచాయతీ పాలకవర్గాలు సద్వినియోగం చేసుకోవాలన్నారు. మండలంలోని లింగాపూర్ తాండాలో వైకుంఠధామం, పల్లె ప్రకృతి వనం, డంపింగ్ యార్డు, ఆద్రాస్‌పల్లిలో వైకుంఠధామం నిర్మాణ పనులను పరిశీలించారు. అనంతరం లక్ష్మాపూర్ గ్రామంలో పల్లె ప్రకృతి వనానికి కేటాయించిన భూమి సమస్యాత్మకంగా మారడంతో సంబంధిత రైతులతో మాట్లాడి నచ్చచెప్పారు. సర్వే నిర్వహించి రైతు హద్దుబందులను ఏర్పాటు చేయాలని సూచించారు. మండల పర్యటనలో భాగంగా అడిషనల్ కలెక్టర్ శ్యాంసన్ జన్మదినం సందర్భంగా కేక్‌కట్ చేసి సన్మానించారు. కార్యక్రమంలో సర్పంచ్‌లు సింగం ఆంజనేయులు, జామ్ రవి, గోపినాయక్, లలితానర్సింహులు, ఎంపీటీసీ నాగరాజు, తాసిల్దార్ రాజేశ్వర్‌రెడ్డి, ఎంపీడీవో సువిద, ఉపసర్పంచ్ వెంకటరాంరెడ్డి, గ్రామస్తులు బండి రవి, సురేశ్, కార్యదర్శి దేవేందర్‌రావు, ఎంపీవో రవి, తదితరులు పాల్గొన్నారు.