Illegal construction | దుండిగల్, మార్చి17: బస్తీలో రోడ్డు ఆక్రమించి అడ్డంగా నిర్మాణం చేపట్టినా స్థానిక రెవెన్యూ అధికారులు చర్యలు తీసుకునేందుకు వెనకడుగు వేయడం పట్ల పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు స్థానికులు. గతంలో ఇదే చోట నిర్మించిన గదులు రోడ్డుకు అడ్డంగా ఉన్నాయంటూ ఇదే రెవెన్యూ అధికారులు కూల్చివేశారు. మరి ఇప్పుడు ఏం జరిగిందో ఏమో కానీ.. రాత్రికి రాత్రి నిర్మాణం పూర్తి చేశారు కొందరు వ్యక్తులు.
ఫిర్యాదులు అందినా బుట్ట దాఖలు చేస్తున్నారు రెవెన్యూ అధికారులు. వివరాల్లోకి వెళ్తే..గండి మైసమ్మ-దుండిగల్ మండలం, సర్వేనెంబర్ 120, డీ.పోచంపల్లిలోని డాక్టర్ బస్తీలో కొందరు వ్యక్తులు గతంలో ఏకంగా రోడ్డును ఆక్రమించి రూములు నిర్మించారు. అయితే రోడ్డుపైనే నిర్మాణం చేపట్టడంతో ఇబ్బందులు పడుతున్నామంటూ స్థానికులు గతంలో ఫిర్యాదు చేయగా అప్పటి రెవెన్యూ అధికారులు సదరు నిర్మాణాన్ని నేలమట్టం చేశారు. దాదాపు రెండు మూడు ఏండ్ల క్రితం ఈ సంఘటన జరగగా మళ్లీ అదే చోట రెండు నిర్మాణాలను చేపట్టి రాత్రికి రాత్రి కొందరు వ్యక్తులు పూర్తి చేశారు.
నోటరీ చేసి అమాయకులకు విక్రయించి చేసుకున్నట్లు తెలుస్తుంది. ఈ విషయంలో రెవెన్యూ అధికారులకు సైతం అమ్యామ్యాలు పుట్టినట్లు పుకార్లు షికారు చేస్తున్నాయి. ఫలితంగానే ఎందుకు ఫిర్యాదు చేసిన సదరు నిర్మాణం వైపు కన్నెత్తి కూడా చూడడం లేదని పలువురు పేర్కొంటున్నారు. ఏకంగా రోడ్డుపైనే నిర్మాణం చేపడితే కనీస చర్యలు చేపట్టని అధికారుల తీరును ఏ విధంగా అర్థం చేసుకోవాలని పలువురు స్థానికులు వాపోతున్నారు. ప్రజల ఇబ్బందులను గుర్తించి అధికారులు ఇప్పటికైనా రోడ్డుపై నిర్మించిన గదులను తొలగించాలని కోరుతున్నారు.
Read Also :
HYDRAA | బండ్లగూడలో హైడ్రా కూల్చివేతలు
ASP Chittaranjan | విద్యార్థులు ఒత్తిడిని అధిగమిస్తేనే విజయం తథ్యం : ఏఎస్పీ చిత్తరంజన్
Harish Rao | కాంగ్రెస్ ముసుగులో ఉన్న బీజేపీ మనిషి రేవంత్: హరీశ్‌రావు