MLA Madhavaram Krishna Rao | కేపీహెచ్బీ కాలనీ, ఏప్రిల్ 26: భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) జెండాను చూస్తే కాంగ్రెస్ నేతలు ఎందుకు భయపడుతున్నారని… బీఆర్ఎస్ రజతోత్సవ వేడుకల మహాసభ సందర్భంగా ఏర్పాటుచేసిన ఫ్లెక్సీలను, బ్యానర్లను గంటలోనే తొలగించడం సరికాదని, అధికారులు కాంగ్రెస్ పార్టీకి తొత్తులుగా (బానిసలుగా) పని చేయొద్దని కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు కోరారు.
ఆదివారం వరంగల్ ఎల్కతుర్తిలో జరిగే బీఆర్ఎస్ పార్టీ మహాసభ సందర్భంగా శుక్రవారం (25న) రాత్రి కూకట్పల్లి నియోజకవర్గంలోని కేపీహెచ్బీ కాలనీ, బాలాజీ నగర్, కూకట్పల్లి తోపాటు పలు ప్రాంతాల్లో అభిమానులు బ్యానర్లు, ఫ్లెక్సీలను కట్టారు. కట్టిన గంటలోనే జీహెచ్ఎంసీ, హైడ్రా అధికారుల ఆదేశాలంటూ కింది స్థాయి సిబ్బంది ప్రత్యేక వాహనాలతో రంగంలోకి దిగి రోడ్డు పక్కన కనిపించిన బీఆర్ఎస్ పార్టీ నేతల ఫ్లెక్సీలు, బ్యానర్లను తొలగించారు. దీనిపై బీఆర్ఎస్ పార్టీ నాయకుడు గోనె శ్రీనివాసరావు ఆధ్వర్యంలో పార్టీ నేతలు ఆందోళన చేసినప్పటికీ వారు వినకుండా అన్నింటిని తొలగించారు. శనివారం ఉదయం వరకు ఎక్కడా బ్యానర్లు, ఫ్లెక్సీలను కనిపించకుండా చేశారు.
బీఆర్ఎస్ జెండా చూస్తే భయమెందుకు….?
బీఆర్ఎస్ పార్టీ జెండా చూస్తే కాంగ్రెస్ నేతలకు వణుకు పుడుతుందని, అందుకే మహాసభ ఫ్లెక్సీలను బ్యానర్లను తొలగించేందుకు అధికారులను పావులుగా వాడుతున్నారని కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు విమర్శించారు. కాంగ్రెస్, బీజేపీ నేతలు బ్యానర్లు, ఫ్లెక్సీలు పెడితే 10 రోజులు 20 రోజుల వరకు తొలగించకుండా అలానే ఉంచుతున్నారని, నేడు బీఆర్ఎస్ పార్టీ ఫ్లెక్సీలు కనిపించగానే తొలగిస్తున్నారని, జీహెచ్ఎంసీ నిబంధనలు అందరికీ ఒకేలాగా ఉండాలన్నారు.
మేము తెలంగాణ బిడ్డలమేనని, తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన కేసీఆర్ నాయకత్వంలో మేము పనిచేస్తున్నామన్నారు. అధికార పార్టీ నేతల చేతిలో బానిసలుగా మారిన ఉద్యోగులను వదిలిపెట్టబోమని, అధికారంలోకి వచ్చిన తర్వాత ఆఫీసర్ల సంగతి తేలుస్తామన్నారు. ఎవరెన్ని అడ్డంకులు సృష్టించినా బీఆర్ఎస్ పార్టీ మహాసభకు భారీ స్థాయిలో ప్రజలు తరలి వచ్చి విజయవంతం చేయడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.
Amberpet | రజతోత్సవానికి రెడీ.. అంబర్పేటలో ముందే మురిసిన గులాబీ జెండా