జీడిమెట్ల, ఆగస్టు 30 : ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలల్లో చదువుకున్న ఎంతో మంది నేడు ఉన్నత స్థాయి హోదాల్లో ఉన్నారని కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానం ద్ అన్నారు. సోమవారం చింతల్ డివిజన్, హెచ్ఎంటీ కాలనీలో ఉన్న ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్మీడియట్ విద్యార్థిని, విద్యార్థులకు ఎమ్మెల్యే పాఠ్య పుస్తకాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. కరోనా ప్రభావంతో మూతబడిన పాఠశాలలు, కళాశాలలు తిరిగి ప్రారంభం కావడం మంచి పరిణామమన్నారు. ఆన్లైన్ తరగతులతో ఇబ్బందులు ఎదుర్కొన్న విద్యార్థులు సమయాన్ని వృథా చేయకుండా చదువులో ఉత్తమ ప్రతిభను కనబరచాలన్నారు. గతేడాది ఇదే కళాశాల నుంచి ఇంటర్ ద్వితీయ సంవత్సరం విద్యార్థిని ఆయేషా ఫిర్డోజ్ 1000 మార్కులకు గాను 972 మార్కులతో రాష్ట్ర స్థాయిలో మూడవ ర్యాంకును సాధించి తల్లిదండ్రులకు, కళాశాలకు పేరు తెచ్చిందన్నారు. అనంతరం టీఆర్ఎస్ నాయకుడు కేపీ వెంకటేశ్‌గౌడ్ సహకారంతో అందించిన 30 యూనిఫారాలను విద్యార్థులకు అందజేశారు. రంగారెడ్డినగర్ డివిజన్ టీఆర్ఎస్ నాయకుడు ఎర్వ శంకరయ్య అందించిన రూ.12 వేలు , ప్రభాకర్ గుప్తా అందించిన రూ.3 వేల ఆర్థిక సహాయాన్ని ఇంజినీరింగ్ విద్యార్థిని గాయత్రికి ఎమ్మెల్యే అందజేశారు. ఈ కార్యక్రమం లో ప్రిన్సిపాల్ తిరుపతయ్య, నాయకులు బస్వరాజు, శేఖర్‌రావు, నారాయణరావు, కళాశాల సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.