గాజులరామారం, ఆగస్టు 17 : పెరుగుతున్న కాలుష్యాన్ని అరికట్టేందుకు ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కె.పి.వివేకానంద్, రంగారెడ్డి జిల్లా ఎమ్మెల్సీ శంభీపూర్‌రాజు అన్నారు. హరితహారం కార్యక్రమంలో భాగంగా మంగళవారం గాజులరామారం డివిజన్ పరిధిలోని మహదేవ్‌పురంలో గల జంతు సంరక్షణ కేంద్రంలో జీహెచ్ఎంసీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మియావాకి ప్లాంటేషన్ కార్యక్రమానికి వారు ముఖ్య అతిథులుగా హాజరై కూకట్పల్లి జోనల్ కమిషనర్ మమత, స్థానిక కార్పొరేటర్ రావుల శేషగిరిరావుతో కలిసి మొక్కలు నాటారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రంలో సీఎం కేసీఆర్ తలపెట్టిన హరితహారం కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి భవిష్యత్ తరాలకు మంచి వాతావరణాన్ని అందించేందుకు కృషి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో డీసీ ప్రశాంతి, కార్పొరేటర్లు కొలుకుల జగన్, మంత్రి సత్యనారాయణ, మాజీ కార్పొరేటర్ జి.సురేశ్‌రెడ్డి, డివిజన్ అధ్యక్షులు మహమ్మద్ఫ్రీ, విజయ్రామిరెడ్డి, పుప్పాల భాస్కర్, ఈఈ కృష్ణచైతన్య, సీనియర్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.