కుత్బుల్లాపూర్,ఆగస్టు10: కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పరిధిలో ఉన్న చెరువులను శుద్ధి చేసేందుకు అధికారులు, ప్రజాప్రతినిధులు కసరత్తులు మొదలుపెట్టారు. ఇటీవల పురపాలక శాఖమంత్రి కేటీఆర్ సారథ్యంలో మంజూరైన నిధులతో నియోజకవర్గంలోని ఎస్టీపీ ప్లాంట్ల నిర్మాణం కోసం ఎమ్మెల్యే కేపీ. వివేకానంద్, ఎమ్మెల్సీ శంభీపూర్రాజులతో పాటు ఆయా విభాగాల అధికారులు కలిసి సందర్శించారు. కొంపల్లి మున్సిపాలిటీ పరిధిలో ఫాక్స్‌సాగర్ చెరువు సమీపంలో ఎప్టీపీల నిర్మాణం కోసం స్థల పర్యవేక్షణ చేపట్టారు. అనంతరం పేట్ బషీరాబాద్ క్యాంపు కార్యాలయంలో వివిధ శాఖల అధికారులతో సమావేశమయ్యారు. నీటి శుద్ధీకరణ కేంద్రం కోసం మంజూరైన రూ.45.37 కోట్ల నిధులతో 14 ఎంఎల్డీ సామర్థ్యంతో నిర్మించేందుకు అవసరమైన స్థల కేటాయింపుపై చర్చించారు.
శివాలయ నగర్లో మంజూరైన రూ.44.17 కోట్లతో 14 ఎంల్‌డీ సామర్థ్యంతో నిర్మించేందుకు స్థల కేటాయింపును వేగంగా చేపట్టాలని సూచించారు. చెరువులు కలుషితం కావడంతో పాటు పరిసర ప్రాంతాల్లో భూగర్భ జలాలను కూడా కలుషితం చేస్తున్నాయని, దీంతో ప్రజలకు విషజ్వరాలు వ్యాప్తి చెంది అనేక ఇబ్బందులు పడుతున్నారని, ప్రభుత్వం గుర్తించి పెద్ద ఎత్తున ఎస్టీపీల నిర్మాణం కోసం నిధులను మంజూరీ చేసిందని వివరించారు. తక్షణమే వాటి నిర్మాణం కోసం కావాల్సిన స్థలాలను గుర్తించి నిర్మాణాలు చేపట్టేలా తగు చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు. ఈ సమావేశంలో కొంపల్లి మున్సిపాలిటీ చైర్మన్ సన్నా శ్రీశైలంయాదవ్, హెచ్ఎండబ్ల్యూఎస్ఎస్బీ ఎస్టీపీ జీఎం వాస సత్యనారాయణ, డీజీఎంలు రజిని, వినోద్, వాటర్‌వర్స్ డీజీఎం శ్రీధర్‌రెడ్డి, కొంపల్లి కమిషనర్ రఘుతో ఆయా శాఖల అధికారులు, సిబ్బందితో పాటు కార్పొరేటర్లు, కౌన్సిలర్లు పాల్గొన్నారు.