కుత్బుల్లాపూర్, జూలై 23 : కుత్బుల్లాపూర్ నియోజకవర్గ పరిధిలోని వరద ముంపు ప్రాంతాల్లో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అధికారయంత్రాంగం సత్వర చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ ఆదేశాలు జారీ చేశారు. శుక్రవారం కుత్బుల్లాపూర్ నియోజకవర్గం జంట సర్కిళ్ల పరిధిలో కూకట్పల్లి జోనల్ కమిషనర్ మమతతో పాటు ఆయా డివిజన్ల కార్పొరేటర్లు, అధికారులతో కలిసి ఎమ్మెల్యే విస్తృతంగా పర్యటించారు. ఫాక్స్‌సాగర్ తూము నుంచి వచ్చే కాల్వలు యాదిరెడ్డిబండ, అంగడిపేట్, గోదావరి హోమ్స్, గణేశ్‌నగర్, ఆదర్శనగర్, గాంధీనగర్ మెయిన్‌రోడ్డు, స్టార్హోమ్స్, శ్రీరామ్‌నగర్, మరాఠీబస్తీల్లోని నాలాలను పరిశీలించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ముంపు ప్రాంతాల్లో వర్షం నీరు నిలువకుండా ఉండేందుకు అధికారులు ఎప్పటికప్పుడు తగిన చర్యలు తీసుకోవాలన్నారు. అవసరమైతే ఆయా ప్రాంతాల్లో డ్రైనేజీ వ్యవస్థను మరింత పటిష్టవంతం చేసి వరదముంపు నుంచి ప్రజలకు సురక్షిత జీవనం అందించాలని సూచించారు. కార్యక్రమంలో టీఎస్ఐఐసీ జడ్‌ఎం బి.మాధవి, కమిషనర్ ఎ.విజయ, డీసీ ప్రశాంతి, ఈఈ కృష్ణచైతన్య, మాజీ కార్పొరేటర్ కేఎం గౌరీశ్, బొడ్డు వెంకటేశ్వర్రావు, ఆయా డివిజన్ల అధ్యక్షులు, పార్టీ శ్రేణులు వివిధ విభాగాల శాఖల అధికారులు, సిబ్బంది ఉన్నారు.