దుండిగల్, నవంబర్ 8: పరిశ్రమలో జరిగిన పేలుడులో తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతున్న కార్మికులకు అండగా ఉంటామని కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ.వివేకానంద్ తెలిపారు. దుండిగల్ మున్సిపాలిటీ డీ.పోచంపల్లిలోని ఆల్కాలీ మెటల్స్ లిమిటెడ్ పరిశ్రమలో గతనెల 25న జరిగిన పేలుడులో సారేగూడేనికి చెందిన కార్మికులు మహేశ్, శ్రీనివాస్ తీవ్రంగా గాయపడ్డారు. వీరు బాలానగర్‌లోని బీబీఆర్ వైద్యశాలలో చికిత్స పొందుతున్నారు. వీరిని ఎమ్మెల్యే సోమవారం పరామర్శించారు. బాధితుల ఆరోగ్య పరిస్థితిపై వైద్యులను అడిగి తెలుసుకున్నారు. మెరుగైన వైద్యం అందించాలని సూచించారు. ఆయనతో మాజీ జడ్పీ వైస్‌చైర్మన్, ఆల్కాలీ మెటల్స్ లిమిటెడ్ పరిశ్రమ యూనియన్ అధ్యక్షుడు బొంగునూరి ప్రభాకర్‌రెడ్డి, కార్యదర్శి బాలరాజు, సభ్యులు సిద్ధిక్, రవి, కౌన్సిలర్ శంభీపూర్ కృష్ణ పాల్గొన్నారు.
కుత్బుల్లాపూర్, నవంబర్8: కులాంతర వివాహాలు చేసుకున్న వారికి తెలంగాణ ప్రభుత్వం ప్రోత్సాహకాలు ఇస్తున్నదని ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ అన్నారు. కులాంతర వివాహాలు చేసుకున్న నియోజకవర్గంలోని నాలుగు జంటలకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి సోమవారం ఒక్కో జంటకు రూ.2.50 లక్షల నగదును ఫిక్స్డ్ డిపాజిట్ చేసి పత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కులాంతర వివాహాలు చేసుకున్న వారు సమాజంలో ఆత్మగౌరవంతో బతికేలా ఈ పథకాన్ని సీఎం కేసీఆర్ అమలు చేస్తున్నారన్నారు. గత ప్రభుత్వ హయాంలో ఈ పథకం కింద కేవలం రూ.50 వేలు మా త్రమే ఉండగా సీఎం కేసీఆర్ హయాంలో దాన్ని రూ.2.50 లక్షలకు పెంచారన్నారు. దీంతో ప్రభుత్వ ప్రోత్సహకాలతో ఆయా కుటుంబాలకు చిన్నచిన్న వ్యాపారాలు, ఆర్థిక వసతిని కల్పించి, వారి జీవన ప్రమాణాలను పెంచేందుకు ప్రభుత్వం కృషి చేస్తున్నదన్నారు. అన్ని వర్గాలకు సంక్షేమ ఫలాలు అందిస్తున్న ఏకైక ప్రభుత్వం తెలంగాణ సర్కారని అన్నారు. కార్యక్రమంలో ఏఎస్‌డబ్ల్యూవో కె.శ్రీకరరెడ్డి, జూనియర్ అసిస్టెంట్ ఎడ్విన్రావు, హెచ్‌డబ్ల్యూవో నర్సింహ, కొండల్రావు పాల్గొన్నారు.