దుండిగల్, అక్టోబర్ 28 : వరంగల్ జిల్లా కేంద్రంలో నవంబర్ 15న టీఆర్ఎస్ పార్టీ పరిపాలనపై జరిగే విజయగర్జనను జయప్రదం చేయాలని కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద్, ఎమ్మెల్సీ శంభీపూర్‌రాజు కార్యకర్తలకు పిలుపునిచ్చారు. కుత్బుల్లాపూర్ నియోజకవర్గ స్థాయి ప్రజాప్రతినిధులు, ముఖ్యకార్యకర్తలు, పార్టీ శ్రేణుల విస్తృత స్థాయి సమావేశాన్ని గురువారం బహదూర్‌పల్లిలోని మేకలవెంకటేశ్ ఫంక్షన్హాల్లో నిర్వహించారు. ముఖ్య అతిథులుగా వారు పాల్గొని..మాట్లాడుతూ.. టీఆర్ఎస్ పార్టీ తిరుగులేని రాజకీయ పార్టీగా మారిందన్నారు. ఉద్యమాలతో పోరాడి సాధించుకున్న తెలంగాణలో సీఎం కేసీఆర్ చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలు దేశానికే ఆదర్శంగా నిలిచాయన్నారు. గడిచిన ఏడేళ్లలో యావత్ దేశం తెలంగాణ వైపు చూసేవిధంగా సీఎం కేసీఆర్ అభివృద్ధి చేశారని అన్నారు. అభివృద్ధిని చూసే పార్టీకి విశేష ఆదరణ లభిస్తుం దన్నారు.
పార్టీలో కష్టపడిన ప్రతి కార్యకర్తకు గుర్తింపు తప్పకుండా ఉంటుందన్నారు. రెండు దశాబ్దాల టీఆర్ఎస్ పోరాటాలు, రెండు పర్యాయాలు అధికారంలో ఉండి తెలంగాణలో అమలు చేసిన కార్యక్రమాలను గుర్తు చేసుకునేందుకు ఏర్పాటు చేసే భారీ సభకు కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోని ప్రతి గులాబీ సైనికుడు స్వచ్ఛం దంగా తరలిరావాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ నాగరాజ్‌యాదవ్, నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ కొలన్ నీలాగోపాల్‌రెడ్డి, డిప్యూటీ మేయర్ ధన్‌రాజ్‌యాదవ్, దుండిగల్ మున్సిపాలిటీ చైర్మన్ సుంకరి క్రిష్ణవేణిక్రిష్ణ, వైస్ చైర్మన్ తుడుం పద్మారావు, కొంపల్లి మున్సిపాలిటీ చైర్మన్ సన్నా శ్రీశైలంయాదవ్, వైస్‌చైర్మన్ రత్లావత్ గంగయ్యనాయక్, మాజీ జడ్పీ వైస్ చైర్మన్ ప్రభాకర్‌రెడ్డి, పార్టీ డివిజన్ కమిటీల అధ్యక్షులు, కార్యదర్శులు, జీహెచ్ఎంసీ కార్పొరేటర్లు, అనుబంధ సంఘాల ప్రతినిధులు, సీనియర్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.