కుత్బుల్లాపూర్,అక్టోబర్ 8 : గంజాయి క్రయవిక్రయాలపై ప్రభుత్వం మరిన్ని కఠిన చర్యలు తీసుకోవాలని కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ అసెంబ్లీలో ప్రస్తావించారు. శుక్రవారం అసెంబ్లీ సమావేశాల్లో జీరో అవర్‌లో ఆయన మాట్లాడుతూ కొన్నేండ్లుగా మార్కెట్లో గంజాయి క్రయవిక్రయాలు జరుగుతున్నాయని, వీటి ద్వారా అనేకమంది యువత చెడిపోతున్నారని, యువత భవిష్యత్‌ను కాపాడేందుకు ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. నకిలీ విత్తనాలు అమ్మినా, గంజాయి లాంటి మాదకద్రవ్యాలు అమ్మకాలు చేసినా… అలాంటి వాటిపై పీడియాక్ట్ను అమలు చేయాలని హోంశాఖమంత్రి మహమూద్ అలీని సభ ద్వారా కోరారు. ఇందుకు హోంమంత్రి స్పందిస్తూ కఠిన చర్యలు తీసుకుంటామని సమాధానం ఇచ్చారు.
కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో డిగ్రీ కళాశాల, ఐటీఐ ప్రభుత్వ శిక్షణ కేంద్రం, భవన నిర్మాణ రంగ కార్మికులకు శిక్షణ కేంద్రాలను ఏర్పాటు చేసేందుకు అసెంబ్లీలో చర్చించి తగు చర్యలు తీసుకోవాలని కోరుతూ పలువురు సామాజిక వేత్తలు ఎమ్మెల్యే కేపీ వివేకానంద్‌ను కలిసి వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో సామాజిక కార్యకర్తలు కోల రవీందర్‌ముదిరాజ్, సాయి, శంకర్, భిక్షపతి, కుమార్, రాములు ఉన్నారు.