కుత్బుల్లాపూర్, అక్టోబర్ 7 : మత్స్యకారుల అభివృద్ధి కోసం కొత్త సొసైటీల ఏర్పాటు ప్రక్రియను సులభతరం చేసే దిశగా పెండింగ్‌లో ఉన్న జీఓను అమలు చేసేవిధంగా ప్రభుత్వం చొరవ చూపాలని కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ కోరారు. గురువారం అసెంబ్లీలో జరిగిన జీరో ప్రశ్నోత్తరాల సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. మత్స్య సంపదను పెంచి, గంగపుత్రులు, ముదిరాజ్‌లను ఆర్థికంగా బలోపేతం చేయడంపై ప్రభుత్వం దృష్టి సారించడం హర్షణీయమన్నారు. రాష్ట్ర జనాభాలో 14.7శాతం సుమారు 52 లక్షల మంది ముదిరాజ్‌ల కోసం రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో పలు సంక్షేమ పథకాలను అమలు చేస్తుందన్నారు. కో-ఆపరేటివ్ ఫిషరీస్ సొసైటీల ఏర్పాటును సులభతరం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన జీఓ 6ను జారీ అంశం కోర్టు పరిధి లో ఉండటంతో.. దానిపై మరోసారి చ ర్చించి.. దానిని పూర్తిస్థాయిలో అమలు చేసేదిశగా చర్య లు తీసుకోవాలన్నారు. చెరువులకు విధిస్తున్న సెస్ ఒక రకంగా లేదని, ఈ సెస్‌ను సవరించేలా చర్యలు తీసుకోవాలన్నారు. దీనికి సంబంధిత మంత్రిత్వ శాఖామంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ స్పందించి.. ఎమ్మెల్యే వివేకానంద్ లేవనెత్తిన అంశం కోర్టులో ఉన్నదని, దానిపై త్వరలో తగు చర్యలు తీసుకొని పరిష్కారమార్గం చూస్తామని సమాధానం ఇచ్చారు.