కుత్బుల్లాపూర్, సెప్టెంబర్ 8 : జరగబోయే గణేశ్ ఉత్సవాల్లో ఎలాంటి ఘటనలు చోటు చేసుకోకుండా అధికార యంత్రాంగం అన్ని రకాల చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. బుధవారం కుత్బుల్లాపూర్ సర్కిల్ కార్యాలయంలో అన్ని శాఖల అధికారులతో గణేశ్ ఉత్సవ ఏర్పాట్లపై సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిమజ్జనం జరిగే ప్రదేశాల్లో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు చోటు చేసుకోకుండా మౌలిక సదుపాయా లు, రక్షణ చర్యలు చేపట్టాలన్నారు. గజ ఈతగాళ్లను అందుబాటులో ఉంచాలని, మంచినీటి సౌకర్యం, పారిశుధ్య పనులపై ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. కొవిడ్ నిబంధనలు పాటించేలా అవగాహన కల్పించాలన్నారు. కార్యక్రమంలో కూకట్పల్లి జోనల్ కమిషనర్ మమత, తహసీల్దార్ మహిపాల్‌రెడ్డి, జంట సర్కిళ్ల ఉప కమిషనర్లు మంగతాయారు, ప్రశాంతి, ఎంహెచ్వో నిర్మల, ఇతర విభాగాల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.