మేడ్చల్ రూరల్, జూలై 2: ‘పల్లె ప్రగతితో గ్రామాలు మారాయి. పారిశుధ్యం బాగు పడి, దోమలు మాయమయ్యాయి. సీజనల్ రోగాలకు బ్రేక్ పడింది’ అని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్, కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు. మండల పరిధిలోని డబిల్‌పూర్‌లో జరిగిన పల్లె ప్రగతిలో వారు పాల్గొన్నారు. హరితహారంలో భాగంగా ఇంటికి ఆరు మొక్కల చొప్పున అందజేశారు. అనంతరం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో నిర్మించిన డైనింగ్ హాల్, సైన్స్ ల్యాబ్‌ను ప్రారంభించారు. తర్వాత సర్పంచ్ గీత అధ్యక్షతన జరిగిన బహిరంగ సభలో మంత్రులు మాట్లాడుతూ కేసీఆర్ సీఎం అయిన తర్వాత రూ.200 పింఛన్ సరిపోక రూ.2వేలు ఇస్తున్నారని గుర్తు చేశారు. రూ.40వేల కోట్లతో మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికీ నీళ్లిచ్చిన ఘనత కేసీఆర్‌కే దక్కుతుందన్నారు. గ్రామాలు అభివృద్ధి చెందాలన్న సంకల్పంతో సీఎం ప్రవేశపెట్టిన పల్లె ప్రగతితో పరిశుభ్రంగా మారాయన్నారు. పాడైన రోడ్లు, కంపుకొట్టే వీధుల పరిస్థితి మారిందన్నారు. పచ్చదనంతో గ్రామాలు కళకళలాడుతున్నాయని మంత్రులు తెలిపారు. అంతేకాకుండా గ్రామాభివృద్ధికి ప్రతినెలా గ్రామ పంచాయతీలకు ప్రభుత్వం జనాభా ప్రాతిపదికన నిధులను సమకూరుస్తుందన్నారు. ప్రతి పంచాయతీ ట్రాక్టర్, డంపింగ్‌యార్డు, వైకుంఠధామం ఇలా ఎన్నో సౌకర్యాలకు నోచుకున్నాయన్నారు. కార్మికులు చాలీచాలని జీతాలతో ఇబ్బందిపడుతుంటే వేతనాన్ని రూ.7500కు పెంచిన ఘనత కూడా సీఎం కేసీఆర్‌దే అని వారు పేర్కొన్నారు.
డబిల్పూర్ గ్రామాన్ని పారిశుధ్యం, హరితహారంలో ఆదర్శంగా తీర్చిదిద్దారని మంత్రులు దయాకర్‌రావు, మల్లారెడ్డి ప్రశంసించారు. సర్పంచ్ గీతను, పాలకవర్గ పనితీరును అభినందించారు. రోడ్డు, కమ్యూనిటీ హాల్, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వసతులు కల్పించేందుకు కృషి చేస్తామని హామీ ఇచ్చారు. గ్రామంలోని ప్రతి మహిళకు రూ.3లక్షల వడ్డీలేని రుణం ఇచ్చేందుకు ప్రణాళిక సిద్ధం చేయాలని సంబంధిత అధికారులకు సూచించారు. అలాగే పాఠశాలను అన్ని విధాలుగా అభివృద్ధి చేసేందుకు పూర్వ విద్యార్థులతో కమిటీ వేసి, ప్రణాళిక తయారు చేయాలని సర్పంచ్‌కు మంత్రులు చెప్పారు. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ కార్యదర్శి, కలెక్టర్ శ్వేతామహంతి మాట్లాడుతూ కొత్త పంచాయతీరాజ్ చట్టం సర్పంచ్‌కు బాధ్యతగా ఉండాల్సిన పరిస్థితులను తీసుకువచ్చిందన్నారు. గ్రామ అవసరాల కోసం గ్రామ పరిధిలో ఉన్న 14 ఎకరాల ప్రభుత్వ భూమిని సామాజిక అవసరాల కోసం కేటాయిస్తామని తెలిపారు. కార్యక్రమంలో జడ్పీ వైస్ చైర్మన్ వెంకటేశ్, ఎంపీపీ పద్మాజగన్ రెడ్డి, జడ్పీటీసీ శైలజావిజయేందర్‌రెడ్డి, వైస్ చైర్మన్ రజితా రాజమల్లారెడ్డి, రైతుబంధు సమితి అధ్యక్షుడు నందారెడ్డి, పీఏసీఎస్ చైర్మన్ సురేశ్ రెడ్డి, నాయకులు మద్దుల శ్రీనివాస్ రెడ్డి, భాగ్యారెడ్డి, రాజమల్లారెడ్డి, జగన్‌రెడ్డి, మాజీ జడ్పీటీసీ శైలజాహరినాథ్, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు శ్రీనివాస్, అడిషనల్ కలెక్టర్ జాన్ శ్యాంసన్, డీఆర్డీవో పద్మజారాణి, డీపీవో రమణమూర్తి, ఎంపీటీసీల ఫోరం మండల అధ్యక్షుడు గోపని వెంకటేశం, వివిధ శాఖల అధికారులు, సర్పంచ్‌లు, ఎంపీటీసీలు పాల్గొన్నారు.