మేడ్చల్, జూన్ 30 (నమస్తే తెలంగాణ): హరితహారం, పట్టణ, పల్లె ప్రగతిని యజ్ఞంలా నిర్వహించాలని మంత్రి చామకూర మల్లారెడ్డి పిలుపునిచ్చారు. మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా కలెక్టరేట్లో బుధవారం ఇన్చార్జి కలెక్టర్ శ్వేతామహంతి అధ్యక్షతన జిల్లా అధికారులతో మంత్రి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ హరితహారం, పట్టణ, పల్లెప్రగతిపై ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రత్యేక దృష్టి సారించారని, అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో పనిచేసి ప్రజలను భాగస్వాములను చేయాలన్నారు. జిల్లాలోని 61 గ్రామపంచాయతీలు, నాలుగు కార్పొరేషన్లు, 7 మున్సిపాలిటీలలో ఈ కార్యక్రమాలు కొనసాగుతాయని తెలిపారు. నాటిన మొక్కలను సంరక్షిస్తేనే హరిత తెలంగాణ లక్ష్యం సాకారమవుతుందన్నారు.
అభివృద్ధి పనులకు నిధుల కొరత లేదని, ప్రజల సౌకర్యం కోసం ప్రభుత్వం ఎన్ని నిధులైనా మంజూరు చేస్తుందని మంత్రి మల్లారెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా కలెక్టర్ శ్వేతామహంతి పల్లె, పట్టణ ప్రగతి, హరితహారం, పకృతి వనాలు, నాటిన మొక్కల సంరక్షణ, వైకుంఠ ధామాలు, డంప్ యార్డులు తదితర ఆంశాలపై అధికారులకు దిశానిర్దేశం చేశారు. సీఎం హరితహారం కల నేర్చవేర్చడానికి గ్రామాలు, పట్టణాలను పచ్చదనంతో నింపాలన్నారు. జిల్లాలో వెజ్-నాన్వెజ్ మార్కెట్లకు సంబంధించి స్థల సేకరణ పూర్తయిందని, జిల్లావ్యాప్తంగా వైకుంఠధామాలు, పల్లెపకృతి వనాలు జూలై 10 వరకు పూర్తి చేయాలన్నారు. జాతీయ రహదారులకు ఇరువైపులా మొక్కలు నాటేందుకు గుంతలు తీయాలన్నారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ శ్యాంసన్, జడ్పీ సీఈవో దేవసహాయం, జడ్పీ వైస్ చైర్మన్ వెంకటేశ్, కార్పొరేషన్, మున్సిపల్ చైర్మన్లు, మున్సిపల్ కమిషనర్లు, ఎంపీడీవోలు, తహసీల్దార్లు పాల్గొన్నారు.
సిటీబ్యూరో, జూన్ 30 (నమస్తే తెలంగాణ): రాచకొండ పోలీసు కమిషనరేట్ పరిధిలో హరితహారాన్ని భారీ స్థాయిలో నిర్వహించేందుకు సీపీ మహేష్ భగవత్ ప్రత్యేక కార్యక్రమం రూపొందించారు. గురువారం మేడిపల్లిలోని రాచకొండ పోలీసు కమిషనర్ కార్యాలయానికి కేటాయించిన ఖాళీ స్థలంలో సీపీ 200 మొక్కలు నాటనున్నారు. అలాగే 44 పోలీసు స్టేషన్లు, 8 ట్రాఫిక్ పోలీసు స్టేషన్లు, అన్ని డీసీపీ, ఏసీపీ కార్యాలయాల్లో కలిపి మొత్తం 2 వేల మొక్కలు నాటనున్నారు. రాచకొండ పోలీసు కమిషనరేట్ ఏర్పాటై ఐదేండ్లు పూర్తి చేసుకున్న తరుణంలో హరితహారాన్ని పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నట్లు మహేశ్ భగవత్ తెలిపారు.