మేడ్చల్, డిసెంబర్ 15: మేడ్చల్మున్సిపాలిటీ టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ బుధవారం గుండెపోటుతో మృతి చెందా రు.మేడ్చల్ మున్సిపాలిటీ పరిధిలోని గిర్మాపూర్ గ్రామానికి చెందిన వంగేటి మాధవరెడ్డి(47) మేడ్చల్ మున్సిపల్ టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా పని చేస్తున్నారు. మంగళవారం సాయంత్రం వరకు మేడ్చల్‌లో పార్టీ నేతలతో కలిసి ఉన్న అతను రాత్రి ఇంటికి వెళ్లి పడుకున్న అతను బుధవారం ఉదయం గుండెపోటు రావడంతో కుటుంబ సభ్యులు అతన్ని మేడ్చల్‌లోని ఓ దవాఖానకు తీసుకెళ్లగా అప్పటికే ఆయన మృతి చెందాడు.
ఆయన మృతితో కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగారు. విషయాన్ని తెలుసుకున్న గ్రామస్తులు,మండల నేతలు తండోపతండాలుగా ఆయన గృహానికి తరలివచ్చి బోరున విలపించి కన్నీటి వీడ్కోలు పలికారు. మాధవరెడ్డికి భార్య, కొడుకు, కూతురు ఉన్నారు.
మాధవరెడ్డి మృతి చెందిన విషయాన్ని తెలుసుకున్న కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి గిర్మాపూర్‌లోని వెళ్లి కుటుంబ సభ్యులను ఓదార్చి తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు.
మధ్యాహ్నం నిర్వహించిన అంత్యక్రియల్లో పాల్గొన్న మంత్రితో పాటు టీఆర్ఎస్ రాష్ట్ర నేత మర్రి రాజశేఖర్‌రెడ్డి మాధవరెడ్డి పాడెను మోశారు. మాధవరెడ్డి మృతి పార్టీని తీరని లోటని, అతని ఆత్మకు శాంతి చేకూరాలని మంత్రి పేర్కొన్నారు. అంత్యక్రియల్లో టీఆర్ఎస్ నియోజకవర్గ ఇన్చార్జి మహేందర్‌రెడ్డి, ఎంపీపీ పద్మాజనగ్రెడ్డి, జడ్పీటీసీ శైలజా విజయానందరెడ్డి, జిల్లా రైతు బంధు కన్వీనర్ నందారెడ్డి, మేడ్చల్ మున్సిపల్ చైర్పర్సన్ దీపికా నర్సింహారెడ్డి, సర్పంచ్ల ఫోరం రాష్ట్ర ఉపాధ్యక్షుడు విజయానందరెడ్డి, మాజీ జడ్పీటీసీ శైలజా హరినాథ్, ఘట్కేసర్ ఎంపీపీ సుదర్శన్‌రెడ్డి, టీఆర్ఎస్ మున్సిపల్, మండల అధ్యక్షుడు శేఖర్‌గౌడ్, దయానంద్ యాదవ్, బీజేపీ జిల్లా అధ్యక్షుడు విక్రంరెడ్డి, కాంగ్రెస్ నియోజకవర్గ కన్వీనర్ హరివర్ధన్‌రెడ్డి, ఆయా గ్రామాల సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, మున్సిపల్ కౌన్సిలర్లు, పార్టీ నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు.