Iran Protests : ఇరాన్ (Iran) లో ప్రభుత్వ వ్యతిరేక ఆందోళనల్లో ఇప్పటివరకు రెండువేల మందికిపైగా ప్రాణాలు కోల్పోయారు. వేల మంది అరెస్టయ్యారు. అగ్రరాజ్యం అమెరికా (USA) హెచ్చరిస్తున్నా ఆందోళనకారులపై ఉక్కుపాదం మోపుతామని సుప్రీం లీడర్ (Supreme Leader) ఖమేనీ (Khameni) స్పష్టం చేస్తున్నారు. ఇలా నిరసనలను అణచి వేసేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్న ఇరాన్ ప్రభుత్వం.. దీని కోసం విదేశీ మిలీషియా సాయం తీసుకుంటున్నట్లు పలు నివేదికలు వెల్లడిస్తున్నాయి.
వేల సంఖ్యలో నిరసనకారులు ప్రాణాలు కోల్పోతున్నారని వార్తలు వస్తున్న సమయంలో ఈ వ్యవహారం చర్చనీయాంశమైంది. ఇరాన్‌కు చెందిన ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్ కోర్.. ఇరాక్ మిలీషియా సాయం తీసుకుంటున్నట్లు సమాచారం. ఆందోళనలను అణచి వేసేందుకు వందలాది సాయుధులను నియమించుకొని, టెహ్రాన్‌కు తీసుకువస్తున్నట్లు ఇరాన్ ఇంటర్నేషనల్ పేర్కొంది. ఇప్పటికే దాదాపు 800 మంది సరిహద్దు దాటి ఇరాన్‌లోకి వచ్చినట్లు తెలిపింది.
వీరంతా కటైబ్ హెజ్బొల్లా, హరాకత్ అల్-నుజాబా, లివా సయ్యిద్ అల్ షుహాదా తదితర సంస్థలకు చెందిన వారిగా అంచనా వేసింది. ఈ ఆపరేషన్‌పై ఇరాక్ ప్రభుత్వం అధికారికంగా స్పందించనప్పటికీ దీని గురించి వారికి పూర్తి సమాచారం ఉన్నట్లు తాజా నివేదిక పేర్కొంది. మతపరమైన పర్యటన పేరుతో ఈ సాయుధ దళాలు మూడు మార్గాల్లో ఇరాన్‌లోకి ప్రవేశించినట్లు తెలుస్తోంది. పవిత్ర నగరమైన మషాద్‌లో ఉన్న ఇమామ్ రెజా సందర్శన పేరుతో దేశంలోకి అడుగు పెట్టినట్లు సమాచారం.
తొలుత వీరందరినీ ఓ ప్రాంతానికి తరలించి, అక్కడ నుంచి షాలంచా, జదీదత్ అరర్, ఖోస్రావి సరిహద్దు క్రాసింగ్‌ల మీదుగా ఇరాన్‌లోకి పంపించినట్లు తెలిసింది. ఈ సాయుధులు ఇరాకీ యాసలో అరబిక్ మాట్లాడుతున్నారని ఇరాన్ ఆందోళనకారులు చెబుతుండటం ఇందుకు బలాన్ని చేకూరుస్తోంది. విదేశీ మిలీషియాను వినియోగిస్తోందని ఇరాన్‌పై గతంలోనూ ఆరోపణలు వచ్చాయి.