కీసర, నవంబర్ 8: కీసరగుట్టను తెలంగాణలోనే గొప్ప పర్యాటక క్షేత్రంగా తీర్చిదిద్దటానికి మన సీఎం కేసీఆర్ రూ.80 కోట్లతో ప్రణాళికలు రూపొందిస్తున్నారని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి తెలిపారు. కార్తిక మాసం మొదటి సోమవారం కావడంతో రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి కుటుంబ సమేతంగా కీసరగుట్టకు చేరుకొన్నారు. ఆలయ చైర్మన్ తటాకం నాగలింగం శర్మ, ఆలయ కార్య నిర్వహణాధికారి కట్టా సుధాకర్‌రెడ్డిలు, వేద పండితులు కలిసి ఘనంగా మంత్రి దంపతులకు పూర్ణకుంభంతో స్వాగతం పలికి ఆలయంలోకి ఆహ్వానించారు.
ముందుగా మంత్రివర్యులు గర్భాలయంలో స్వామివారికి ప్రత్యేక పూజాధికాలను నిర్వహించారు. అనంతరం ఆయన సతీమణితో గజస్తంభం ముందు కార్తిక దీపాలను వెలిగించారు. ఈ సందర్భంగా మంత్రివర్యులు మాట్లాడుతూ తెలంగాణలో కీసరగుట్ట శివాలయ పుణ్యక్షేత్రం చాలా సుప్రసిద్ధ క్షేత్రంగా విరాజిల్లుతుందన్నారు. తెలంగాణ ప్రభుత్వం కీసరగుట్టను గొప్ప క్షేత్రంగా తీర్చిదిద్దటానికి మన సీఎం కేసీఆర్, రాజ్యసభ సభ్యులు సంతోష కుమార్‌లు కోట్లాది రూపాయలు వెచ్చించి అభివృద్ధి చేస్తున్నారని అన్నారు.
వచ్చే రెండేళ్లలో కీసరగుట్ట పుణ్యక్షేత్రం రూపురేఖలే పూర్తిగా మారిపోతాయన్నారు. తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తరువాతనే యాదాద్రి పుణ్యక్షేత్రం దేశంలోనే నెంబర్‌వన్ పుణ్యక్షేత్రంగా మారిపోతుందని అన్నారు. మన ప్రాంతంలో జరిగిన అభివృద్ధిని ఇతర ప్రాంతాల వారు ఆదర్శంగా తీసుకుంటున్నారన్నారు.
కార్యక్రమంలో మల్కాజ్గిరి పార్లమెంట్ టీఆర్ఎస్ ఇన్చార్జి మర్రి రాజశేఖర్ రెడ్డి, మేడ్చల్ నియోజకవర్గ ఇన్చార్జి చామకూర మహేందర్‌రెడ్డి, కీసర ఎంపీపీ మల్లారపు ఇందిరా లక్ష్మీనారాయణ, జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ బెస్త వెంకటేశ్, పిర్జాదీగూడ మేయర్ జక్కా వెంకట్‌రెడ్డి, నాగారం మున్సిపల్ చైర్మన్ కౌకుట్ల చంద్రారెడ్డి, వివిధ ప్రాంతాలకు చెందిన సర్పంచ్‌లు కౌకుట్ల గోపాల్‌రెడ్డి, ఎంపీటీసీ తటాకం నారాయణ శర్మ, టీఆర్ఎస్ నేతలు జలాల్పురం సుధాకర్‌రెడ్డి, బి.రమేశ్ గుప్తా, గుర్రం మల్లారెడ్డి, రామిడి ప్రభాకర్ రెడ్డి, నాయకపు వెంకటేశ్ ముదిరాజ్, గుర్రం లక్ష్మారెడ్డి, బిజ్జ శ్రీనివాస్ గౌడ్, సింగారం నారాయణ, ఆలయ ధర్మకర్తలు బోడుసు రమేశ్ యాదవ్, రామిడి బాల్‌రెడ్డి, గుర్రం కృష్ణారెడ్డి, భాగ్యలక్ష్మీ, సాయినాథ్ గౌడ్, ఆర్.శ్రావణ్ కుమార్ గుప్త, నరేశ్ గౌడ్లతో పాటు పలువురు పాల్గొన్నారు.