Jammu and Kashmir : జమ్మూకశ్మీర్లోని కథువా జిల్లాలో శుక్రవారం జరిగిన ఎన్కౌంటర్లో పాకిస్తాన్ కు చెందిన ఉగ్రవాది హతమయ్యాడు. జమ్మూ-కాశ్మీర్ పోలీసులు జరిపిన కాల్పుల్లో ఉగ్రవాది హతమయ్యాడని ఇన్స్పెక్టర్ ఆఫ్ జనరల్ పోలీసల్ భిమ్ సేన్ టుటి తెలిపారు.
ఆయన వెల్లడించిన వివరాల ప్రకారం.. జమ్మూకశ్మీర్లోని కథువా జిల్లా, బిలావర్ ప్రాంతంలో భారత ఆర్మీ, సీఆర్పీఎఫ్ జవాన్లు సంయుక్త ఆపరేషన్ చేపట్టారు. ఇంటెలిజెన్స్ నుంచి వచ్చిన సమాచారం ఆధారంగా పోలీసులు ప్రత్యేకసోదాలు చేపట్టారు. ఈ ప్రాంతాన్ని జవాన్లు చుట్టుముట్టి గాలించగా.. తీవ్రవాది గుర్తించి మన భద్రతా సిబ్బందిపై కాల్పులు జరిపాడు. వెంటనే భారత దళాలు ఉగ్రవాదిపై ఎదురు కాల్పులు జరిపారు. ఈ ఘటనలో పాకిస్తాన్ కు చెందిన ఉగ్రవాద సంస్థ జైషే మహ్మద్ కమాండర్ అయిన ఉస్మాన్ అనే ఉగ్రవాది మరణించాడు.
అతడివద్ద నుంచి ఎం4 ఆటోమేటిక్ రైఫిల్, ఇతర ఆయుధాల్ని భద్రతా దళాలు స్వాధీనం చేసుకున్నాయి. ఇంకా ఈ ప్రాంతంలో సోదాలు కొనసాగుతున్నాయి. ఉగ్రవాదులు ఎవరైనా ఉన్నారా అనే కోణంలో గాలింపు చర్యలు చేపట్టారు.