మేడ్చల్ రూరల్, నవంబరు 7 : రాష్ట్రంలో రైతులు పండించిన ప్రతి గింజనూ కొనుగోలు చేస్తామని కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు. మేడ్చల్ నియోజకవర్గంలోని మునీరాబాద్, పూడూరు, రాజబొల్లారం, రావల్కోల్, డబిల్పూర్, రాయిలాపూర్, మేడ్చల్‌లో పర్యటించి, పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. రూ.2కోట్లతో పూడూరు అనుబంధ గ్రామమైన గోసాయిగూడలో ఫంక్షన్ హాల్ నిర్మాణాన్ని ప్రారంభించారు. అలాగే మేడ్చల్, డబిల్పూర్, పూడూరులో ధాన్యం కొనుగోలు కేంద్రాలను జడ్పీ చైర్మన్ శరత్ చంద్రారెడ్డితో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా నిర్వహించిన సమావేశాల్లో మంత్రి మల్లారెడ్డి మాట్లాడుతూ రైతు సంక్షేమానికి సీఎం కేసీఆర్ పెద్దపీట వేస్తున్నారని చెప్పారు. కేంద్రం ధాన్యం కొనుగోలు చేయడానికి ముందుకు రాకున్నా, రైతును ఆదుకోవాలన్న ఉద్దేశంతో పండించిన ప్రతి గింజనూ ప్రభుత్వం కొనుగోలు చేస్తున్నదని తెలిపారు. కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా సాగునీరు, 24 గంటల ఉచిత కరెంట్, పెట్టుబడులకు రైతుబంధు, రైతు కుటుంబాన్ని ఆదుకోవడానికి రైతుబీమా ప్రవేశపెట్టిన ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కుతుందన్నారు.
రోడ్లు, డ్రైనేజీ, నీరు మౌలిక సదుపాయాలకు దూరంగా ఉన్న గ్రామాలు ఏడేండ్ల పాలనలోనే వసతులు సమకూరాయని పేర్కొన్నారు. నియోజకవర్గంలో ఉన్న 61 గ్రామాల అభివృద్ధికి రూ.10 లక్షల చొప్పున రూ.6.10 కోట్లు కేటాయించినట్లు తెలిపారు. పూడూరు సహకార సంఘానికి టీఆర్ఎస్ నేత మర్రి రాజశేఖర్ రెడ్డి కృషితో వెజిటెబుల్ క్లస్టర్ మంజూరైందని, త్వరలో ప్రారంభించనున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ పద్మాజగన్ రెడ్డి, జడ్పీటీసీ శైలజావిజయేందర్ రెడ్డి, రైతుబంధు సమితి జిల్లా అధ్యక్షుడు నందారెడ్డి, డీసీఎంఎస్ వైస్ చైర్మన్ మధుకర్ రెడ్డి, వైఎస్ ఎంపీపీ రజితరాజమల్లారెడ్డి, మేడ్చల్ మున్సిపాలిటీ చైర్పర్సన్ దీపికానర్సింహా రెడ్డి, వైస్ చైర్మన్ రమేశ్, సర్పంచులు గణేశ్, బాబుయాదవ్, మహేందర్, గీతాభాగ్యారెడ్డి, నర్మదాగోపాల్ రెడ్డి, పీఏసీఎస్ చైర్మన్లు సుధాకర్ రెడ్డి, రణదీప్‌రెడ్డి, సురేశ్ రెడ్డి, ఎంపీటీసీలు వెంకటేశం, రఘు, అనుపమ శ్రీకాంత్ రెడ్డి, గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ భాస్కర్ యాదవ్, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు దయానంద్ యాదవ్, ప్రధాన కార్యదర్శి దర్శన్, టీఆర్ఎస్ నాయకులు, మాజీ ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
జవహర్‌నగర్ : జవహర్‌నగర్ కార్పొరేషన్ పరిధిలోని 16వ డివిజన్ కార్పొరేటర్ విశ్రాంతమ్మ కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ ఆదివారం మృతి చెందింది. విషయం తెలుసుకున్న మంత్రి మల్లారెడ్డి కార్పొరేటర్ పార్థివ దేహానికి నివాళులర్పించారు. మేయర్ కావ్య, డిప్యూటీ మేయర్ శ్రీనివాస్‌గుప్తా, కార్పొరేటర్లు , నాయకులు పాల్గొన్నారు.